శ్లో|| విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ||(2-71)||
టీక:- యః పుమాన్= ఏ మనుజుడు; సర్వాన్ = సమస్తములైన; కామాన్ = కోరికలను, శబ్దాదివిషయములను; విహాయ = విడిచి; నిస్స్పృహః = వానియందు అశలేనివాడును; నిర్మమః = మమకారములేనివాడును; నిరహంకారః= అహంకారవర్జితుడును అయి; చరతి= సంచరించుచున్నాడో; సః = ఆతడు; శాన్తిమ్ = శాంతిని; అధిగచ్ఛతి = పొందుచున్నాడు.
భావము: ఎవడు సమస్తములైన కోరికలను, శబ్దాది విషయములను త్యజించి వానియందే మాత్రము ఆశలేక, అహంకార మమకారవర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు.
శ్లో|| ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ
నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||(2-72)||
టీక:–
పార్ధ= ఓ అర్జునా!,
ఏషా= ఇది, బ్రాహ్మీస్థితిః=
బ్రహ్మసంబంధమైనస్థితి,
ఏనామ్ = దీనిని, ప్రాప్య= పొంది, న విముహ్యతి
= విమోహమును జెందడు,
అన్తకాలే 2 పి =
అంత్యకాలమందుగూడ,
అస్యామ్ = ఈ
స్థితియందు, స్థిత్వా =
నిలిచి, బ్రహ్మనిర్వాణమ్
బ్రహ్మానందమును (మోక్షమును),
ఋచ్ఛతి = పొందుతున్నాడు.
భావము: అర్జునా!
ఇదియంతయు బ్రహ్మసంబంధమైన స్థితి; ఇట్టి బ్రాహ్మీస్థితిని బొందినవాడు మఱల నెన్నటికిని
విమోహమును జెందనేరడు. అంత్యకాలమునందు గూడ ఇట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందరూప మోక్షమును
బడయుచున్నాడు.
వ్యాఖ్యానము:
మొదటి భాగము
చదివి తెలుసుకోలేము: ఇక్కడ అతి ముఖ్యమైన విషయం పై శ్లోకములలో తెలిపిరి. ఇవి చెప్పినంత సులభం కాదు. వీటి వెనుక కఠోరమైన శ్రమ దాగి ఉన్నది. చాలా మంది వీటి పైపై అర్థములు చదివి ‘ఆత్మ’ ‘శాంతి’ ‘సమస్థితి’, ‘నిష్కామకర్మ’ మాకు తెలిసిపోయాయి అన్ని సంతోషపడిపోతూ ఉంటారు. ఏదో చదివి తెలుసుకుంటే వచ్చేవి కాదు ఇక్కడ చెప్పిన విషయములు.
సుపరిచితము,
అపరిచితము: ఇక్కడ చెప్పిన గంభీరమైన విషయమును పదమూడవ హంస అను హిల్మా ఆఫ్ క్లింట్
సంజ్ఞలతో కూడిన ఆకర్షణీయమైన డయాగ్రమ్ ద్వారా ఈ శ్లోకముల (2-71& 72) భావనను పరిశోధిద్దాం. తన శైలికి అనుగుణంగా, హిల్మా
తరచుగా తన కళాకృతులను క్షితిజ సమాంతరంగా విభజిస్తుంది. ఒక భాగం సుపరిచితమైన
ప్రపంచాన్ని వర్ణిస్తుంది. మరొకటి రహస్యమైన చీకటి కోణాలను
సంగ్రహిస్తుంది. ఈ రేఖాచిత్రం మధ్య భాగము ఏకాగ్రతతో ఆత్మ పరిశీలన చేసుకుంటున్న ఒక
మనిషి తలను పోలి ఉంటుంది. మానవాళి అనుభవిస్తున్న సమస్త పీడనలు, భావనలు ఆ ఒక్కని మనసులోనికే
చొచ్చుకొని పోవుచున్నవా అను భావనను కలుగజేస్తుంది.
13వ హంస: ఎగువ మరియు దిగువ భాగాలు ఒకదానికొకటి విలోమ దర్పణాలుగా కనిపిస్తాయి, ఈ ప్రతిబింబాల యొక్క శాశ్వతత్వమును సూచిస్తూ అక్కడ రెండు త్రికోణాలను చూపించారు. ఈ త్రికోణములలో, పైకికానీ, క్రిందకు కానీ వెళుతున్న కొలది సత్యము చెల్లాచెదరై అనేక పీలికలుగా విడిపోయి గ్రహించ సాధ్యము కాదు. ఐతే కేంద్రం వద్ద ఈ విలోమ ప్రతిబింబాలు కలిసిపోయి ఏకత్వాన్ని సూచిస్తాయి. ప్రకాశవంతంగా వెలుగుతున్న కేంద్రమునకు అటు ఇటు గల త్రికోణములు చిందరవందరైన సత్యమును చూపుతున్నాయి. కేంద్రం నుండి అటు ఇటు తచ్చాడు స్థితిని అన్నమాచార్యులు "చెంచెత" అని పేర్కొన్నారు.
ఏకాగ్రత
స్థితి: మానవుడు ప్రస్తుత పరధ్యాన స్థితి నుండి ఏకాగ్రత స్థితికి మారినప్పుడు,
అక్కడ ఏకత్వం మాత్రమే ఉంటుంది. మనస్సు యొక్క పొరలలో లోతుగా, ప్రస్తుత చేతన స్థితిలో చేరుకోలేని ప్రయాణాన్ని ప్రారంభించడమే శరణాగతి. ఈ
విధంగా, కేంద్రం వైపు ఈ ప్రయాణము ‘తెలిసిన దాని’ నుండి
"నేను ఏమీ కాను" అనేదానికి - ఒక కదలికను సూచిస్తుంది. ఇది ఊహాజనిత
ప్రయాణం కాదు. వాస్తవముగా మనిషి తన సమస్త శక్తులను వినియోగించి చేయగల ఏక మార్గ (oneway)
ప్రయాణం.
తన తోకను తానే తినే పాము: నిజానికి, మనస్సును తెలిసిన మరియు తెలియని రెండు విషయములు చుట్టుముట్టినప్పుడు, ఏవి ప్రతిబింబాలో మరియు సత్యములో వేరు పరచడం కష్టమవుతుంది. ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి, ఆశ్రయణం, (=ఆశ్రయము కల్పించు మిథ్యా స్థితి) లెదా స్థితివ్యాజం (=స్థితి కల్పించు బూటకములు) అడ్డుపడతాయి. కండిషన్డ్ మైండ్ మనకు అందించే ప్రతిబింబాలను గుర్తించి త్యజించడం అత్యవసరం. ఈ ఏరివేత పని సులభ సాధ్యము కాదు. ఏలయనగా అన్వేషకుడు స్వాభావికంగా దానిలో భాగం కావడం ద్వారా, నిష్పక్షమైన ఏరివేతకు ఆటంకం కలుగుతుంది. ఇది పాము తన తోకను మ్రింగివేసినట్లు ఉంటుంది. దాని స్వంత సారాంశంతో అల్లుకున్న వృత్తాకార అన్వేషణ. అపమార్గము.
సర్వావస్థలలో
చైతన్యము (Being
aware is the complete action): మనిషి చేతిలో ఉన్నది
కేవలము తానున్న స్థితిని గ్రహించి ఊరకుండుట. అటుల
చేసిన యెడల మనస్సు యొక్క చంచలములు తగ్గిపోయి ప్రశాంతతకు తావు లభించును.
ఇంతకుముందు పేర్కొన శ్లోకములలో చెప్పిన శాంతి ఇదియే. పై బొమ్మలో చూపించినది ఆ సమత్వ
స్థితిలో ఉన్నటువంటి అనేక దృగ్విషయాల మధ్య ఉన్న ఉద్రిక్తతతను ఈ చిత్రం చూచిన
వెంటనే తెలియవచ్చును. అప్పుడు సమత్వస్థితి యొక్క అతి విశిష్టమైన లక్షణము కూడా
బోధపడును. యుద్ధరంగములోవున్నా కూడా అర్జునునికి భగవానుడు సమత్వమును ఏల బోధించినది
తెలియవచ్చును.
రెండవ భాగము
వేటగాడు: ఈ సందర్భంగా క్రింది అన్నమాచార్యుల కీర్తన కూడా పరిశీలించిన వ్యాఖ్యానము
సమగ్రముగా ఉండును.
వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి
చీటకపు చెంచెత నాచేతి లాగెరఁగవా ॥పల్లవి॥
ముఖ్య పదములకు అర్ధములు: చీటకపు = (నీ) లీలల రీతుల, విధముల, అలవోకగా; చెంచెత = A
lady belonging to forest tribes, శబరకాంత, ఇక్కడ మానవుని నీచమైన స్థితిని చూపుటకు వాడినారు; చీటకపు చెంచెత = సులభముగా అటునిటు వూగిసలాడు; లాగు
= ఆకర్షణము, నాచేతి లాగెరఁగవా = నన్నుఆకర్షించుదానినేరుగవా?
భావము: (ఈ పల్లవిలో మొదటి పంక్తి
మానవుని మనోరథమును రెండవ పంక్తి ఆ అభిలాషకు సాటి రాని మానవుని ఆధమ స్థితిని చూపిస్తవి.)
ఓ మానవుడా వేట కాడనంటూ పోటుగాడిలా నా (దైవము) వెంబడి వదలకుండా పరుగిడతావే! అతి చిన్నగాలి
తాకిడికి అటు ఇటు కదలాడే హృదయము కల నీచమానవుడా నా చురుకుతనము నీకు తెలియనిదా?
చిక్కుల జిత్తుల మనస్సు: మనస్సును అదుపులో పెట్టుకోవడం యొక్క ఆవశ్యకతను గుర్తించిన
అన్నమాచార్యులు ఈ అసమానమైన చూచాయపటమును మన మనస్సులలో నిలుపుటకు ప్రయత్నము చేసిరి.
ఈ పల్లవి నిర్దిష్టంగా దేనినీ వర్ణించనప్పటికీ, వారు నైపుణ్యమైన పదజాలం ద్వారా మన దృష్టిని ఆకర్షించి, మనలో ఉత్సుకతను రేపి నిర్ణయింపరాని ఒక సమస్యాత్మకమైన కళాఖండాన్ని
సృష్టించారు. ఈ పాట అన్నమాచార్యుల బహుముఖ ప్రజ్ఞకు గీటురాయి వంటిది.
అనేకచిత్తవిభ్రాంతాః
మోహజాలసమావృతాః: ఈ పల్లవి ప్రధాన సందేశం మనస్సు కనికరం లేకుండా లెక్కలేనన్ని అడ్డంకులను సృష్టించి దైవత్వాన్ని పొందాలనే మన తపనకు ఆటంకం
కలిగిస్తుంది. అందువల్లనే "చెంచెత" అనే పదాన్ని ఉపయోగించారు, ఇది తీవ్ర స్థాయిని ప్రతిఘటనకు సంకేతము.
“నాచేతి లాగెరఁగవా" అన్నది పరిశీలిద్దాం. ఇది "నీ స్వంత మనసు చేసే వికృత చేష్టలను
ప్రతిబింబాలను నీవే గ్రహించలేవా?" అని
ప్రశ్నించడం లాంటిది. మనము ఏదైనా మనసు అను దర్పణములో ఆయా పదములను, అయా చేష్టలను దర్శించుట ద్వారా గుర్తిస్తాం. ఈ ప్రపంచంలో మనం గుర్తించగల
వస్తువులన్నీ క్షణికము. నీడల వంటివి అని అంటున్నారు. ఈ సందర్భంగా క్రితం చెప్పుకున్న క్రింది కీర్తనలు పరిశీలి పరిశీలించ
తగినవి. "యేనుగఁ దలఁచిన నట్టే మానై పొడచూపు / మాను దలఁచిన నట్టే మానై పొడచూపు" ఇది సులభముగా అనిపించినా నీవేది తలస్తే
అదే కనబడుతుంది అన్న విషయాన్ని కూడా చెప్పారు. అలాగే, “యీ యీ
యీరీతి నా గుణము నాయందే తగిలెను” అనే పల్లవి మన ఆలోచనలే అంతర్యుద్ధం సృష్టించునది అని
కూడా చెప్పారు.
తేలికగా
తీసుకోకండి: ఈ ఉదాహరణల ద్వారా, 2-72లో చెప్పిన అత్యంత కఠినమైన
విషయాన్ని తేలికగా తీసుకోకుండా తగినంత సమయం వెచ్చించి దానిని బాగుగా గ్రహించి
చేపట్టిన మంచి గుణములు కనబడవచ్చు.
*సాంఖ్యయోగము
సమాప్తము*
x-x-x-x

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి