శ్లో|| దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||(2-56)||
టీక:-
దుఃఖేషు= దుఃఖములందు;
అనుద్విగ్నమనాః
= క్షోభమునొందని మనస్సుగలవాడునూ;
సుఖేషు =
సుఖములయందు; విగతస్పృహః
= ఆసక్తి లేనివాడునూ;
వీతరాగభయక్రోధః=
రాగము, భయము, క్రోధము
తొలగినవాడునూ (అగు); ముని = మననశీలుడు; స్థితధీః=
స్థితప్రజ్ఞుడని;
ఉచ్యతే=
పిలువబడును
భావము: దుఃఖములందు కలతచెందని మనసు
కలవాడును సుఖములందు ఆసక్తి లేనివాడును అనురాగము, భయము కోపము
వదలినవాడు అగు ఆత్మ మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును
వ్యాఖ్యానము:
Being and Trying: ఆ రకముగా వుండుట; వుండుటకు ప్రయత్నించుట
ఒకే విషయములు గావు. చిక్కేంటంటే మనమంతా ఆ
రకముగా వుండుటకు ప్రయత్నిస్తుంటామంతే. దాని మూలమున ప్రయోజనము లేదు.
యత్నము: ప్రయత్నం అనగా సహజముగాలేనిది. కొని తెచ్చిపెట్టుకున్నది. భయము లేకుండుట, భయము లేదని
చెప్పుకొనుట కూడా ఒకటికావు.
పెనం మీంచి పొయ్యిలోకి: ఇవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకు
జీవితమంటే మంచిదాని వైపు ప్రయాణము అని నూరిపోశారు. అనగా సహజముగాలేని దానిని
వున్నదని భావింపచేయుట. అందువల్ల ఒక స్థితి నుండి ఇంకొక స్థితి వైపు అడుగులు
కదుపుట అజ్ఞానంలోని చర్యలే. పరివర్తన అను ఈ ప్రయాణంలో తనను తాను, తానెంత అథమ
పరిస్థితిలో వున్నప్పటికీ, తానున్నట్లుగా తానుగా అంగీకరించడం చాలా ముఖ్యమైన
భాగం.
నీవు
గమనించగలవా?: నిజమైన యోగి తన ఆలోచనలలో కదలికలను గమనించగలడు. అది కదిలిన తర్వాత సాధారణ ప్రజలు గ్రహిస్తారు. ఇది
చాలా చిన్నవిషయం అనిపించవచ్చు. ఉదాహరణకు రద్దీ సమయములో ఒక వాహనం మరొక వాహనాన్ని
తాకడం వంటి సంఘటనను పరిగణించండి. డ్రైవర్లు ఇద్దరూ మంచి పౌరులై కూడా, ఆ క్షణానికి వివేకము కోలుపోయి, వారు దెబ్బలాటకు
దిగవచ్చు లేదా బూతులు తిట్టుకోవచ్చు. ఇది మనము చాలాసార్లు గమనించే వుంటాము.
అనురాగము, భయము, కోపము: ఆ రకంగా అనియంత్రిత ప్రతిచర్య చూపించుటకు ముఖ్య కారణములు అనురాగము, భయము, కోపము. అందుకే వీటిని
వదిలివేయమన్నారు. దీనిపై మరింత వివరణకు 3-37 వ శ్లోకం కూడా
చూడవలసినది.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి