1, నవంబర్ 2024, శుక్రవారం

సాంఖ్య యోగము. 2-47వ శ్లోకము

శ్లో|| కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి
||(2-47)||   

టీక:- కర్మణి = కర్మాచరణమునందు, కార్యము చేయుటలో; ఏవ = మాత్రమే, ఒక్కటియే; అధికారః = బాధ్యత, హక్కుపెత్తనము; తే = నీకు; మా = లేదు; ఫలేషు = దాని ఫలముల యందు; కదాచన = ఎప్పుడూ కూడా; మా = కాదు; కర్మ-ఫల = కర్మఫలములు; హేతుః= కారణము, మిష, సాకు; భూః — అవును (అని); మా — కూడదు; తే — నీ యొక్క; సంగః — ఆసక్తి (మమకారము, అభిమానము); కూడిక, చేరిక; అస్తు — ఉండుట; అకర్మణి — కర్మను మానుటయందు. 

భావము: (అర్జునా!) నీకు కర్మనుచేయుట యందే అధికారము, బాధ్యత, హక్కు కలదు. కర్మఫలముల నాశించరాదు. కర్మఫలములకు నీవు కారణభూతుడవు కారాదు, మఱియు కర్మలు మానుటయందును నీకాసక్తి  కలుగకుండుగాక!

వ్యాఖ్యానము:

సంబోధనాత్మక చిత్రము: ఇది అర్ధము చేసుకొనుటకు కొంత కఠినమైన శ్లోకము. కాబట్టి ముందుగా సంబోధనాత్మక చిత్రము ద్వారా విశద పరుచుకుందాము. క్రిందఇచ్చిన "లెస్ వెకాన్స్ డి హెగెల్"(హెగెల్ సెలవుదినములు) లో, మాగ్రిట్ ఒక అధివాస్తవిక మరియు దృశ్యపరంగా ఆసక్తికరమైన సన్నివేశాన్ని అందించారు. ఈ పెయింటింగ్ లో ఒక సాధారణ నల్ల గొడుగు పైన సగం కంటే  పైవరకు నీటితో నిండి వున్న ఒక  గ్లాసును వుంచారు.  మొత్తం మీద ఈ చిత్రపటము చుస్తూనే నీరు అటుయిటూ చిమ్మకుండా సమతుల్యంగా ఎలావున్నది, ఇది అస్థిరత మరియు కుతూహలముల  దృశ్యభ్రమను సృష్టిస్తుంది.  అయస్కాంతములా మిమ్మల్ని తనవైపు లాగివేస్తుంది. భౌతిక శాస్త్ర నియమాలను సవాలు చేస్తున్నట్లు, వాస్తవికత మరియు గొడుగు, గ్లాసుల దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే ఆలోచనలను రేకెత్తించును. 



"హెగెల్ సెలవుదినములు" అని పేరుపెట్టి బాబులారా నిజమునకు సెలవుదినములలోనూ నీ ఆలోచనలకు విరామము లేదు అని చెప్పిరేమో! మాగ్రిట్ చిత్రపటములు తరచుగా దైనందిక జీవనములోని వస్తువులను ఆశ్చర్యముకొలుపునట్లు ఒకదానికొకటి జతపరచి  ప్రేక్షకుడి సామన్య అవగాహనకు సవాలు విసురుతాయి. ఆలోచనలను రేపుతాయి. ధ్యాసను లాగిపట్టి తాము దాచిన రహస్యాన్ని వెలితీయమంటాయి.

కదలాడు ఆలోచనలుగమనిస్తే ఆ గొడుగును ఏదైనా స్థిరమైన చోట పెడితే, గ్రుచ్చి వుంచితే బాగుంటుందని ఆలోచనలు వస్తాయి. గ్లాస్ పడిపోకుండా  గొడుగుకు కట్టి ఉంచితే బాగుంటుందని భావిస్తాము.  పైగా అటు ఇటు కదలాడు గాలి ఆ గొడుగుకు  స్థిరం లేకుండా చెస్తుంది. మనలో కదలాడు ఆలోచనలతో పాటు ఆ గొడుగు కూడా కదులుతూ వుంటుంది. ఈ రకంగా స్థిరత్వంలేని అనేకానేక విషయములు ఆ గొడుగు, గ్లాసుల​ చుట్టూ తిరుగుతూ మనను ఎక్కడెక్కడికో తీసుకుపోతాయి.

అనిశ్చితము: ఈ చిత్రమునకు నిర్దుష్టమైన అర్థముగానీ, వివరణముగానీ  వుండవచ్చు లేదా లేకపోవచ్చు. దాని సమాధానము మనము కనుగొన్నా, లేకున్నా పట్టించుకోనవసరంలేదు. ఈ చిత్రములో చూపిన విధముగానే మనను వదలక పట్టి యుంచినవి మన ఎరుకలోని విషయములే.  పోతే, అవి వూహకు అందని రీతిలో రూపాంతరము చెంది భ్రమను కల్పించుచున్నవి.  కర్మ గతి కూడా అలాంటిదే.

మనసు గందరగోళముఒక ప్రక్క కర్మను చేయమంటూనే, కర్మఫలముల ఆశించ వద్దంటూ, వాటికి కారణమూ కాకూడదంటూ, కర్మములను మానవద్దంటూ గందరగోళముగా వున్న ఈ శ్లోకము మన మనోగతమును సూచించుచున్నది. పై బొమ్మను ఈ శ్లోకం యొక్క అర్థము పక్కపక్కన పెట్టి ఆలోచిస్తే చూస్తే రెండు కూడా అనిశ్చితములు అని తెలుస్తుంది అంటే దీనికి ఇదమిత్థమైన అర్ధము ఇదే అని చెప్పలేం.

సమ దృష్టి: అయినప్పటికీ ఈ శ్లోకం చేయుట కంటే చూచుట పైనే ఎక్కువ దృష్టి నిలిపి ఉన్నది అని పోను పోను తెలుసుకుంటాం. అనగా సరిగ్గా సమముగా చూచుట ఒకటియే మానవులు చేయగల కర్మము. దీని కన్నా ఇతరములు ఏమి చేసిననూ శ్లోకంలోని ఆదేశమునకు భంగం కలిగించును.

అనుభవముల జాడలు : మనము ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఆ అనుభవపు జాడలను విడిచిపెట్టకుండా పూర్తి స్థాయిలో దానిలో మునిగిపోము. అలాగే పునాదులను కుదిపేస్తున్న దుఃఖంలోనూ ఆసాంతమూ తడిసిపోము. మనలో ఏదో ఒక విషయం ఆ నాగరికత నియమాలను దాటకుండా నియంత్రిస్తుంది. అందువలన, మనము ఎంతో విప్లవకారులమని భావించినప్పటికీ ఎక్కువ స్థాయిలోనో తక్కువ స్థాయిలోనో సాంప్రదాయికులమే. సత్యాన్ని అనుభవించడానికి మనం "కనిపించని ఆ ఎల్లల" నుండి బయటకు రావాలి. ఆ సరిహద్దుల గోడలు కుటుంబ/సామాజిక సంప్రదాయాలతో, వూహలతో నిర్మించుకున్న పరిమితులతో, భయాలతో  సృష్టించుకున్నవే.

చేయుట కాదు విడుచుటఇక్కడ చేయుట అన్ని సంబోధించినది ముఖ్యముగా విడుచుట అని తెలియవలెను. మానవులు వేలాది ఏళ్ల నుండి అనేక విషయములను సేకరించి మదిలో నిలుపుకుంటున్నారు. అందు మూలమున మానవునికి సమస్యలు పెరిగేవే కానీ తగ్గిన జాడ కనపడదు. కాబట్టి 'కర్మమును విడుచుట" అను పని చేయమని అర్ధము.

Please refer to the verse 2-50 as well for more clarity.

                                                               x-x-x-x 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి