టీక:-
సర్వభూతానామ్ = సమస్తప్రాణులకును; యా = ఏది, నిశా = రాత్రియో; తస్యామ్
= దానియందు; సంయమీ = ఇంద్రియనిగ్రహముగల యోగి;
జాగర్తి = మేలుకొని యుండును, యస్యామ్ =
దేనియందు, భూతాని = ప్రాణులు, జాగ్రతి = మేలుకొని యుండునో, సా= అది, పశ్యతః= పరమార్థతత్త్వమును దర్శించుచున్న, మునేః =
(ఆత్మ) మననశీలునకు, నిశా = రాత్రి ( భవతి = యగుచున్నది).
భావము 1: సమస్త ప్రాణులకు (అనగా సామాన్య
జనులకు) ఏది రాత్రియై దృష్టికి గోచరము కాక ఉన్నదో, దానియందు (ఆ
పరమార్ధ తత్వమునందు) ఇంద్రియనిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. (ఆత్మావలోకనం చేయు
చుండును). దేనియందు (అనగా ఏ శబ్దాది విషయములందు, అశాశ్వతమైన
ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచూ) ప్రాణులు మేలుకొని ఉందురో (ఆసక్తితో
ప్రవర్తించుచుందురో) ఆ విషయ జాలము పరమార్ధ తత్వమును దర్శించు మునీంద్రులకు
రాత్రితో సమానమై ఉండును (అనగా ఆసక్తి ప్రదర్శించరు).
భావము 2: యోగులు జీవనమను దానిని (ఆత్మను) తెలియుటలోను; జీవులు విషయములు అనుభవించుటలోనూ సమయం వెళ్ళబుచ్చుదురు.
వ్యాఖ్యానము: ఇది
కీలకము, మూల స్తంభము అని చెప్పుకోదగిన శ్లోకము.
మొదటి భాగము
సామూహిక మిథ్యాభావన: ముందుగా ఈ శ్లోకం యొక్క ప్రత్యక్ష
అర్ధమును వివరించు ఒక అధివాస్తవిక చిత్రమును పరిశీలించుదాము.
మనము మత్స్యకన్య అంటూనే అందమైన యువతి పైభాగముగా కిందిభాగం చేప వలే ఉండునని
సాధారణంగా ఊహించుకుంటాం. ఈ ఊహను సవాలు చేస్తూ రెనే మాగ్రిట్
క్రింద చూపిన విధంగా "ది కలెక్టివ్ ఇన్వెన్షన్" (సామూహిక మిథ్యాభావన)
అనే పెయింటింగ్‘ను రూపొందించాడు.
అవగాహనకు కొత్త రెక్కలు: మాగ్రిట్ గారి బొమ్మ మనము ముందుగానే ఊహించి ఎంచుకొన్న
ఆలోచనలను సవాలు చేస్తుంది. సాధారణమైనదిగా పరిగణించబడే వాటిని ప్రశ్నించాలని కనువిప్పు కలిగిస్తుంది.
ఈ కళాఖండం అసాధారణమైన ఆలోచనలను స్వీకరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది మరియు
కొత్త కోణాలను అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది. కళలకు మన అవగాహనలను సవాలు చేసి, ఈ ప్రపంచం
గురించి మన అవగాహనను విస్తరించే శక్తి ఉందని నిరూపిస్తుంది.
స్వయముగా బాటను
ఎంచుకో: అన్నిటికంటే ముందుగా ఈ చిత్రం యొక్క పేరు ‘సామూహిక మిథ్యాభావన’ గమనించ తగ్గది. మానవుడు
నలుగురూ వెళుతున్నారు కదా అని ఏదోఒక బాటను పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యోగి అయినవాడు అలా కాకుండా తనకుతాను పరిశీలించి స్వయముగా తన బాటను ఎంచుకోనును.
ఈ శ్లోకంకూడా అదే విషయమును నిర్ధారించు చున్నది.
రెండవ భాగము
మనిషి, ప్రపంచము: ఈ శ్లోకంలో “సర్వభూతానాం” అని చెప్పి బాహ్య ప్రపంచములోని జనులకు యోగికి ఉన్న వ్యత్యాసం సూచించారు. “సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా
(6-29)” అను శ్లోకమును కూడా కలిపి విచారించిన యోగులు తమను బయటి
ప్రపంచమును ఒకే విధముగా తలచి, అంతర బాహ్య వ్యత్యాసములను
విడిచి, తమ కార్యములో అనగా తమలోని అజ్ఞానమును (అనగా తనలోనే వున్నా వారికి తెలియని దానిని)
శోధించుటలో నిమగ్నమై ఉందురు. దీనిపై మరింత వివరణము కొరకు అన్నమాచార్యుల కీర్తన
'వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు'పై
వ్యాఖ్యానం కూడా చూడండి.
చిహ్నాత్మక
రేయింబవళ్ళు: ఇక్కడ పగలు అనగా జీవించి ఉండుటను
(='తెలుసు' అను దానిని) రాత్రి అనగా మరణముతోను (= తెలియని దానిని) సంజ్ఞాత్మకముగా చెప్పిరి.
మనం ఎటువైపు: 'తెలుసు' అను దానిని
యోగులు విడిచి వేతురు. దీనికి విరుద్ధంగా మనమేమో 'తెలుసు' అన్న దానిలో సంచరించుటకు మొగ్గు చూపుదుము. (ఇక్కడ తెలుసు అన్న దానిలో సమస్తమైన ఆలోచనలు ఆశలు ఆకాంక్షలు కలుపుకుని తీసికొన వలెను).
తెలియదని
తెలియుటెట్లు?: ‘తెలుసు’ను అన్నవి తక్షణమో, కొంత సమయము
తరువాతనో మంథనము చేసి సాధించ గలము. కానీ, తెలియదని తెలియుటెట్లు? కావున, ఇది
ముఖ్యంగా గమనించ వలసిన విషయము. కాబట్టి తెలియదని తెలియుటకు ఆధారములు మృగ్యము.
ఉదాహరణకు, 2-27లో
పేర్కొన్న మృత్యువు. దానియందు మన ఆసక్తి కేవలము దానిని "ఏ రకముగా తప్పించుకొన వచ్చు" పై మాత్రమే. యోగులు
దానిని (మృత్యువును)
స్వీకరింతురు. అనగా మనది ప్రతిక్రియ. యోగులది స్వీకార క్రియ.
అనూహ్యమైన
మార్గము: కానీ, మరణమును కౌగలించిన వారెవరూ తిరిగి ఈ ప్రపంచమున
ప్రవేశించలేరు. అయినప్పటికీ ఒక అనూహ్యమైన మార్గము కలదు. అదియే బైబిల్లో పేర్కొన్న ఇరుకు
ద్వారము. "తమవంటి శరణాగతులుఁ దాము / గొంది నిముడుకొందురు గురుకృప జనులు"
"గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక దొడ్డతెరువువంక తొలఁగుమీ"
అన్న అన్నమాచార్యుని పలుకులు కూడా దానినే లక్ష్యముగా చెబుతున్నాయి. మనకు దారిని
చూపిస్తవి. అందుకే ఈ శ్లోకం అతి ముఖ్యమైనది.
మూడవ భాగము.
సార్వత్రిక దర్పణం: మాగ్రిట్టె గారి “Le miroir” (The universal mirror = సార్వత్రిక దర్పణం) అను అలౌకిక కళాఖండం వ్యతిరేకతల మద్య కనిపించే కీలకమైన
ఉద్రిక్తతను తలపుకు తెస్తుంది. వైవిధ్యము, ఊహాజనితము మరియు
అపరిమితమగు అంశాల కలయిక, స్థానం మరియు పరస్పర చర్యలు ఇందులో
ప్రతిధ్వనిస్తాయి. మాగ్రిట్టే నిర్మించిన ప్రపంచాలలో, అసాధ్యమైనది
సాధ్యమవుతుంది మరియు పేరులో సూచించినట్లుగానే, ఈ అద్దం
సర్వమును సర్వ దిశలలో ప్రతిబింబిస్తుంది.
లోపల ఏది? బయట ఏది? ఆ హద్దులను
నిర్ణయించు రేఖ: మాగ్రిట్టే
గారు తరచూ ప్రస్తావించే ప్రసిద్ధ
మూలాంశాలైన రాత్రి మరియు పగళ్ల అసాధారణ కలయిక ఈ చిత్రం. దీనిలో, ఒకానొక గది పాక్షికంగా కనబడుతూ వుంటుంది. బయటి ప్రపంచాన్ని
నీలమేఘ వర్ణముతోను, నులి
వెచ్చని వెలుతురుతో నిండిన గది లోపలి
ప్రపంచమును సూచించారు. అక్కడ చూపిన యువతిలో కొంతభాగము
గదిలోపలను కొంతభాగము గది బయటను ఉన్నట్లు గమనించగలము. ఆ రెండు
ప్రపంచములను వేరు చేసే ఎగుడుదిగుడు అంచు, ఆ రెండు ప్రత్యర్థి
శక్తులను నొక్కిచెప్పే ఒక నిర్వచనం లేని గీత.
ఇది మాగ్రిట్టే గారి కెరీర్‌లోని అత్యంత ముఖ్యమైన దృశ్య చిత్రాలలో
ఒకటైన ప్రసిద్ధ L'empire des lumières సిరీస్‌కు
మద్దతు ఇస్తుంది.
కలగాపులగమైన భావనలు: అదే సమయంలో, ఆ యువతిని అడ్డముగా లక్ష్యములేకుండా విభజించుచున్న ఆ
అనూహ్యమైన రేఖ మానవుని మనస్సులో కలగాపులగమైన ఆలోచనలను, తారుమారైన
విలువలను సూచించుచున్నది. మానవుడు తానున్న ప్రపంచం నుండి తనను మరియు ప్రపంచమును
విడివిడిగా చూడటానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ ఆ కనబడుతున్న యువతి రూపము కొంత
భాగం బాహ్యప్రపంచంతోను స్వీయ ప్రపంచం తోనూ నిర్మించబడింది. (మానవులంతా ఈవిధముగానే తమ తమ
ఆలోచనలను కొన్ని బయట నుండి, కొంత తమలోనే తాము
నిర్మించుకుంటారు).
నీలతి ఆచ్ఛాదయతి
అన్యవర్ణాన్ (=నీలము ఇతర రంగులను తెలియనీదు): బయటి భాగము ముదురు నీలం రంగులో చూపించి దాని గురించి
మన అవగాహనా లోపభూయిష్టమైనది అన్ని తెలిపారు. మానవులు తాము
తెలియవలసిన ముఖ్యమైన విషయములను వదలి అంతకు ఏవిధముగాను సరికాని, విలువలేని విషయములను విచారించుటలో ఆసక్తి చూపుదురు అని ఈచిత్రం
ఉద్దేశము.
ప్రాథమిక గందరగోళం: మానవుడు దేనికి ప్రాముఖ్యత ఇవ్వవలెనో తెలియక నలుగురి మాటలు
విని, వారి వాదనలు విచారించి మరింత
గందరగోళంలోకి దిగజారును. తనను తాను తెలియక, వేరెవరో చెప్పిన మాటలు పట్టుకొని, సత్యాసత్యములను
తారుమారు చేసుకుని జీవనము కొనసాగించ బోతాడు. ఈ సత్యము మనమంతా ప్రత్యక్షంగా విచారించి
కనుగొన వచ్చును. ఈనాటి ప్రపంచంలో గమనిస్తున్నటువంటి గందరగోళము అస్తవ్యస్థములకు
మూలము, ఈ స్వీయ విచారణ లేకుండా నడుచు
ప్రవృత్తి. ఇప్పుడు ఈ శ్లోకమునకు మాగ్రిట్టే గారి బొమ్మకు
అవినాభావ సంబంధం ఉందని తెలియవచ్చు.
ప్రపంచమొక
తీరని దాహం: పైన ఇచ్చిన రెండు ఉదాహరణలతో “మన ఎదుటి
ప్రపంచము విలోమ దర్పణంలా పనిచేయుచు పరీక్షించు చున్నది” అనుకోవచ్చు.
ఈ విలోమ తత్వము అన్ని దిశలలోనూ అన్ని వేళలలోనూ అందరి మీద పనిచేయుచున్నది. దీనిని తప్పించుకొనుట మానవులుగా మనకు అసాధ్యము.
అందుమూలముననే ఈ అధ్యాయములో భక్తిని ప్రతిపాదించకపోయినాను, దైవం యొక్క శరణాగతి పొందక ఇక్కడ సాఙ్ఖ్యయోగములో
చెప్పిన ఏ కార్యములు మానవుడు నిర్వర్తించ లేడు (2-59). "ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్"
x-x-x-x

,%20Le%20miroir%20universel%20_%20Christie's.png)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి