1, నవంబర్ 2024, శుక్రవారం

సాంఖ్య యోగము. 2-50వ శ్లోకము

శ్లో|| బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్
||(2-50)||  

టీక:- బుద్ధి-యుక్తః = జ్ఞాన సంపన్నుడవై; జహాతి = త్యజించుము; ఇహ = ఈ జన్మలో; ఉభే = రెంటినీ; సుకృత-దుష్కృతే = పాపపుణ్యములను; తస్మాత్ = కాబట్టి; యోగాయ = యోగము కొరకు; యుజ్యస్వ = సిద్ధపడుము, గట్టిగా ప్రయత్నింపుము; యోగః = యోగ అంటే; కర్మసు కౌశలమ్= నేర్పుతో పని చేసే కళ. 

భావము: కర్మము చేయుటయందు నేర్పరితనమే యోగము అనబడును. జ్ఞానముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును నైపుణ్యంతో ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించ గలుగును. 

వ్యాఖ్యానము:

ఆచరణలోని నిపుణతయే యోగము:  యోగమునకు అసలైన నిర్వచనం ఈ శ్లోకంలో ఇచ్చారు. కర్మలను ఆచరించుటయందు నిపుణతయే యోగము. అనగా సక్రమాచరణలో పెట్టని బుద్ధి, తెలివి అంతయు నిరర్థకము అని శెలవిచ్చారు. భగవద్గీతను ఆచరణలోనే అర్థం చేసుకోనివ్వాలని సూచించారు. చదివి తెలిసి మిడిసి పడుటకు కాదు. ఇక్కడ చెప్పిన బుద్ధి, తెలివి ఆ యోగమును నిర్వర్తించుటలోనే ఉన్నది కానీ విడిగా వానికి అస్తిత్వము లేదు. 

అంటీ అంటనట్టు వుండవలెను: ఇక్కడ చెప్పిన ఆచరణ ఏదో ఒకటి చేయుటకు మాత్రం ఆదేశము కాదు. నిష్పక్షముగా చూచినా అది మనలోని జ్ఞాపకములు అవి ప్రసరింౘు అనుభూతులను అంటీ అంటనట్టు గ్రహించి విడిచివేయ వలెను అని భగవద్గీత చెప్పుచున్నది. కాబట్టి యోగము అనగా వీటన్నింటినీ అతి సున్నితముగా పరిశీలించి వదలిపెట్టుటలోని నైపుణ్యమే అని చెప్పబడినది. 

పాప పుణ్యముల విచక్షణ: భగవద్గీత యొక్క సందేశం సమస్తము​ ఇందులోనే నెలకొల్పిరి. ఇప్పటి మన మనస్థితిలో పాప పుణ్యములను నిర్ధారించు శక్తి మానవులకు లేదు. అంటే ఇది పుణ్యము అది పాపం అను విచక్షణ వదలి; తెలిసిన దంతా నిశ్శేషముగా త్యజించుట అని అర్థం. 

ఏమి చూడాలి?​ ఈ సమస్తములో మన ఆలోచనలు,  వానిని (ఆలోచనలను) నియంత్రించు విచక్షణను; ఆ విచక్షణకు మూలమైన జ్ఞప్తిలో ఉంచుకున్న వెనుకటి సంఘటనల జ్ఞాపకములను, ఆనవాళ్ళను; వాటిని సమాహారముగా చేసి ప్రేరేపించు ప్రతికలను, చిహ్నములను; మనమాడు మాటలను; ఆ మాటలలో మనం నొక్కి పెట్టి చెప్పిన అర్ధములను; వ్యక్తం చేయలేని భావములను; వ్యక్తం చేసిన వానిలోని అవ్యక్త  భావములను కలిపి తీసుకోవాలి. 

తాత్కాలికం, అశాశ్వతత్వం: వీనిని అధిగమించకుండా మనం చేయు ఏ కార్యమైనను అసంపూర్ణముగా ఉండును. అందుకనే ప్రపంచంలో పుంఖానుపుంఖంగా పుట్టిన ప్రతిపాదనలు,  విప్లవములు,  యుద్ధములు, కవిత్వములు, నాగరికతకు నిర్వచనములు, వైఖరులు కొంతకాలమునకు కనుమరుగైపోతున్నవి లేదా రూపాంతరం చెంది తమ మొదటి దశకు ఏమాత్రము సంబంధం లేనివిగా మారిపోతున్నాయి. ఈ సత్యము మనము గడిచిన ఏ 25 సంవత్సరముల కాలమును పరిశీలించినను అవగతమౌను. 

One Way: భగవద్గీతలో పేర్కొన్న కార్యము ఒకప్పుడు చేసి ఇంకో కప్పుడు విడిచి ఇష్టానురాజ్యంగా చేయుటకు కాదు. ఈ శ్లోకం ద్వారా భగవద్గీత పూర్తిగా విశ్లేషించి అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం అని కూడా తెలుస్తోంది. లేకపోతే భగవద్గీత వృథా కవిత్వం క్రింద మిగిలిపోతుంది.

 

x-x-x-x


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి