1, నవంబర్ 2024, శుక్రవారం

2-40: సాంఖ్య యోగము. 40వ శ్లోకము

శ్లో|| నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||(2-40)||

టీక:- ఇహ = మోక్షమార్గమగు ఈ కర్మయోగము నందు; అభిక్రమనాశః = ప్రారంభించినది నిష్ఫలమగుట; న అస్థి =లేదు; ప్రత్యవాయః = విరుద్ధ ఫలితములున విద్యతే = ఉండవు; అస్య ధర్మస్య = కర్మయోగము అను ధర్మము​; స్వల్పమపి = లేశమైననూ; మహతః = గొప్పదైన​; భయాత్ = భయము నుండి; త్రాయతే = రక్షించుచున్నది.

భావము:  మోక్షమార్గమగు ఈ కర్మయోగమును ప్రారంభించి పూర్తి కానప్పటికీ నిష్ఫలమగుట  జరుగదు. కర్మయోగమున ఆచరించిన ధర్మము ఒకింతయైనను గొప్పదైన భయము నుండి (జనన మరణ ప్రవాహ రూపమైన సంసారము నుండి) రక్షించుచున్నది.

వ్యాఖ్యానము: స్వల్పమప్యస్య ధర్మస్యఅని ధర్మము అతి సూక్ష్మమైనదని చెప్పిరి. కావున ధర్మమువైపు అడుగులు వేయుట అతి ముఖ్యము.  కానీ వాటిని నిర్ణయించు శక్తి మానవునికి లేదు. ఏ కొద్దిపాటి ధర్మం చేసినా మన సర్వ చర్యలకు మూలమగు  భయం నుండి రక్షణ కలుగును అను అభయము ఇచ్చుచున్నది. ఆ కొద్దిపాటి ధర్మం గురించియే భగవద్గీత వివరణ ఇచ్చినది. 

అశక్తతా సోపాన క్రమమును తిరిగి దర్శించుదాం. 1995లో కేవలము 25 తోడేళ్ళను  ప్రవేశపెట్టినప్పుడు నాటకీయమైన మార్పులు జరిగి 15 సంవత్సరముల లోపుననే ఆ అరణ్యము తిరిగి పూర్వపు వైభవమును పొందినది. 

పై శ్లోకము, ఉదాహరణలు మనకు ఊతమిచ్చి ముందుకు అడుగులు వేయుటకు ప్రోత్సాహం ఇచ్చుచున్నవి.

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి