శ్లో|| విషయా
వినివర్తంతే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||(2-59)||
టీక:- నిరాహారస్య = శబ్దాది విషయములను ఎండగొట్టుటవలన (స్వీకరింపనట్టి); దేహనః
= జీవునకు, రసవర్ణం = విషయవాసనతప్ప,
విషయాః= విషయములన్నియు, వినివర్తనే = శుష్కించుచున్నవి;
పరమ్= పరమాత్మను, దృష్ట్వా = చూచిన పిమ్మటనో,
రసో2పి = ఆ విషయవాసనకూడ, అస్య = ఇతనికి, నివర్తతే = తొలగిపోవుచున్నది.
భావము:- శబ్దాది
విషయములు ఎండగొట్టుటవలన (స్వీకరింపనట్టి) జీవునకు, ఆయా విషయములు మదిలోన మరగున పడి శుష్కించుచున్నవే
కానీ కానీ తొలగుటలేదు. పరమును దర్శించిన
వానికి ఆ వాసనయు విషయములతోబాటు తొలగిపోవుచున్నది.
వ్యాఖ్యానము:
విషయానుభవము, విషయానురాగము: ఈ శ్లోకము భగవద్గీత
ప్రగాఢమైన లోతునకు నిదర్శనం. కేవలం విషయములను బహిష్కరించడం ద్వారా
ఇంద్రియములు కలిగించు బాధలు తొలగిపోవు. మనస్సు
విషయానుభవము వైపు ప్రేరేపించును. ఆత్మ సాక్షాత్కారము కోరి ఇంద్రియములకు ఆయా
విషయముల జోలికి పోకుండా ఎండబెట్టుచూ ఇంద్రియజయమునకై ప్రయత్నించిన సరిపోదు. ఇంద్రియముల కట్టడితో బాహ్య విషయములే దూరమైనవి గాని, వానిపై భ్రాంతి మనస్సులోనే యుండును. కావున విషయానుభవము
మానగనే ఆత్మదర్శనము కాదు. విషయానురాగము కూడ తొలగిన ఆత్మ సాక్షాత్కారమగును.
కోరికలకు
కళ్ళెము లేదు: క్రింది వేమన పద్యము చూడండి.
ఆ. ఇల్లునాలివిడిచి యినుపకచ్చలఁ గట్టి
వంటకంబు
నీరువాంఛ లుడిగి
యొంటినున్న
యంత నొదవునా తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ.(3-179)
భావము: ఇల్లు విడిచి, భార్యను వదిలి, కామానికి
గొళ్లెం వేసి, తిండి నీళ్లు మాని ఒంటరిగా ఉన్నంత మాత్రాన తత్వం అలవడదు.
అలెగ్జాండర్
ప్రయాసము: ఇవే కాక క్రింది అధివాస్తవికత ఆధారముగా రూపొందించిన
అలెగ్జాండర్ ప్రయాసము లేదా the Labors of Alexander (by Rene Magritte) అను పేరుగల చిత్రమును చూడండి. ఇందులో వేర్ల దాకా నరికివేసిన చెట్టు కాండం
కనబడుతూవుంటుంది.. ఐతే ఇప్పటిదాకా పనిచేసిన గొడ్డలి చెట్టు వేళ్ళ క్రిండ
ఇరుక్కుపోయి వుంటుంది. చెట్టూ వేళ్ళు దాన్ని బాగా అదిమిపెట్టి వుంచాయనిపిస్తుంది.
అడ్డుపడేది నువ్వే: ఈ బొమ్మ ద్వారా మాగ్రిట్ గారు ఏమి చెప్పదలిచారో
ఆలోచింతము. మన కోరికలను వృక్షాముతోటి
పోల్చుకుంటే, ఆ కన బడుతున్న గొడ్డలి మన శ్రమకు నిదర్శనము. ఇక్కడ గొడ్డలి అంటే మనము తీసుకొను
నిర్ణయములు, తీర్మానములు. ఆ చెట్టుకు, దాన్ని
నరికే గొడ్డలికి కూడా ఆధారము మన దేహము మరియు మనస్సే. కొంతనరికిన తరువాత నరకబోయేదే
నరికేందుకు అడ్డుపడుతుండని ఈ బొమ్మ తాత్పర్యం.
తీర్మానములు
సరిపోవు: ఈ రకంగా మాగ్రిట్ గారు ఈ భగవద్గీత శ్లోకము ఒకే విషయమును స్పష్టం చేస్తున్నాయని
తెలుస్తుంది. కేవలము నిర్ణయములు, తీర్మానములతో ఇంద్రియములని జయించలేము. దానిని
తెలియుటకై ఈ భగవద్గీత చదువుట అను ప్రయత్నమంతాను.
x-x-x-x

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి