1, నవంబర్ 2024, శుక్రవారం

సాంఖ్య యోగము. 2-46వ శ్లోకము

 శ్లో|| యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ||(2-46)||  

టీక:- ఉదపానే = త్రాగునీటి బావి మొదలగు వానియందు; యావానర్థః = ఎంతటి ప్రయోజనము కలదో, సర్వతః = అన్ని విధములుగా; సంప్లుత-ఉదకే = ఒక పెద్ద త్రాగునీటి సరస్సుతావాన్ (+ అర్థః) = అంతటి ప్రయోజనము; ( యథా + భవతి) ఎట్లు కలుగుచున్నదో, దానియం దెట్లు ఇమిడియున్నదో; సర్వేషువేదేషు =సమస్త వేదములందును, వేదోక్తములైన సమస్తకర్మములలోను (యావానర్థః = ఎంత ప్రయోజనముగలదో) (తావాన్ అర్థః = అంతటి ప్రయోజనము) విజానతః = తనను తానుతెలుసుకున్న, ఆత్మ స్వరూప నిశ్చయానుభవముగల; బ్రాహ్మణస్య = పరమ సత్యం తెలిసిన బ్రహ్మ జ్ఞానికి తన యందే (తథా భవతి = ఆ ప్రకారమే కలుగుచున్నది - బ్రహ్మానందమునం దిమిడియున్నది.) 

భావము: స్నానపానాదుల కుపయుక్తమగు స్వల్పజలముగల నీటి కుంటలు మొదలగువాని యందెంత ప్రయోజనముకలదో, అంతే ప్రయోజనము అంతటను నీటితో నిండియున్న సరస్సు యందు మహత్తర  ఇమిడియున్న చందమున, వేదములందు జెప్పబడిన సమస్త విషయములందును ఎంత ప్రయోజనము కలదో అంతే ప్రయోజనము పరమార్థతత్త్వము నెఱిగిన బ్రహ్మనిష్ఠునియందే నిమిడియున్నది. 

వ్యాఖ్యానము:

నాకు జ్ఞానము  ఇవ్వలేదుఈ శ్లోకం యొక్క అర్థము అతి జాగ్రత్తగా పరిశీలించవలెను. భగవద్గీతలో గల శ్లోకములు దేశ కాల పరిస్థితులు అధిగమించి అందరికీ వర్తించునట్లే, ఇక్కడ మానవుడు పలానా వ్యక్తికి ఇచ్చినంత జ్ఞానము నాకు ఇవ్వలేదు అను సందేహమును వదిలిపెట్టి భగవత్ చింతనతో సమస్త జ్ఞానమును  సాధించగలరని ఇక్కడ చెప్పబడినది.

అద్భుత యంత్రము:  మనకందరికి మన మెదడు అత్యంత సామర్థ్యము, దిట్టతనము కల పరికరమని తెలియును. ఐనప్పటికీ, ప్రపంచమంతా బాధలు, కష్టములు, సంవేదనలతో సతమతమవుతున్నది. చాలా మంది ఈ అద్భుతమును ఆవిష్కరించకనే నిష్క్రమించుదురు. ఈ అవయవము అందరికీ ప్రసాదించ బడినప్పటికీ, దీని ధారణశక్తిని కొంత మంది మాత్రమే స్పృశించ గలుగుతున్నారు. 

ఎంత కావాలి​: ఇంకోరకంగా ఆలోచిస్తే మనిషి దాహమునకు రెండు దోసిళ్ళ నీరు సరిపోతుంది. అతని అవసరాలను కొంచంతో సరిపెట్టుకోవచ్చును. దీనిని బట్టి మనం ఎక్కువ కాంక్షించేది మన మనస్సులలో నిక్షిప్తమై ఉన్న భయము ద్వారా అటువంటి పనులకు ఒడబడతాము. 

అన్నీ నీలో వున్నాయ్: దీనిని మరింత విస్తృతంగా అర్థం చేసుకునేందుకు క్రింది అన్నమాచార్యుల కీర్తనను మననం చేసుకుందాం.

 

అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము

యెన్నఁడు గాననిమాయ యెరఁగవో మనసా ॥పల్లవి॥  

 

మనిషి అన్నీ తనలో నిక్షిప్తమై ఉండగా బాహ్యములో సమాధానము కొరకు వెతుకుతాడు. దీని కంటే అథమమైన​ భ్రమ వేరేమీ లేదు అన్నారు అన్నమాచార్యులు. ఈ కీర్తనలో రెండు ముఖ్యమైన, నిశితమైన సూచనలు  గమనింపవచ్చు: 

నాలాగే వారు కూడా: మనిషి తన స్థితిని గురించి తెలుసుకునే ఉత్సాహాన్ని, ఆ స్థితి నుండి బయటపడడానికి చూపడు. మానవుడు తనలాగే వేరే వాళ్ళు  ఉన్నారని తెలిసి అప్రయొజనకరమగు సంతృప్తిని పొందుతాడు. 

ఈ శ్లోకము సామాన్య గ్రహణశక్తిని మించి, ఇప్పటి మన జీవితాన్ని వేల​ సంవత్సరాలకు ముందే చూచి క్షుణ్ణంగా పరిశీలించి వ్రాసారా అనుకునేటట్టుంది. 

x-x-x-x

విశేష వ్యాఖ్యానం: 

40 నుండి 46వరకు వున్న శ్లోకములు మానవులు చేపట్టుటకు ఒకేవొక చర్య కలదని, అద్దానిని మనకు ఎఱుకగల ఏ మార్గమునను చేరలేమని, భోగైశ్వర్యములలో చిక్కుకున్న దానిని పొందలేమని, మానవుడు ఆత్మ క్షేమమును కూడా వదలి (మరణమును సైతము లక్ష్యపెట్టక) తమకు అటువంటి  సామర్థ్యము కల్పింప లేదను విచారమును వీడి దానిని పట్టవలెనని సెలవిచ్చారు. ఆ మార్గమును తెలియునది జ్ఞానమని, తక్కినవన్నీ అజ్ఞానమని చెప్పబడినది. 


x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి