2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-51వ శ్లోకము

శ్లో|| కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్
||(2-51)|| 

టీక:- బుద్ధియుక్తాః = సమత్వముతో కూడిన​;  మనీషిణః = వివేకవంతులు; కర్మజం = కర్మము వలన కలిగిన​; ఫలమ్ = ఫలమును; త్యక్త్వా= విడిచి; జన్మబంధవినిర్ముక్తాః = జన్మమనెడి బంధమునుండి విడువబడినవారై; అనామయమ్ = దుఃఖరహితమగు; పదమ్ = స్థానమును; గచ్ఛంతిహి = పొందుచున్నారు.

భావము:   సమత్వబుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను ఆచరించుచున్నను వాని ఫలములను త్యజించి జనన మరణ రూపం బంధం నుండి విడుదల పొందినవారై దుఃఖరహితమగు మోక్షపదవిని పొందుతున్నారు.

వ్యాఖ్యానము:

విమోచనము: ఈ శ్లోకములో చెప్పిన జనన మరణ రూపబంధముల నుండి విడుదల  అనగా మానవుడు తాను ఏమిటో; తన పూర్వస్థితి ఏమిటో; తానెవరో కూడా గుర్తించలేని స్థితికి చేరుకుంటాడు.  ఆ మహానుభావులు తమకు తామే తెలియని వారవుతారు.

తమకు తామే అన్యులు: అందుకనే ఆ స్థితిని చేరుకున్న అన్నమాచార్యులు తనను తాను మూడవ వ్యక్తిగా, స్త్రీగా, సఖిగా, దూతికగా, సామాన్యునికి ప్రతీకగా అనేక మార్లు వర్ణించుకున్నారు. అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు తనను "అతడు" అని పిలుచుకున్నారు. ఈ రకమైన సంబోధనలు వారికి సహజముగవచ్చినవే కానీ కల్పితముగా తెచ్చిపెట్టుకున్నవి కావు. ఈ రెండు ఉదాహరణల నుంచి "ఆ స్థితి" మానవులందరికీ తగిన కృషి చేసిన లభ్యమగును అని తెలియుచున్నది. కాబట్టి భగవద్గీత ఏదో సిద్ధాంతము చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి గ్రంథము కాదు.

సాధించబడదు, ప్రసాదింపబడుతుంది. అయితే "ఇదేదో స్థితి బాగుంది. చక్కగా దుఃఖం ఉండదు. సుఖం మాత్రమే ఉంటుంది" అనుకుని సాధించుటకు అలవికానిది. అంతటి స్వచ్ఛమైన హృదయంతో, ఆ స్థితి సాధించు సంకల్పము వదలి సమస్థితిలో ఉంటూవుండు వారికి మాత్రమే దైవముచే/ప్రకృతిచే ఇది ప్రసాదించబడుతుంది.

ఆ వైపు అడుగులు ముఖ్యం : అందరూ ఆ స్థితిని సాధించలేకపోయినప్పటికీ, ఆ వైపు అడుగులు వేయడంతో మానవులకు అనేక విషయములు అవగతమవుతాయి. ఈ ప్రపంచమున మానవులు చేయు కార్యములు ఒకదానికొకటి విరుద్ధములై  కొరగానివిగా మారుతున్నాయి. అనగా మనము చేయి చేష్టలన్ని ప్రపంచంలోని  గందరగోళమునకు దారితీస్తున్నాయి. ఈ కొద్దిపాటి విషయం మనకు మనమే గమనించవచ్చును. 

ఏమి చేయక ఊరకుండుటయే కార్యము: 40వ శ్లోకంలో చెప్పినట్లు, ఆ వైపు వేయు అడుగులన్ని మానవునికి అత్యంతము ఆనందము మరియు తృప్తి కలిగించును. కానీ మనం ఉన్న స్థితిలో యోగ శాస్త్రవిషయములను అనుసరించక సాధ్యం కాదు. 41 వ శ్లోకము 13 వ అధ్యాయంలోని 30 వ శ్లోకం కలిపి చూచిన మానవుడు చేపట్టగల ఒకే ఒక కార్యము ఏమి చేయక ఊరకుండుట.

సాహసోపేతమైన విషయము: ఇది చెప్పినంత సులభం కాదు. అలా అని తనను తాను నియంత్రించుకుని లోలోపల కుమిలిపోవడం కాదు. స్పష్టముగా తాను చేయగలిగిందేమీ లేదని తెలుసుకొని తనలో బహ్య విషయములకు కలుగుతున్న స్పందనను గమనించి కూడా ఊరకుండుట అత్యంత సాహసోపేతమైన విషయము.

క్రమశిక్షణా లోపం: ఉదాహరణకు ఎంతో చదువుకున్నవారు, సౌమ్యులు సైతం తమ కొత్త కారును ఏదైనా ఇంకొక వాహనము స్వల్పంగా గీసుకున్నా కూడా క్షణికావేశంలో రోడ్డుమీదే  తీవ్రమైన, వినరాని పదజాలం ఉపయోగించుటకు, దెబ్బలాటలకు ఇంకా కొన్ని సందర్భములలో వారిని చంపుటకు కూడా వెనుదీయరు. ఇది మనం అందరం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం.

గొర్రెల మంద: ప్రపంచము మనందరిలోని భావనల సముదాయం. ఈ రకముగా తనదైన శైలిలో మన అంతరంగమును ప్రభావితం చేసి మనలను ఒక మెట్టుకు ఒక మెట్టు దిగజార్చు పోవుచున్నదిమన జ్ఞాపకములు కేవలము సంజ్ఞలు, సంకేతములని ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఈ సంజ్ఞల నూండి ఉద్భవించునవి భావనలు. ఇది స్పష్టంగా తెలిసిన మానవుడు ఆ పక్కకి వెళ్లడు. మనమంతా గొర్రెల మందల వలె  మన మునుపటి నైజమును ప్రదర్శిస్తూనే ఉంటాం.

x-x-x-x


1.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి