2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-64వ శ్లోకము

శ్లో|| రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి
||(2-64)||

టీక:-  తు =కానీ, విధేయాత్మా=స్వాధీనమైన మనస్సుగలవాడు; రాగద్వేష వియుక్తైః = రాగద్వేషములు లేనివియు, ఆత్మవశ్యైః = తన స్వాధీనమునందున్నవియు (నగు), ఇన్ద్రియైః = ఇంద్రియములచేత, విషయాన్ = (శరీర ధారణోపయోగములగు అన్నపానాది) విషయములను, చరన్ =అనుభవించుచున్నవాడైనను, ప్రసాదమ్ మనోనిర్మలత్వమును (మనశ్శాంతిని); అధిగచ్ఛతి = పొందుచున్నాడు.

భావము: కాని, స్వాధీనమైన మనస్సుకలవాడు, రాగద్వేష రహితములును, తనకు అధీనములై యున్నవియునగు ఇంద్రియములచే (దేహయాత్రోప యుక్తములగు) అన్న పానాది విషయములను అనుభవించుచున్న వాడైనను మనోనిర్మలత్వమును (మనశ్శాంతిని) బొందుచున్నాడు.

వ్యాఖ్యానము:

దున్నపోతు మీద వాన​: ఈ శ్లోకమును ఒక వ్యంగ్య చిత్రం ద్వారా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాము. మానవుని ప్రస్తుత స్థితి ఈ శ్లోకంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉండును అన్నదీ ఈ బొమ్మలో చూపుటకు ప్రయత్నం చేశారు. మాక్స్ ఎర్నెస్ట్ వేసిన ఎలిఫెంట్ సెలెబ్స్ (Elephant Celebes by Max Earnst) అను చిత్రమును పరీక్షగా చూడండి.



బాన కడుపు ఏనుగు: పెద్ద బాన లాంటి కడుపు వున్న రెండు కాళ్ల ఏనుగు చూడగానే నవ్వు పుట్టిస్తుంది. దాని చిన్న తలను చూస్తే అది ఏనుగో దున్నపోతో అర్థం కాదు. దున్నపోతుకు ఏనుగు తొండం అమర్చారు అనుకోవచ్చు. ఈ తొండం దాని శరీరము లోపలికి వెడుతున్నట్లు చూపారు. ఈ ఆన్నమయ్య పల్లవిలో కూడా యీ యీ యీరీతి నా గుణము నాయందే తగిలెను” మన ఆలోచనలే అంతర్యుద్ధం సృష్టించునవి అని తెలుపుచున్నది.

అహముతో సంజ్ఞలను లెక్కచేయము: ఇది ఏనుగు అని చెప్పబోతున్నట్లు అక్కడ ఒక వస్త్రములు వేయబడని, తలలేని మానెక్విన్ చెయ్యి చూపుతోంది. ఆ చేతికి వున్న సర్జికల్ గ్లోవ్ వుంది. ఆ బొమ్మ ఒక చేతితో పైకి ఏనుగును తన వైపుకు పిలుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఏనుగు వాటిని పట్టించుకున్నట్టుగా అనిపించదు. ఆ మానెక్విన్ వెనకాల పొడవైన ఎండిపోయిన చెట్టు కాండం కనబడుతుంది. ఆ చెట్టు కాండం కంటే ఏనుగును ఎత్తుగా చూపించి మానవుని యొక్క సమంజసము కాని అహమును వ్యక్తపరిచారు.

తనలో తానే చిక్కుబడును: ఈ ఆకారానికి పై భాగములో పొగ, గాలిలో ఈదుతున్న చేపలు యుద్ధ వాతావరణం సూచించును. మొత్తం మీద కృత్రిమమునకు ప్రతీక లాగా వున్న ఈ జీవి మానవుని ప్రవృత్తికి చిహ్నం. కుండ వంటి దేహము ఎంత తిన్నా, చూచినా, విన్నా తృప్తి చెందని తత్వాన్ని చూపును. తనలోకే దూరిపోతున్న తొండం మానవుడు తన ఆలోచనలలో తానే చిక్కుబడును అన్నారు. నేపథ్యంలో ఏమి చూపక,  మనిషిని ప్రభావితం చేయునది అతడేనని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఏనుగు అహేతుక ఉపచేతనకు  చిత్రరూపమైన అన్వేషణకు ఆధారాన్ని అందిస్తుంది. 

దీని నుంచి మానవుడు తన సహజ నైజమును గ్రహించి  తను చేష్ఠలను సమూలముగా సవరించుకొనవలెను ఈ శ్లోకం యొక్క అంతరార్థం.

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి