శ్లో|| యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||(2-48)||
టీక:- యోగ-స్థః = యోగములో స్థిరముగా ఉండి; కురు = చేయుము; కర్మాణి = కర్మలు (విధులు) సంగం = ఆసక్తి (మమకారము, అభిమానము); త్యక్త్వా = విడిచిపెట్టి (త్యజించి); ధనంజయ = అర్జునా; సిద్ధి-అసిద్ధ్యోః = గెలుపు-ఓటమిలలో; సమః = సమముగా ఉండి; భూత్వా = కలిగి ఉండి; సమత్వం = సమదృష్టి; యోగః = యోగము; ఉచ్యతే = చెప్పబడును.
భావము: జయాపజయము లను ద్వంద్వములు (వాని పట్ల ఆసక్తి) విడిచిపెట్టి, ఓ అర్జునా,
నీ కర్తవ్య నిర్వహణలో నిమగ్నుడవై ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే
యోగము అని చెప్పబడును.
వ్యాఖ్యానము:
సర్వావస్థలలో సమత్వము: సమత్వం ఇక్కడా సమత్వం అనగా విజయమును ఓటములను సమానంగా చూడటము అనే సామాన్య స్థాయి అర్థమే కాకుండా జీవితములోని సర్వ అవస్థలను ఆ రకముగా చూడానేర్చితిమా? అని ప్రశ్నించుచున్నది అని తెలియవలెను
ఉదాహరణకు
మరునాడు పొద్దున్నే లేచినప్పుడు
కాఫీ దొరుకుతుందా? లేదా?
ఫలహారం అందుతుందా? లేదా?
మధ్యాహ్నం భోజనం తయారుగా
ఉంటుందా? వుండదా?
రాత్రి భోజనం లభ్యమౌతుందా? లేదా?
నచ్చినట్లుగా అమర్చు చేసుకుంటాం: అవి అన్నీ నిశ్చితముగా ఉంటే, వాటిలో తనకిష్టమైనటువంటి పెరుగు కానీ కూర కానీ పచ్ఛడి గాని పప్పు కానీ వుంటవా? లేదా? వున్నా అవి తన రుచికి తగ్గట్లుగా వుంటాయా? నిన్న తిన్న పచ్చడి కానీ కూర కానీ తిరిగి రాకూడదు అని కోరుకుంటాము. ఈ రకంగా మనకు తిండికి లోటు లేకపోయినా తిండి గురించి అనేక విధాలుగా ఆలోచించి మనకు తగినట్లుగా అమర్చు చేసుకుంటాము. ఈ ఏర్పాటు చేసుకోవడం నిష్పాక్షికంగా చూస్తే సమత్వంకు దూరమైన విషయం అని తెలుస్తుంది.
సమత్వము కొన్నింటికే: నిజంగా మనకు సమదృష్టి ఉంటే ఏ పచ్చడినా ఏ అన్నమైనా స్వీకరించుదుము. ఒకవేళ ఒకపూట భోజనం దొరకకపోతే మనం సమదృష్టిలో ఉండగలమా? ఈ రకంగా చూసుకుంటే మన సమదృష్టి కేవలం జయాపజయములకే పరిమితమైనదని అనిపిస్తుంది.
వంకర చూపు: న్యాయానికి మనం చేయు అన్ని పనుల మీదను దీనిని ఆపాదించి చూస్తే మనకు మనమే ఏ స్థాయిలో ఉన్నది నిర్ణయించుకోగలం. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ భోజనానికి సంబంధించి అయినా ఇదే దాన్ని మనం వేసుకునే దుస్తులు, మన ఇల్లు, ఇంటిలోని సరంజామా, ఈ రకముగా అన్నింటి మీద కూడా మనం సమత్వము లేకుండా వ్యవహరిస్తున్నము అన్నదీ తెలిసిపోతుంది. అయ్యా నేను సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఆ రకంగా ప్రవర్తించుదును అని ప్రయోజనము లేదు.
అలవాటు మానలేం: ఎందుకంటే అలవాటు మానడం అత్యంత కఠినమైన విషయం. క్రింది అన్నమాచార్యులవారి కీర్తనను చూడండి.
కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు
కడలేని మనసునకుఁ గడమ యెక్కడిది ॥పల్లవి॥
భావము: సముద్రములో అలలు నిలిచిన తరువాత స్నానము చేయదలచు వారికిని, అంతేలేని కోరికలకు నెలవైన మనస్సుకు విమోచనకూ అవకాశం ఉంటుందా? (ఉండదు).
దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్న
దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు
దేహంబుగలయన్ని దినములకుఁ బదార్ఢ-
మోహమేలుడుగు దా ముదమేల కలుగు ॥కడలు॥
భావము: లౌకిక భోగములపై కోరికలు నశించిన పిమ్మట పరతత్త్వస్వరూపమును తెలిసికొందునన్నచో కోరిక లెట్లు నశించును? కోరికలు నశింపక పరతత్త్వమును జీవుడెట్లెరుంగగలడు? వీటిలో ముందేది? శరీరముపై అభిమాన మున్నంత కాలము జీవులకు భౌతికవస్తువులపై ఆశ నశింపదు. ఆశ నశింపక ఆత్మానందము సిద్దింపదు. ఈ ఆశను అధిగమించుటకు ఉపయుక్తమైన సాధనమేదో?
సమత్వమునకు దూరం మన వ్యవహారం: కావున ఇక్కడ సమత్వము అనునది ఒక విషయం లేదా ఒక ఒక గమ్యమును సాధించింతిమా లేదా అని కాదు. అనగా పిల్లలు మన మాట చెప్పినట్టు వింటున్నారా లేదా భార్య తన మాట వింటుందా? పెడచెవిన పెడుతున్నదా? బంధువులు గౌరవిస్తున్నారా లేదా? ఇకపోతే ఇలా అనేకమైన సందర్భాలను మన వ్యవహారములను మనమే గమనించవచ్చు ఈ రకంగా చూస్తే మనం పూర్తిగా సమత్వమునకు దూరముగా వ్యవహారం చేస్తున్నామని సులభంగా తెలిసిపోతుంది.
“సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా” అనగా అనుకున్నది సిద్ధించినా లేక సిద్ధింపకున్నా అని కాదు అర్ధము. సిద్ధించుట లేక సిద్ధించకుండుట అనునవి ఒక గమ్యమును సూచించుచున్నవి. గమ్యమును నిర్ణయించి నడుచుకొనుట సామాన్యము.
సాహసోపేతమైన ప్రయాణము: గమ్యమును, గమ్యమును నిర్ణయించు దానిని విడిచి నడువుమని భగవద్గీత ఆదేశము. కానీ అలాంటి సాహసోపేతమైన ప్రయాణమును విజయమే పరమావధిగా భావించు వారు అపాయకరమైనది, విపత్కరమైనది అని ముద్ర వేసి త్రోసిపుచ్చుదురు.
ఛేదించరాని పెనుసవాలు: సన్యాసము అనగా భార్య, పిల్లలను, బంధువులను ఈ ప్రపంచమును వదిలిపెట్టంటంకాదు. ఈ సంసారంలో ఉంటూనే అంటీ అంటనట్టు ఉండడం. మానవులందరికీ ఒక పెద్ద సమస్య! ఛేదించరాని పెనుసవాలు! ఈ ఒక్క సమత్వమును సరిగా వీక్షించిన అదే సన్యాసం.
జీవనమొక అంతులేని క్రమం: మానవ చరిత్రలో పూర్వమెన్నడు లేని, ఆచరణ యోగ్యమైన, నిత్య నవీనమైన, అత్యద్భుత క్రమంలో కనుల ముందు జీవనమను దానిని సాక్షాత్కరింప చేస్తారు.
సమస్థితిని కనుక్కో: మనకు తెలిసిన ఈ ప్రపంచం దోపిడీ, ఆకలి, అసమానతలతో నిండి ఉంది. ఈ అడ్డంకులను అడ్డుపెట్టుకుని ఆలోచనల ద్వారా ఏర్పడని, మానవ మనస్సు నిర్మించని, సందేహాలతో కలుషితం కాని ఒక గొప్ప క్రమం దాగి ఉంది. భగవద్గీతలో (7-7) పేర్కొన్న "మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ" (పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి) యొక్క అర్ధము కూడా ఇదే. జయాపజయములకు అతీతముగా వున్నటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పినది. మానవులమైన మనం, ఈ శరీరముతో ఉండాగానే ఆ సమతౌల్య స్థితిని కనుగొనవచ్చని భగవద్గీత ప్రతిపాదిస్తున్నది.
మన ప్రవృత్తి: "ఏం జరిగినా నాకు సమ్మతమే" అని జిడ్డు కృష్ణమూర్తి చేసిన ప్రకటనతో ఈ స్థితికి సంబంధం ఉంది. కానీ మన ప్రవృత్తి "కొన్నిట్టిపైకోపము కొన్నిటి పైవేడుక" అని చిన తిరుమలాచార్యులు చెప్పినట్లుగా వుంటుంది. ఇది జిడ్డు గారు చెప్పిన దానికి పూర్తి విరుద్ధం. అందువలన ఆర్యులారా, చేయవలసిన ప్రాథమిక పని ఏమిటంటే, 'మనం ఏమిటో అర్థం చేసుకోవడమే' కానీ స్వర్గానికో లేదా మరేదానికైనా దేవులాడటం కాదు.
దృష్టి సత్యము పైనే: ఈ రకంగా చూసుకుంటూ పోతే మన దృష్టి అంతా ముందటి శ్లోకంలో హెగెల్ సెలవు దినములు అను చిత్రంలో గొడుగుమీద ఉన్న గ్లాసులోని నీటిని పడిపోకుండా చూచుటలో మన దృష్టి అంతా దాని మీదే కేంద్రీకృతమై మన చుట్టూ ఉన్న ప్రపంచమును మరి దాని చిహ్నములను మరిచిపోతాము.
అనవసరమైన చిక్కులు: ఆ పరిస్థితిలో మన ఉండగా ఎవరైనా వచ్చి "ఏమయ్యా ఈ పనికిరాని పనులలో సమయాన్ని వృథా చేసుకుంటున్నావు?" అంటే అపుడు మనకు ఈ ప్రపంచము అను స్పృహ కలుగుతుంది. తిరిగి ఇదేంటి నేను చిన్నపిల్లవాడి లాగా అనవసరమైన పనులలో చిక్కుకున్నానని అనిపిస్తుంది.
మన శ్రద్ధ ఎంత?: భగవద్గీతలో చెప్పినటువంటి సమత్వం మనము పూర్తిగా
జీర్ణించుకొని ఆ ప్రకారంగా జీవనం గడుపుతూ ఉండే అదే యోగము. క్షణ క్షణం మన మనసు పలు
విధములుగా పరుగు తీస్తుంటే సమస్యలు దూరమవుతాయా? ఆ హెగెల్
సెలవు దినములలోని గొడుగుపై ఉన్న గ్లాసులోని నీళ్లు ఒలికితే తన జీవితమే వృధా
అయిపోతుంది అనుకుంటే, ఆ సమయంలో మనం ఆ నీటిని గ్లాసులో నిలిపి ఉంచుటపై మనము
ఎంత శ్రద్ధ వహిస్తాము? చెప్పండి? సమత్వం చేకొని మాత్రమే యోగమును చేరవచ్చు. మరియే రకముగాను దీనిని సాధించలేము.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి