టీక:- వ్యవసాయాత్మికా =
వ్యవసాయము చేయుటకు అనువైన, కృషిచేయుటకు తగినది , ప్రయత్నము చేయ తగినది,
సాగు
చేయుటకు అనుకూలమైనది, దృఢమైన నడవడి; బుద్ధిః= బుద్ధి; ఏకా = ఒకటి; ఇహ = ఈ పథములో; కురు-నందన = కురు వంశీయుడా;
బహు-శాఖాః =
అనేక-శాఖలుగా; హి = నిజముగా; అనంతాః = అంతులేని; చ = మరియు; బుద్ధయః = బుద్ధి; అవ్యవసాయినామ్ = ప్రయత్నము చేయ రానివి, దృఢ సంకల్పం లేనివి,
ఆధారము
లేనివి.
భావము: ఓ అర్జునా! నిశ్చయించి
అందిపుచ్చుకొనుటకు మనస్సుకు ఒకే ఒక మార్గము కలదు. చంచలమైన మనస్సు మాత్రమే
అసంఖ్యాకమైన ఎంపికలను అంచనా వేస్తూ తడబడిపోతుంది.
వ్యాఖ్యానము:
భగవద్గీత ప్రాథమిక శ్లోకములలో ఒకటి. ఇది మనము చేయు ఎంపికలపై దృష్టి పెడుతుంది. అనుసరించుటకు ఒకేవొక నిజమైన మార్గం ఉంది. కానీ దానికి మార్గం-మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. దీనికి విరుద్ధంగా, అనుసరించ దగని మార్గాలు కోకొల్లలు. అయినప్పటికీ మనందరి చర్యలు వాటిలోకే వస్తాయి. అనుచితమైన వానిని ఆపివేయడమే మానవుడు చేపట్టగల ఏకైక చర్య.
తగని చర్యలు:పై పేరా నుండి "మన ప్రస్తుత (మానసిక) స్థితిపై ఆధారపడిన చర్యలు సత్యాన్వేషణకు తగవు" అని తెలుసుకున్నాము. మన చర్యలన్నీ నిరాధారమైనవని గుర్తించి, ఫలితంగా ఏర్పడే అనిశ్చితి స్థితిని హృదయపూర్వకముగా స్వీకరించినప్పుడు, మనం సహజంగా మన గతం నుండి విడిపోతాము అన్నది ఈ శ్లోకము యొక్క మూల ఉద్దేశ్యము. అదియే "పూర్తి నిష్క్రియాత్మకత." ఎటువంటి ఎంపికల ప్రమేయములేని ఈ నిర్లిప్తతతను ధ్యానం అనవచ్చును. భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయం మొత్తం ఈ భావనకు అంకితం చేయబడింది. నిజమైన ధ్యానం అనేది పూర్తి నిష్క్రియాత్మక స్థితి లొనిది. అది మన ప్రస్తుత అవగాహన నుండి అంచనా వేయలేని స్థితి కావున దీనిపై చర్చించీ ప్రయోజనము లేదు.
మరణము: మన ప్రస్తుత స్థితికి మరియు ఉన్నత స్థితికి (పరము) మధ్య సరిహద్దుగా మరణము పనిచేస్తుంది. కావున మరణాన్ని అధిగమించక (=అర్థం చేసుకోకుండా) ఆ ఉన్నత స్థితికి చేరలేము. ఇది మరణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతోంది. మన ప్రస్తుత ఉనికి మరియు ఉన్నత స్థితి (పరము) రెండూ కూడా మానవులకు చేరు అవకాశం వుంది. అందువల్ల, రెండు మార్గాలు కూడా ఇక్కడే మనం నివసించే ప్రపంచంలోనే అందుబాటులో ఉన్నాయి అని నిర్ధారణకు రావచ్చును. ఈ రకంగా ఆలోచిస్తే స్వర్గం నరకం అను ఊహాజనిత భావములకు భగవద్గీత చేయూతనివ్వదు అన్నది సులభంగా గ్రహించవచ్చు (2- 42, 43 & 44).
ఇరుకు ద్వారము: “వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన”లో చెప్పినది అదే. సరియైన మార్గము ఒకేటే కలదు అని చెప్పి వదిలేసారే కానీ అది ఏమిటో స్పష్టం చేయలేదు. దానిని సాధించడానికి నిర్దిష్ట మార్గం ఏదీ వివరించబడలేదు. దీనిని బైబిల్ (బైబిలు, మత్తయి సువార్త 7: 13-14)తో పోల్చవచ్చును. “13ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే”. బైబిల్లోనూ దీని మీద ఇంత కంటే పెద్ద వివరణ ఇవ్వలేదు. ఈ ఇరుకైన ద్వారం గుండా ప్రయాణించిన వారి మనసు రూపాంతరం చెంది, ఇప్పటి ఈ జీవితపు అనుభవాలను ఆపై గుర్తుంచుకోలేరు అని తెలియుచున్నది.
అన్నమాచార్యుల అభిప్రాయము: “తమవంటి శరణాగతులుఁ దాము గొంది నిముడుకొందురు గురుకృప జనులు” అను పదములతోను "గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక దొడ్డతెరువువంక తొలఁగుమీ" (అదిగో అక్కడ కనబడుతున్న చిన్న ద్వారం గుండా వెళ్ళు.) అను పదములతోను అన్నమాచార్యులు చెప్పింది కూడా ఆ ఇరుకు మార్గమే.
కీలకము: పదకొండవ శ్లోకం లాగానే ఈ శ్లోకము కూడా కీలకమైనది అనేక సందర్భములలో అనేక మార్లు దీని ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీత మొత్తం దీనిలోనే నిక్షిప్తం చేసి ఉంచారు. ఎవరైతే ఆ ఇరుకు మార్గమును కనుగొందురో వారు దైవము పేరిట సంజ్ఞలను ఆశ్రయించ నక్కరలేదు. ఏ విధులు నిర్వర్తించ పనిలేదు. వారిది ప్రత్యక్ష అనుభవము. మనది పరోక్షము.
అనుమిత (ఉప) సిద్ధాంతములు (corollaries):
వ్యవసాయాత్మికా బుద్ధి తప్ప, మిగతావన్నీ, ఎంత సమంజసముగా అనిపించినా, అవి అజ్ఞానంలోని భాగములే. (అజ్ఞానం యదతోఽన్యథా 13-12)
వ్యవసాయాత్మికా బుద్ధి అనునది స్పష్టంగా నిర్వచించబడలేదు కాబట్టి, అదికాని దాన్ని మినహాయించడం ద్వారా దానిని తెలియు ప్రయత్నం చేయాలి. క్రమపద్ధతిలో అన్వయించని వానిని వదలివేస్తూ పోతే, మిగిలినది, ఎంత అసంభవమైనా, వ్యవసాయాత్మిక బుద్ధి అవుతుంది.
ప్రయత్నాలన్నీ అజ్ఞానంలో భాగమేనని గుర్తుంచుకోండి. కావున, వ్యవసాయాత్మికా బుద్ధి ఏమిటో కనుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. మైమరచిన లోతైన ధ్యాన స్థితిలో తెలియకుండానే వ్యవసాయాత్మికా బుద్ధిని పొందుదురు.
ధర్మం సున్నితమైనది, సహజమైనది మరియు స్వచ్ఛమైనది. అతి చిన్న శారీరక లేదా మానసిక చర్య వల్ల కూడా అది వక్రీకరించబడుతుంది. “అకర్తారం స పశ్యతి”లో (13-30లో) సూచించిన విధంగా క్రియారహితంగా ఉండటమే ఏకైక ఆమోదయోగ్యమైన వ్యవసాయాత్మికా బుద్ధి.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి