2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-62 & 63వ శ్లోకములు

శ్లో|| ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే
శ్లో|| ||(2-62)||

శ్లో|| క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి
శ్లో|| ||(2- 63)||

టీక:- “విషయాన్"' = (శబ్దస్పర్శాది) విషయములందు; ధ్యాయతః = చింతించుచున్న; పుంసః = మనుజునకు; తేషు= ఆ విషయములందు; సఙ్గః= ఆసక్తి,; ఉపజాయతే = కలుగుచున్నది; సఙ్గాత్= ఆసక్తివలన; కామః = కోరిక; సంజాయతే = పుట్టుచున్నది; కామాత్= (అట్టి) కోరికవలన; క్రోధః = కోపము, అభిజాయతే =పుట్టుచున్నది; క్రోధాత్= కోపమువలన; సమ్మోహః = అవివేకము ( తన యొడలు తనకే తెలియని స్థితి); భవతి = కలుగుచున్నది, సమ్మోహాత్ = అవివేకమువలన; స్మృతివిభ్రమః = మఱపు (భవతి = కలుగుచున్నది), స్మృతిభ్రంశాత్ = మఱపువలన, బుద్ధినాశః = బుద్ధినాశము (భవతి = కలుగుచున్నది), బుద్ధినాశాత్ =బుద్ధినాశమువలన, ప్రణశ్యతి = నశించిపోవుచున్నాడు (పూర్తిగ చెడినవాడగుచున్నాడు).

భావము: ఇంద్రియ విషయములను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా వాటి మీద ఆసక్తి మమకారమూ పెరుగుతుంది. ఆసక్తి వలన కోరికలు; వాటి వలన క్రోధం; అందు నుండి విచక్షణా రాహిత్యము సంభవిస్తాయి.  క్రోధం నుండి మఱపు; దానినుండి అవివేకము; దానితో బుద్ధి నాశనము జరిగి మానవుని అధోగతి పాలుచేయుచున్నవి.

వ్యాఖ్యానము:

విషయములను సాధించలేము​: ఇంతకు ముందు 2-59లో విషయములను ఎండ గట్టుట ద్వారా సాధించలేము అని తెలుసుకున్నాం. ఇక్కడ విషయములలో మునిగి తేలుట ద్వారాను తెలియలేమని చెప్పడమైంది.

తీగలలా సాగు స్వభావము: మనస్సు విషయములలో క్రీడించుటలో వానియందు అనురాగము కలుగును. మనస్సు విషయములలో తిరుగుటకు తీగలలా సాగు స్వభావము  చూపును. విషయములను గాలములలో మనస్సు చిక్కుకొనును. మద్యము  పుచ్చుకొన్న వాడు "నేను తాగలేదని నటించుటలో" చుట్టు పక్కల వారికి తెలిసిపోయేలా ప్రవర్తించినట్లు - మనము ప్రతీ నిముషము విషయములలో చిక్కుకొన  లేదని నిరూపించ ప్రయత్నింతుము.

అంతరంగపు నిర్మాణము: పోతే ఇక్కడ పేర్కొన్న విషయము అతి మఖ్యమైనది. మనస్సు విషయానురాగములతో ఏర్పడియుండును. దానివలన​ వానిపై రంధితో  పురుషునికి/దేహికి (వాటితో) సంగమము ఏర్పడుతుంది. ఆ సంగమం వలన కామము కలుగును.

శత్రువు:  ఆ కామము తీరనిచో కనిపించిన వారందరూ తన కాటంకము కల్గించిరని భ్రమించి, అడ్డు తగిలినవారి పై విరచుకు పడునట్లు చేయును. ఇది క్రోధము.

సమ్మోహము: క్రోధము పెరిగేకొద్దీ మంచి చెడులు  మరచి, దేహమే తానను (అంతకు మించి లేదను) అవివేకమున బడును. ఇది "సమ్మోహము".

స్మృతివిభ్రమము: సమ్మోహము వల్ల సాధించ ప్రారంభించిన ఆత్మజ్ఞానము, ఇంద్రియ జయమును, నిష్కామ కర్మలను మరచును. ఇది "స్మృతివిభ్రమము".

బుద్ధినాశము: ఇట్టి మతిమరుపు వల్ల నిశ్చయాత్మకమైన (వ్యవసాయాత్మికా బుద్ధి) మార్గము చెదిరిపోవును. ఇది "బుద్ధినాశము".

సూటిగా చూచుటకు ఆడ్డు: ఈ రకంగా విషయానురాగములతో దేహి అధోగతి పాలౌను. మనము దేనిపై విచారించ దలచితిమో, అదియే మనస్సును ఆక్రమించుకొని భ్రమింపజేయును. ఇది మనకై మనము నిర్ధారణ చేసుకో వచ్చును.

పైపై అవగాహన: ఇప్పటి మన అవగాహన కేవలము సాభిప్రాయమే. పైపైవున్నటు వంటి పూత లాంటిది. ఇది కనుల ఎదుటి సత్యముతో సంబంధము లేకనే తనవైపు త్రిప్పుకొనును. అనగా అక్కడ కన బడుతున్న సత్యము ఒక వైపు, మనము ఇంకొక వైపు వుండుదుము. సత్యము నుండి దూరము జరుగుటయే అవివేకము. స్మృతివిభ్రమము.

జీవితము ఒక​ అవకాశము: మనకు లభించిన ఈ జీవితము అను అవకాశమును సద్వినియోగము చేయుటకు ఏమి చేయరాదో భగవద్గీతలో వివరించారు.

నిశ్చిత మార్గములు లేవు: ఇక్కడ ఉటంకించినది జ్ఞానము, స్థిర చిత్తములకు కూడా ఆపాదించ వచ్చును. మత గ్రంథములు చదివి నాకు "దైవము, మోక్షము, కైవల్యము అర్థం అయ్యాయి అనుకొనుట అవివేకము. నిశ్చిత మార్గములు (న హ్యసంన్యస్త సంకల్పో 6-2)  మోక్షమునకు దారులు కాజాలవు. భగవద్గీత వాటిని ప్రతిపాదించదు.

కోపిష్టి దేవత: ఈ శ్లోకం యొక్క అర్థమును చక్కగా చూపు ఒక అధివాస్తవికా చిత్రము ‘ద ఫైర్సైడ్ ఏంజెల్’ (కోపిష్టి దేవత) అను పేరు గల మాక్స్ ఎర్నెస్ట్ అను ప్రసిద్ధ కళాకారుడు నిర్మించిన చిత్రమును పరిశీలిద్దాము.

 


తీరుబాటులేని కార్యశీలుడు: ఒక నిర్మానుష్యమైన బంజరు భూమి నేపథ్యంలో మానవుని లాగా కనబడుతున్న ఒక వింత ఆకారం మనం మనకు కనపడు తుంది. ఇతడి అవయవములు దేహం ప్రస్ఫుటముగా వేర్వేరు రంగుల్లో ఉండి అవి తమతమ వైపు ఆ జీవిని లాగుచున్నవి అనిపింపచేయును. రెండు కాళ్లకి వేర్వేరు బూట్లను చూపి అతను ఒక త్రాటిపై నడచువాడు కాడు అని సూచించిరి. ప్రకాశవంతమైన ముదురు రంగుల వస్త్రాలు ఐశ్వర్యాన్ని మరియు సంక్షేమమును సూచిస్తున్నాయి. అతడి తీరు చూస్తే తీరుబాటులేక సమయము వృథాచేయక కార్యశీలునిలా ముందుకుకు పరుగిడు తత్వము కనబడుతోంది. 

భావములతో వికృతమొందు అంతఃకరణము: ఈ వ్యక్తి యొక్క వికారమైనటువంటి అస్తవ్యస్తమైన రూపం అనియంత్రిత భౌతిక భోగలాలసతను మరియు నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలను విస్మరించడం వల్ల కలిగే కోపం మరియు గందరగోళాన్ని సూచిస్తుంది.  పెయింటింగ్'లో అధివాస్తవిక అంశాలను ఉపయోగించి ఇష్టానుసారముగ నడౘుటలో కలుగు పరిణామాలు మరియు అవి కలిగించే భావోద్వేగ కల్లోలాన్ని అన్వేషిస్తాయి. ఇది సంపద మరియు విలాసాలపై సమాజం యొక్క వ్యామోహాన్ని విమర్శిస్తుంది. - అవి తరచుగా కోపం మరియు నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలకు దారితీస్తాయి. 

ఆధునిక  అనాగరికత: మొత్తంమీద అతడి భంగిమ నిలకడ లేని ఆదుర్దాను, గమ్యములేని గమనమును, తగినంత సంపద వుండికూడా కలవరపాటును, ఆధునికతతో కూడిన  అనాగరికతను చూపుచున్నది. 

ఆహుతియైన క్రమశిక్షణ: మనం కూడా ఆ బొమ్మలో చూపిన మాదిరి గానే అనేకానేక విషయములలో చిక్కుకుని వాటినుంచి బయటికి రాలేక ఆ బొమ్మలోని జీవి మాదిరిగానే మన మనసు నాలుగు వైపులకు లాగుతుండగా దారి, గమ్యము, స్థిరత్వము లేని జీవనం సాగిస్తున్నాం. ఈ విషయమునే ఈ శ్లోకంలో బోధించిరి.

 

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి