టీక: -
ఆపూర్యమాణమ్ = ఉదకములచే (నదీజలము మున్నగువానిచే సంపూర్ణముగ నింపబడినదియు); అచలప్రతిష్ఠమ్
= స్థిరమైనయునికిగలదియు (హద్దుమీరనిదియు) నగు; సముద్రమ్
=సముద్రమును, ఆపః = (నది
మొదలగువాని) జలములు;
యద్వత్ = ఏ రీతిగా;
ప్రవిశన్తి
= ప్రవేశించుచున్నవో;
తద్వత్ = ఆ
రీతిగనే; సర్వేకామాః
= భోగ్యవిషయములన్నియు;
యమ్ = ఏ
మనుజుని ( బ్రహ్మనిష్ఠుని);
ప్రవిశన్తి = ప్రవేశించుచున్నవో
(ప్రవేశించి అణగిపోవుచున్నవో); సః = అట్టివాడు; శాన్తిమ్ = శాంతిని;
అప్నోతి
=పొందుచున్నాడు;. కామకామీ = విషయాసక్తి కలవాడు, న (ఆప్నోతి)
= పొందడు.
తా:- ఏప్రకారముగా అనేక నదీజలములు మున్నగునవి ప్రవేశించుచున్నప్పటికి సముద్రము సంపూర్ణముగాను నిశ్చలమైనదిగా తొణకకుండా వుండునో, ఆ ప్రకారమే భోగ్యవిషయములన్నియు ఏ బ్రహ్మనిష్ఠుని ప్రవేశించి (అతనిని వికృతము చేయలేక) అణగిపోవుచున్నవో ఆతడే శాంతిని పొందునుగాని విషయాసక్తి కలవారుకాదు.
వ్యాఖ్యానము:
గంభీరమైన సముద్రము: సంకేతాత్మకమైన ఈ శ్లోకమును ఒక సింబాలిక్
పెయింటింగ్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము.
హిల్మా ఆఫ్ క్లింట్ రచించిన “Swan No 17 లేదా 17వ హంస” అనే సింబాలిక్ పెయింటింగ్ (ప్రతీకాత్మక చిత్రము) ద్వారా ఈ చరణం యొక్క
అర్థాన్ని తెలుసుకుందాం. మొదటి చూపులో, ఇది పిల్లల పుస్తకాల్లో స్కెచ్'లలో
రంగులు పూరించినట్లు కనిపించవచ్చు. అయితే,
ఇది 1.5 మీ x 1.5 మీ పరిమాణము గల భారీ పెయింటింగ్ అని మీరు గమనించవచ్చు.
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్: అర్థం చేసుకోవడానికి కష్టమైనది మరియు మౌఖికంగా చెప్పడానికి
అనుకూలించని విషయాన్ని వ్యక్తీకరించడానికి ఆమె ఈ రేఖాచిత్రాలను కష్టపడి వేసింది. పైపైన
విడిపోయినట్లు కనబడినప్పటికీ ఆ చిత్రము జీవితం యొక్క సంపూర్ణతను సూచిస్తుంది. క్రింది
భగవద్గీత శ్లోకానికి అర్థం కూడా ఇదే: భగవద్గీత శ్లోకం అవిభక్తం
చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ । భూతభర్తృ
చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥13-17 ॥ ఆయన విభజించుటకు
వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే, సమస్త భూతములకు
(ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.
ప్రపంచమంతా ఒకటే: గొప్ప ప్రఖ్యాతి
గడించిన భౌతిక శాస్త్రవేత్తలు డోనాల్డ్ హాఫ్’మన్, క్వాంటమ్ భౌతిక శాస్త్రవేత్త
ఎర్విన్ ష్రోడింగర్ "విశ్వంలోని మొత్తం మనస్సుల సంఖ్య ఒక్కటే" అని విశ్వసించారు.
అంటే ఆ విశ్వజనీనమైన మనస్సు సమస్తమునకు కారణమవుతుంది.
సమగ్రమైన చర్య: మన అంతరంగంలో
లోతుగా, మనకు కంటికి కనిపించే దానికంటే మనమే ఎక్కువ లేదా అధికులమనే
అహంభావమును కలిగి ఉంటాము. ఈ స్వాభావిక భావము మానవజాతిని తరచుగా సమగ్రమైన చర్యను
అర్థం చేసుకోకుండానే మార్పు కోసం ప్రయత్నించె దిశగా నడిపిస్తుంది. ఇటువంటి
తప్పుదారి పట్టించే ప్రయత్నాల పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తాయి, అందరూ
గమనించగలుగుతారు.
కుక్కతోక వంటి
మానసిక భంగిమ: ఈ పెయింటింగ్'లో హిల్మా అఫ్ క్లింట్
యొక్క ఉద్దేశ్యం చిత్రము మధ్యలో ఒక చిన్న త్రిభుజాన్ని ఉంచడం ద్వారా స్పష్టమవుతుంది, ఇది నిలువు అక్షం
రెండు వైపులా సమనముగా వుంచబడింది. (పై బొమ్మని చూడండి). ఈ త్రిభుజంలోని రంగులు
పెద్ద పటంలో కనిపించే రంగులకు విరుద్ధంగా ఉండటం గమనించవచ్చు. ఈ త్రిభుజం మానవాళి యొక్క
వంగని, చెప్పినట్లు వినని మానసిక భంగిమను సూచిస్తుంది. ఇది హంస
యొక్క అందమైన అద్భుతమైన వంపుసొంపులకు ఆకర్షణియమైన
రంగులకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. దీన్నిబట్టి, ప్రకృతితో సామరస్యంగా
మమేకమై "ఒకే మనస్సు"తో ఐక్యతా స్థితిని సాధించడానికి మానవుడు మరింత సరళమైన, మృదువైన దృక్పథాన్ని
పెంపొందించుకోవడం కీలకమని క్లింట్ సూచిస్తున్నారని మనం ఊహించవచ్చు.
"ఇదే నా కిటుకు: నాకు ఏం జరిగినా అడ్డుపెట్టను" అన్న జిడ్డు కృష్ణమూర్తి
మాటలతో దీన్ని పోల్చి చూద్దాం. దీనికి విరుద్ధంగా, మన మనస్సు తరచుగా ఏమి
జరుగుతుందో ఆలోచిస్తుంది. ఆదుర్దా పడుతుంది. లేనిపోని చింతలకు గురియౌతుంది. ఈ రకంగా "ఏమి జరిగినా పట్టించుకోని
మనస్సును" పె౦పొ౦ది౦చుకోవడ౦ ఎ౦త ముఖ్యమో అర్థ౦ చేసుకోవచ్చును. ఇది వ్యక్తిగత దృక్పథానికి సంబంధించిన విషయం అయినప్పటికీ, ఐతే “ఏది” “దేనిలో” మార్పు తేవలెననునది
అతి పెద్ద సమస్య. ఇదే భావన భగవద్గీతలోని ఒక శ్లోకంలో కూడా వ్యక్తమవుతుంది. “న
హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన” (6-2) భావము కేవలం దృఢ సంకల్పం మీద ఆధారపడటం ద్వారా ఒక వ్యక్తి నిజంగా యోగి కాలేడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యము.
తేజోమార్గము: ఉపరితల స్థాయి మార్పులకు
అతీతంగా నిజమైన పరివర్తన లోతైన స్థాయిలో జరగాలని సూచిస్తూ, త్రిభుజాన్ని కేంద్రంలో
ఉంచడం ద్వారా ఆఫ్ క్లింట్ మరొక ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. ఇదే భావన అన్నమాచార్యుని
'భావింప నరుదైన బంధ
మేమిట మాను'
అను మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. ఐతే రూపాంతరం అనేది ఒక వివిక్త (ఏకాంత) ప్రక్రియ
కాదని,
విశ్వజనీన మేధస్సుతో విలీనం కావడానికి వ్యక్తిగత ఆత్మ అనే భావన అడ్డుపడుతుందని ఇద్దరు కళాకారులు వ్యక్తపరుస్తారు.
విచిత్రమేమో కానీ తరతరాలుగా ఈ లోతైన భావన మానవాళిలో ఆసక్తిని రేకెత్తిస్తూనే వుంది.
బహు కొద్దిమంది మాత్రమే ఇందలి సవాళ్ళను పూర్తిగా స్వీకరించి తేజోమార్గమున పయనించ గలిగారు.
x-x-x-x-x


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి