15, ఏప్రిల్ 2024, సోమవారం

భగవద్గీత ఎందుకు చదవాలి? (3వ భాగము)

For English version press here.

ఆయుధాల్లేని విప్లవం

మనిషి తనపై తాను మనసు ద్వారా ఆధిపత్యము సంపాదించుకొనవలెనని ప్రయత్నిస్తాడు. ఈ రకముగా మనస్సుకు శాసనాధికారములు కల్పిస్తాడు.

మనస్సుపై  అస్త్రశస్త్రములు లేని విప్లవమును ప్రకటిస్తుంది భగవద్గీత. ఇది మనిషి తనపై తనలో పేరుకొని ఉన్న అభిప్రాయములను, ప్రమాణములను, సిద్ధాంతములను, తాను నమ్మిన చిహ్నములను ఉన్నవి ఉన్నఫళంగా త్యజించుటకు చేయు తిరుగుబాటు.

రణము చేయుటకు ప్రత్యర్ధి ఎవరో తెలిసిన ఎత్తులు, జిత్తులు వేసి గెలువ వచ్చును. ఆ సంగ్రామము చేయు స్థలమేది? మనమేమి చేసినా అనుకరించగల రోబో (robot) తోటి యుద్ధమనుకోండి. అపుడా అపరిమిత అనుకరణ శక్తిని జయించుటెట్లు? నీడలా వెన్నంటు దానిని వదిలించుకొనుట సాధ్యమేనా? పరిశీలింతము. 

భగవద్గీత ఒక విప్లవాత్మక గ్రంథము. ఇప్పటిదాకా మానవ చరిత్రలో వచ్చిన విప్లవములు అన్నీ ఒక పద్ధతిపై, ఒక విశ్వాసముపై, ఒక సిద్ధాంతముపై ఒక నమ్మకముపై, ఒక నియంతపై, ఒకరి అధికారముపై యుద్ధము ప్రకటించినవి. ఈ విప్లవములన్నిటి కంటేను, ప్రపంచాన్ని మలుపు తిప్పిన ఏ ఘటనకంటేను విప్లవాతకమైనది భగవద్గీత.

ఈ ప్రపంచం ఏమిటి?

"మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏమిటి?" అనే కుతూహలంతో దీని గురించి ముందు కొంత అవగాహన ఏర్పరచుకున్నప్పటికీ, రాను రాను అది మనకు పూర్తిస్థాయిలో అర్థం అవ్వలేదని అనిపిస్తూనే ఉంటుంది.

"అసలు ఈ ప్రపంచానికి మనకు మధ్య ఉన్న సంబంధమేమిటి?"  "భగవద్గీత చదవడానికి ఈ ప్రపంచాన్ని గురించి చర్చ అవసరమా?" "ఈ ప్రపంచం ఎటు పోతేనేం?" "నేను ఎందుకు దాని గురించి ఆలోచించాలి?"  అని సాధారణంగా మనమంతా అనుకుంటాం. మతములు, ఇతిహాసములు, పురాణములు, చరిత్రలు దీనిపై వివరణలు ఇస్తున్నప్పటికీ, ప్రపంచం ఒక రహస్యంగా మిగిలిపోతుంది.

మానవజాతి ఎంత  శ్రమపడినా ప్రపంచం ఒక పద్మవ్యూహంలా, కొరకరాని కొయ్యలా కనిపిస్తూనే వుంటుంది. దానిని పూర్తిగా అన్వేషించడానికి కష్టపడడం ఒక్కటే సరిపోదని కూడా స్పష్టమౌతుంది.

నాది వేరే లోకం.

నేను ఎక్కడి నుంచో వచ్చాను.

"ప్రతీ మానవుడు ఈ భూమిపై తనను తాను 'అన్యుని'గా భావిస్తాడు; తరచుగా ఈ లోకమునకు తనకు మధ్య చెప్పలేని దూరాన్ని, ఎడబాటును అనుభవిస్తాడు. సాధారణంగా ఈ పరాయి భావనను సహించలేక మన శక్తికొలది ఏదో ఒక ప్రయత్నముతో దానిని నియంత్రించ బోతాము.

నిజం చెప్పాలంటే మనము ఒక పులి అడవిలో కలిసిపోయినట్లు, పక్షి చెట్టుపై తన హక్కు అన్నట్లుగా కూర్చున్నట్లు వుండలేక పోతాము. మనము వాటిని వాటివాటి సహజ వాతావరణంలో చూసినప్పుడు మన యిప్పటి స్థితితో పోల్చుకుని కొంత ఈర్ష్యని కూడా పొందుతాం. మనము ముఖ్యంగా ఇరుగుపొరుగు వారలతో సఖ్యంగా వుండుటలో సాధారణంగా తడబడతాము.

చుట్టూవున్న వారితో స్నేహంగా వుండవలెనని మతములన్నీ బోధిస్తున్నా, పైపైకి చెలిమిని, అభిమానమును కనపరుస్తూ, లోలోపల వేరే ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. ఈ లోపలి ప్రపంచము పూర్తిగా వూహాత్మకమైనది. వ్యూహాత్మకమైనది. దానిని కూకటి వేళ్లతో సహా పెకలించి వేయమని భగవద్గీత తెలియజేయుచున్నది (భగవద్గీత 15-2, 15-3). ఐతే వాటిని, ఆ వేర్ల మూలముల​ను చేరుటకు మన సన్నాహములన్నీ,  మార్గములన్నీ స్వీయనిర్మితములే. కావున, అవి స్వీయ రక్షణకు ప్రాధాన్యము నిచ్చుచూ ఆయా యత్నములు వీగిపోవునట్లు చేయును (2-45).

ఈ రకంగా ప్రపంచానికి మనకు మధ్య ఉన్న సంబంధమును నిర్ణయించలేక సతమతమౌతాము. ఫలితంగా, అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించి మన చర్యలను సమర్ధించుకోబోతాము. మనిషి తన పరిసరములతో సహజముగా ఇమడలేక కష్టాలు, బాధలు అనుభవిస్తాడు.

మానవుడు కొన్ని విషయాలను పనికట్టుకుని కల్పించుకొని, ‘తాను అన్యుడను కానని’ ప్రపంచమును నమ్మించ బోతాడు. ఇది అనేక అనర్థాలకు నాంది పలుకుతుంది. జాగ్రత్తగా గమనిస్తే మన చర్యలన్నీ మనస్సులో ఏ మూలనో దాగుకొని వున్న భావనలకు ప్రతిక్రియలని తెలుస్తుంది.

మనం స్వేచ్ఛ ఎందుకు కోరుకుంటాం?

జీవితములోని ప్రతీ దశలోను (అవస్థలోను) మనను మనలా వుండకుండా ఏదో అడ్డుకుంటోందని తలపోస్తాము. ఆ అడ్డుతగులు దానిని నుండి మనము ఊరటను (లేదా స్వేచ్ఛను) వాంఛిస్తాం. నిశితముగా ఆలోచించిన ఇది కేవలము ప్రతిచర్య అని కనిపెట్టవచ్చును. ​

కాబట్టి, మనకు దేని నుండి స్వేచ్ఛ కావలెను? తరచుగా ఆత్మ పరిశీలనలలో మనము నిరంతరము ఒక బుల్లి న్యాయాధిపతిలా వ్యవహరిస్తాము. మన అనుభవమునకు వచ్చు ప్రతీ వ్యవహారముపై అది న్యాయము’, ‘అన్యాయము’; ‘తగినది’, తగనిది’; నాకు సమ్మతము’, ‘అసమ్మతము అను నిర్ణయములు చేస్తాము.

గంభీరమైన అన్వేషణకు స్వేచ్ఛ అవసరం, ముఖ్యంగా తెలిసినవాటి నుండి.  ప్రధానముగా తగిన పరిష్కారాలను నిర్ణయించే సామర్థ్యం మనకుందని నమ్మితే న్యాయపీఠముపై కూర్చున్నట్లే. అటువంటి తీరు స్పష్టంగా సత్యమునకు ప్రతికూలంగా ఉంటుంది.

అనగా ఒక తెల్లని కాగితములా మన  అంతరంగమును వుంచుకొన్న మన కళ్ళ ముందున్నదాని ప్రవృత్తి సహజముగా అనుభూతి చెందవచ్చును. తీక్షణమైన అన్వేషణకు ఒక పరిష్కారానికి ఏవైపు ఒగ్గకుండా ఉండే స్వేచ్ఛ అవసరం.  సమస్యను "పరిష్కారాలు" అను కళ్ళజోళ్ళతో చూడని స్వేచ్ఛ. నిశితముగా చూడ వలసినది సమస్యనా? పరిష్కారాన్నా? మనము తరచుగా “పరిష్కారాలను ఎంపిక చేస్తాము”. 

అందము. ఆనందము.

మనకు రోజులో ఒకసారి ఒక రామచిలక కానీ, ఒక నెమలి కానీ తారస పడితే అప్రయత్నముగా ఆనందము కలుగుతుంది.  గలగలా పారుతున్న నీరు, ఎంత చిన్న ధార ఐనప్పటికీ, ఆనందమును నింపుతుంది. కానీ మనిషి ఎదురౌతే అలా అనిపించదు. పైగా రక్షణాత్మక ప్రతిచర్య​ ముందుగా మనసులో మెదలుతుంది. దీనికి కారణమేమి? పులి, తోడేలు వంటి క్రూర జంతువుల నుంచైతే రక్షణ అవసరమే! కానీ తోటి మానవుల నుండి రక్షణ దేని కొరకు?

అందమైన పూవునో, భవనమునో, దృశ్యమునో చూచినప్పుడు సంతోషము కలుగును. వాని అందము వాటిలోపలిదా? మన మనస్సులో వాటిని గుర్తించిన భావమా? అసహ్యమైన గజ్జికుక్కపిల్లను కానీ, వళ్ళంతా పుళ్ళు పడ్డ కుష్టురోగిని కానీ చూస్తూనే అసహ్యము కలుగుతుంది. ఇది ప్రతిక్రియ కాదా? అందమును అస్వాదించునది, కుళ్ళును ఈసడించుకొనునది కూడా ప్రతిక్రియలే!

పైన చెప్పిందాన్ని బట్టి మనము ఇప్పుడు అనుకుంటున్న ఆనందము  దుఃఖము కూడా క్రియలు కావు. కానేరవు. ముమ్మాటికీ అవి ప్రతిక్రియలే. ఈ రకంగా చూసిన ప్రతి విషయమునకు అస్తిత్వం మనం కల్పించుకున్నదే. మనమే కల్పించుకున్న ఈ విషయాలకు ఒక నిర్దిష్టమైన మొదలు, చివర ఉంటాయి (5-22). అందుకే అవి  అనంతమునకు సంబంధించినవి కావు. కావున ఇవి పైపై భావనలే తప్ప నిజము కావు.

అనుభవమునకు వచ్చు ఆనందము  దుఃఖములపై ఆధారపడి మనము సరియైన నిర్ణయములను చేయలేము. వీటిని దాటి ఉన్నది సత్యము. ఆ సత్యమునకు మార్గము లేదు కాబట్టి భగవద్గీత ఇంతగా విశదీకరించి చెప్పవలసివచ్చింది.

గమనించవలసిన  విషయం ఏమిటంటే మన దగ్గర సత్యమును నిర్ణయించుటకు ఎటువంటి ఆధారములు లేవు. మనలాగే మిక్కిలిన వారు కూడా.  నాకు సత్యం తెలుసును నాకు దైవం తెలుసును అని చెప్పుకొనే వారిని నమ్మగలమా? మీరే ఆలోచించండి.

ఆధారమేలేని ఇట్టి పరిస్థితులలో మార్గమొక్కటియే - భక్తి. (వ్యవసాయాత్మికా బుద్ధిహి ఏకేహ కురునందన (2-41) = వ్యవసాయము చేయదగిన అంటే అనుసరించదగిన సూత్రమొకటియే. అదియే పరమాత్మ​. అదియే సత్యము. అదియే బ్రహ్మము.)

ఎక్కడ  నుండి మొదలు పెట్టాలి?

భగవద్గీత మౌనమునకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినది. మౌనము పరులకు ప్రత్యక్షముగా అర్ధముగాదు గావున అవసరములను బట్టి నోరు కదుప వలసివచ్చును.

ఒకవేళ మాట్లాడవలసి వచ్చిన దీక్షా భంగముగా భావింపక, ఒక తల్లి తాను నిద్రలో వున్నప్పటికీ కీచుమన్న బిడ్డను విసుగులేకుండా లాలనగా అక్కున చేర్చుకొనునో ఆవిధముగా వర్తించవలెను. చెల్లుబడిలో వున్న అనేక న్యాయములను పరిశీలించిన  మానవునికి ఉత్త నోటి మాట తప్ప చేయగల వేరు కార్యములు లేవని తెలియుచున్నది.  

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ । స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే (17-15) ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, ఎదుటివారిలో కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు ఆత్మ జ్ఞానం కొరకు అధ్యయనం - ఇవి వాచిక తపస్సు అని చెప్పబడుతున్నది. 

మార్పులేని జీవితమే లేదు.

జీవితము సాఫీగా, ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ఆశిస్తాం. ఇది ఎంత వరకు సమంజసం? ఎవరికైనా  ఇలా జరగడం చూశామా? అలా జరిగితే మంచిదే కానీ,  అనుకుంటే ఐపోతుందా? దానికొరకు ఎందరు ఎన్ని సమకూర్చుకొన్నా, జాగ్రత్తలు పడినా, ప్రణాళికలు వేసుకున్నా అనుకోని, ఊహించని వాటిల్లో చిక్కుకున్న వారిని మనం చూస్తూనే వుంటాం. 

సర్వ మతములు దైవమును లేదా సత్యమును అనంతమైన దానిగా వర్ణిస్తాయి. కొన్ని వేల  ఏళ్లలో అత్యంత అద్భుతముగా చెక్కిన శిల్పములు,  దేవాలయాలు, గ్రంథములు, నాగరికతలు శిధిలమై పోతాయి. కాలగర్భములో ఆనవాళ్ళు లేకయే సమసిపోతాయి. కానీ దైవము లేదా సత్యము నిలిచియే వుండును. కాబట్టి ఈ దైవమునకు ఒక ఇదమిత్థ మైనటువంటి రూపం ఉండదు అని మనం భావించవలెను.

ఇప్పటిదాకా చెప్పుకున్న దానిబట్టి మనము గుర్తు పట్టగలిగినవన్నీ అశాశ్వతములే.  గుర్తించలేనిది బ్రహ్మమని చెప్పుకోవచ్చును.

మనము ఎక్కడపెట్టామో తెలియని తాళంచెవి కోసము వెదుకుతూ వుంటే మధ్యలో కనబడిన ఏ వస్తువునైనా, ఎంత విలువైనదానినైనా పక్కనపెట్టి గాలిస్తాము. సత్యమును వెతుకుటకు అలాంటి ఆతృత​, అంతర్జ్వలనము వుండవలెను. కావున మనకు కావలసినది వెదుకుటలో దీక్ష​, కానిది వదులుటలో ప్రజ్ఞ.

భక్తిలో నిమగ్నమగుట, తాళంచెవి కోసము వెదుకుట ఒకే లాంటివి.  ఆ భక్తి భావములో పూర్తిగా అంకితమై తాను పారవేస్తున్నవి ఏమిటో గ్రహించకనే వదిలివేయవలెను. ఒకవేళ అవి ఏమిటో తెలిస్తే మనసు పీకవచ్చు. అందుకనే ఆ దశకు చేరిన వారందరూ, తామేమీ దాటుకుని వెళ్ళినది చెప్పలేకపోయారు.

ఒకవేళ మనసులో మోక్షముమీదగానీ కన్నువుంటే, అది ఫలించదు. అది భక్తికాదు. వేరు ఏ మార్గములోనైనా ఇంత సులువుగా మోక్షము లభించదు (11-54).

వధువులేని స్వయంవరం.

మనము వరణాత్మకమైన (= వరించుట, ఎంచుట, ఎన్నుకొనుట, selective, one at the exclusion of the other​) ప్రపంచములో మునిగి యున్నాము. ఇందులో నుండి చూచు చూపులకు ప్రపంచములోని తారతమ్యములు, బేధభావములు, హెచ్చుతగ్గులే కానవచ్చును.

కాబట్టి, సత్యాన్ని వెలికి తీయడానికి వున్న ఒకేవొక అడ్డుగోడ అసత్యమే. దాన్ని పారద్రోలడం తేలిక కాదు. కానీ మనస్సు నుండి ఒక విషయాన్ని లేదా ఆలోచనను, ముఖ్యంగా మనల్ని వేధిస్తున్న సమస్యను మర్చిపోవడానికి (లేదా తొలగించడానికి) ఆచరించదగిన పద్ధతే లేదు. ప్రస్తుతానికి మరచిపోయినా, అయా సంఘటనల తాలూకు ఆనవాళ్ళు వదలిపోవు. ఒకానొక కోణములో, అయాచిత సందర్భములలో అవి తిరిగి స్ఫురణకు వస్తాయి (2-59).

"శాశ్వతంగా జీవితమును పునరుద్ధరించునది నీలోనే దాగి ఉంది". దాన్ని చేరడానికి సరైన మార్గాన్ని కనుక్కో అని భగవద్గీత ప్రబోధము (15-4). మానవుడు తాను ఇరుక్కున్న​ చక్ర వ్యూహం నుంచి, అంటే ఈ ప్రపంచం నుండి బయటపడు మార్గము  కనుగొనమని సవాలు చేస్తుంది, అంతే కానీ నచ్చినదానికి సంఘీభావము తెలుపుతూ, నచ్చనిదాన్ని వ్యతిరేకిస్తూ జీవించమని కాదు (4-43, 44).

అటునిటు వూగని నిశ్చలమైన మనస్సు దీనికి ప్రప్రథమము.  అట్టిదానికి సిద్ధమగు వానికే భగవద్గీత అంతరార్ధములు దర్శనమగును.  పైపై చదువుకొని, తెలిసిన అర్ధములు వ్రాయుట, తమకు అనుగుణమైన రీతిలో అన్వయించుట వలన ప్రయోజనము శూన్యము. విఖ్యాతినొందిన క్రింది అలాన్ వాట్స్ గారి పరిశీలన గమనించ తగ్గది.

"మనము ఈ ప్రపంచంలోనికి (ఎక్కడినుంచో) రాము; మనము చెట్ల నుండి ఆకుల వలె ప్రపంచం నుండి బయటకు వస్తాము. సముద్రంలో కెరటాలు పుట్టుకొచ్చినట్లు.  అలాగే విశ్వం నుండి  ప్రజలు." ప్రతి వ్యక్తి సమస్త సృష్టి యొక్క వ్యక్తీకరణ; అనంతము లోని పత్యేకతను సంతరించుకున్నవాడే అన్నారు అలాన్ వాట్స్.

అలాన్ వాట్స్ చెప్పినదాని ప్రకారము, మనలో ఈ ప్రపంచం తాలూకు లక్షణములు పూర్తిగా వేళ్ళూనుకున్నవి. కావున ప్రపంచం నుండి బయటపడు మార్గము  దాదాపు అసాధ్యము. కానీ భగవద్గీత తగిన కృషితో  అది సంభవమని చెప్పుచున్నది.

ఇది మానవుడు స్వయముగా ఎటువంటి పూచీకత్తు లేకుండా చేయు నిర్ణయము (2-58, 6-10). ఇది నిజంగా వధువులేని స్వయంవరం. లాభమే పరమావధిగా జీవించు మనకు ఈ మాటలు అర్ధంలేనివిగా కనిపిస్తాయి.

ఊరులేని పొలిమేర​.

పైవన్ని చూస్తుంటే జీవితము, కాలము (ముఖ్యంగా 2-12), కార్యము, జ్ఞానము, బ్రహ్మము కలగాపులగమై గందరగోళము అనిపిస్తుంది. నిజమే, వీటిలో ఏ ఒక్కదాన్ని విడివిడిగా చూచి సత్యమును గ్రహించలేమని తెలుస్తుంది. ఒక వూరు వుంటే దానికి పొలిమేర ఉండవచ్చు. వుంటుంది. ఊరు లేని చోటకు పొలిమేర వుండదు.  అనగా, అర్ధం లేని విషయము. అసత్యము.

ఇంకొంచెం గమనిస్తే జీవనము, జ్ఞానము, కాలము, బ్రహ్మము. ఇవన్నియు కలిసిపోయినవని, విడివిడిగా వానికి వునికి లేదని తెలుస్తుంది. అనగా ఇవి అనంతమునకు మారుపేర్లు. అంటే భగవద్గీత చెబుతున్నది ఒకే చిన్న విషయము. రెండే స్థితులు గలవు. ఒకటి ఇప్పుడు మనమున్నట్లుగా వుండటం. లేదా భక్తిలో సంపూర్ణముగా, తనను తాను గుర్తించలేనంతగా నిమగ్నమగుట​.

అంటే, ‘నేనెంత వరకు వచ్చానో’, ‘నేను ప్రక్కవాని కంటే మెరుగు’, ‘నేను పరుగు పందెములలో గీతను దాటి నేను విజేతనయ్యనని చెప్పుకొను మాదిరిగా ఇందులో హద్దులు, నిర్ణీతమైన గమ్యములు వుండవు. అనగా మోక్షము అనునది "నిర్ణయించ తగిన గమ్యము" కాదని తెలియుదుము. (6-4, 5 & 6).

ఆ చూచే చూపేమి?

పైన పేర్కొన్న అన్ని సారూప్యతల (comparisons) నుండి, మన కనుల ముందున్న దాని ప్రవృత్తిని గ్రహించలేమని తెలుస్తోంది.  అంతేకాక​, మనము చూచు చూపులలోనే లోపమన్నదని నిర్ధారణకు వస్తాము.  "యః పశ్యతి స పశ్యతి" (=ఆ విధముగా చూచువాడు ద్రష్ట) అనునది భగవద్గీత ముఖ్య సందేశము. (5-5, 6-30, 6-32, 13-28,13-30)

భగవద్గీత ప్రధానంగా మనిషికి, అతని చుట్టూతా వున్నవాని మధ్య సంబంధాన్ని అన్వేషిస్తుంది. ఈ పర్యావరణంలో మనం, కుటుంబం, సమాజం, నీరు, నదులు, మహాసముద్రాలు, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, భూలోకం, కాలం మరియు మన మనస్సులతో పెనవేసుకున్న విషయాలు (అంతరంగము) ఉంటాయి. లోని దానికి / బయలు దానికి (అంతర్లీన/బహిర్లీన​) సంబంధాలను తెలుసుకోకుండా, ఎప్పటికీ అన్వేషణ అసంపూర్ణం (6-30, 6-32).

విశ్వవిఖ్యాత చిత్రకారుడు రెనే మాగ్రిట్టే వేసిన "హృదయ మీమాంస" (the human condition) అను శీర్షిక గల చిత్రాన్ని చూడమని పాఠకులను కోరుతున్నాను.


"ఒక కిటికీ  నుండి చూసినప్పుడు కనపడే దృశ్యంలో ఒక భాగాన్ని దాచుతూ, అదే భాగాన్ని సూచించే పెయింటింగ్’ను ఉంచారు. అంటే, కనపడుతున్న చెట్టు వాస్తవంగా పెయింటింగ్ మాత్రమే.  ప్రేక్షకుడికి, ఈ చెట్టు పెయింటింగ్ లోపల (అంటే గది లోపల) మరియు వాస్తవంగా గది వెలుపల వున్నట్లు అనిపిస్తుంది".

ఈ పెయింటింగ్ వేసిన భాగానికి   సరిహద్దులు ఉన్నాయి, ఇవి పెయింటింగ్’ని యొక్క ఇతర సహజ వస్తువుల నుండి వేరుచేస్తాయి. పై చిత్రంలో, కళాకారుడు సహజమైన ప్రకృతి దృశ్యానికి సరిపోయే పరిపూర్ణమైన ప్రకృతి దృశ్యాన్ని చిత్రించడం ద్వారా న్యాయం చేయడానికి ప్రయత్నించాడు.

మనం సహజంగా నటించబోయినప్పుడు అది అసహజంగా మారుతుంది. నటన ద్వారా సత్యాన్ని గ్రహించలేం. మానవుడు ఈ లోకంలో సహజముగా కలిసిపోలేడు. అతడు "లోపల నేను, అది బయట" అను సరిహద్దులు నిర్మించుకుని మనుగడ సాగిస్తాడు. ఇటువంటి జీవనములో  నిరంతరం అసహజుడుగానే ఉంటాడు. ఎందుకంటే  తానే నిర్మించుకున్న వైషమ్యాలు విడనాడకుండా ప్రకృతితో ఆ హద్దులను చెరిపేసుకుంటూ   సమ్మిళతమవలేడు (3-33, 3-34).

దీనిమూలముగా తన చూపుల రేఖలను సరిచేయుటకు మానవునికి అందుబాటులోనున్న సర్వశక్తులను పణముగా పెట్టే సాహసము కావలెను. అదేమిటో తెలుసు కోవాలంటే భగవద్గీతను స్వయంగా చదివి అర్ధము చేసుకోండి (3-35).

x-x- సమాప్తము -x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి