27, ఏప్రిల్ 2024, శనివారం

2-12: సాంఖ్య యోగము. 12వ శ్లోకము

 శ్లో|| న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||(2-12)||

టీక:  అహమ్= నేను, జాతు = ఒకప్పుడును, నాసం ( + ఆసం) = (ఇతి) లేననునది, నతుఏవ = లేనే లేదు, త్వమ్ = నీవు (న ఆసీః ఇతి), న= లేవనునది లేదు, ఇమే = ఈ, జనాధిపాః = రాజులు, (న ఆసన్ ఇతి) న = లేరనునది లేదు, అతః పరమ్ = ఇకమీదట, వయంసర్వే = మనమందఱమును, న భవిష్యామః (ఇతి) చ = లేకపోవుదుమనునదియు, న ఏవ = లేదు.

 

భావము: ( అర్జునా !) నీవుగాని, నేనుకాని, ఈ రాజులు కానీ లేని కాలమే లేదు. ఇక ముందూ కూడా ఉందుము. (అన్ని కాలములలోను మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతం. ఆత్మ అన్ని కాలములయందును ఉండును. శరీర పతనంతో అది నశించునది కాదు). 

వ్యాఖ్యలు: 

మానవుని సమస్యలు సార్వత్రికము: ఆత్మ శాశ్వతం అనే విషయం కొంచెంసేపు ప్రక్కన పెట్టి, జాగ్రత్తగా ఆలోచిస్తే, కాలములు మారినా, శతాబ్దాలు జరిగిపోయినా, ప్రతీ మనిషి ఎదుర్కొను సమస్యలు, దాదాపు ఆనాటి అర్జునునికి ఎదురైన అనుభవంతో పోలి ఉండటం గమనార్హం. మానవుని వేధిస్తున్న అనేక చిక్కు ప్రశ్నలు రామాయణము, భారతము, బైబిలు కాలాల నుంచి ఈనాటికి వరకు నిలిచి ఉండటాన్ని సూచిస్తోంది. మనిషి ఏ దేశంలో ఉన్నా అతని సమస్యలు, వేరే ఎక్కడో పరాయి దేశంలో ఉన్న వారితో పోలి ఉండడం పరిశీలించదగినది.

అనాదిగా ఒకటే చైతన్యము: అందుకే, ఎక్కడో జరిగిన బైబిల్, భారత దేశంలోని వారికీ వూరట కలిగించడం, అలాగే భగవద్గీత ప్రపంచ వ్యాప్తంగా పేరొందడం యాదృచ్ఛికం కాదు. ఈ పోలిక కాకతాళీయం కాదు. భగవద్గీత మానసిక కాలము, దూరముల (psychological time and space) గురించి కూడా ముందు ముందు కొంత వివరణ ఇస్తుంది. ఇకపొతే ఇంకొంచెం ఆలోచిస్తే, మనిషి యొక్క చైతన్యము అనాదిగా ఒకటే అని సూచన అయ్యుండవచ్చును.  

చైతన్యము యెడతెగనిదిఅన్నమాచార్యుల కీర్తన 'తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడేఈ శ్లోకం యొక్క అంతరార్ధాన్ని తెలుపుతోంది. ముఖ్యంగా “తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమముపొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు” అనిచెప్పి మనిషిలోని  చైతన్యము (చావుపుట్టుకలతో సంబంధము) లేకుండా యెడతెగని దానిగా వర్ణించారు.

శాశ్వతమైనది ఏమిటి?” అనే దాని గురించి ముందు ముందు వివరించుకుందాం. అది మన శరీరము కానీ, మన భావనలు లేదా మన జ్ఞాపకములు కానీ కానే కాదు. ప్రస్తుతానికి ప్రతీ మానవునికి జీవన్మరణముల నుండి ముక్తి కలిగి శాశ్వతత్వం  పొందే అవకాశం ఉందని ఈ శ్లోకము సూచించుచున్నది అని తెలుసుకుంటే చాలు.

అనుభవాల పొరలు: ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ప్రస్తుత జాగ్రదావస్థలో మనిషి పైపైనే తచ్చాడుతున్నాడనిమనిషిలో అనేక పొరల అనుభవాలు-జ్ఞాపకాలు దాగి ఉన్నాయనినిజానికి ప్రతి మనిషిలోను ప్రపంచమే దాగి ఉందనిఅనేకమార్లు ప్రస్తావించిరి.

పైవన్నీ గమనిస్తే శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పినదీ, అన్నమయ్య గారు చెప్పినదీ, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినదీ ఎంతో దగ్గరగా ఉండటం తెలియవచ్చును.  మొత్తంమీద పైనచెప్పిన శ్లోకం చాల గుహ్యమైనది. మనమీ లోకములోనికి పొరపాటున రాలేదు, నిమిత్తమై వచ్చితిమి. 

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి