27, ఏప్రిల్ 2024, శనివారం

2-13: సాంఖ్య యోగము. 13వ శ్లోకము

 శ్రీ భగవానువాచ:

శ్లో|| దేహినోఽస్మిన్ యథా దేహే 
కౌమారం యౌవనం జరా

తథా దేహాంతరప్రాప్తిః 

ధీరస్తత్ర న ముహ్యతి ||(2-13)||

టీక: దేహినః = జీవునకు, అస్మిన్ దేహే = ఈ శరీరమునందు, కౌమారమ్ = బాల్యము, యౌవనమ్ =యౌవనము, జరా = వార్ధక్యము, యథా = ఎట్లుకలుగునో, తథా = అట్లే, దేహాన్తర ప్రాప్తిః = మఱియొక శరీరమును బొందుటయు (కలుగుచున్నది), తత్ర = ఆ విషయమున, ధీరః = జ్ఞాని, నముహ్యతి = మోహము నొందడు (శోకింపడు).

భావము:  జీవునకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్థక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తియు కలుగును. ధీరులైన వారు ఈ విషయమును గ్రహించి, వ్యధ చెందరు. 

వ్యాఖ్యానము:

విచారణ  వ్యర్థముమరణము అనివార్యం; ఐననూ దానిపట్ల భయంతో మానవులు అనేక  చర్యలు చేపట్టుదురు. మరణము, దాని తరువాత వానిపై అనేక వివరణలు వున్నప్పటికీ అవి యేవియు నిర్ధారించబడలేదు. వానిపై విచారణ చేయుట వ్యర్థము. 

ధీరుడుఇక్కడ ధీరుడు అనగా వీరత్వంతో కూడిన ధీరత్వం కాదు. ఎటువంటి విపత్కరమైన పరివర్తనమునైనా  స్వీకరించువాడు, ప్రాణములను సైతము ఎటువంటి ప్రతిఘటనలేకయే ధైర్యముగా విడుచువాడు అని అర్థం. 

జడత్వముఇంకొంచెం ఆలోచిస్తే మానవులు తాము ప్రస్తుతము వున్న దశలోని మార్పులను తీవ్రముగా వ్యతిరేకించుదురు. ఆ ప్రయత్నమే మనకు 'ఇది నాది; అది వారిది లేదా నాది కాదు" అను సరిహద్దులు సృష్టించును. ఒక రకముగా చెప్పాలంటే మనమందరము జడత్వమునకు  (subjected to inertial effects of matter) లోనై మనము ప్రస్తుతము ఉన్న స్థితిలోనే  ఉండుటకు ప్రయత్నం చేస్తాము.  

క్షీణించుట: మన దేహము అను భారముతో గురుత్వాకర్షణ శక్తికి త్వరత్వరగా అనుగుణముగా స్పందించలేక పోవుటను, వూహలు అను మోపులతో  ఏర్పరచుకున్న "నేను" కూడా ప్రకృతి కల్పించు మార్పులకు త్వరత్వరగా చలించలేక పోవుటతో పోల్చవచ్చును. దీనితో "నేను" మనో వ్యథకు గురియై క్షీణతకు దారితీయును.    అధోపతనం అనునది సిద్ధాంతము కాదు. మనమే నిర్ధారించగల సత్యము. ఈ రకముగా మనము కాలము అను నాలుగవ అంశమునకు లోనవుతాము. ఇదియే మనను సత్యమునుండి వేరుపరచునది.

జీవమొక్కటే: మన ప్రస్తుత రూపముతోనే మన ప్రస్తుత మనస్థితిలోని మార్పులను సంపూర్ణముగా స్వీకరించుట ధీరత్వం. తమకై తాము ఏర్పరచుకున్న సరిహద్దులు ఏమాత్రము ధర్మబద్ధం కాదు. ధర్మమై జీవించుట ఒక్కటియే జీవించుట, వేరన్నియు అసంబద్ధములు. చేపట్టరానివి. 
 
తమలోనిసమ్మతము: అనగా మానవుడు చేపట్టు చర్యలన్నీ ప్రతిక్రియలు ప్రతిఘటనలు అని తెలియవలెను. ఈ ప్రతిక్రియల గోలుసులలో మానవుడు చిక్కుకుంటాడు. వీనిని లంపటములు అని సూక్ష్మంగా సెలవిచ్చారు. ఈ శ్లోకంపై మరింత వివరణ 2-69వ శ్లోకము వివరణలో కూడా చెప్పుకుందాం. మార్పును నూటికి నూరు శాతము స్వీకరించునది జీవనము అనిఒక్కింత కూడా (ఒక శాతము కూడా) వ్యతిరేకించునది మరణము అని తీసుకోన వలెను. 

ఇదియే క్షేత్రక్షేత్రజ్ఞ యోగము: ఈ విషయము గురించి మరింత విపులముగా కర్మ యోగమునందు క్షేత్రక్షేత్రజ్ఞ యోగమునందు మరియు అనేకానేక శ్లోకములలో దీనిని మననము చేసుకుంటాం.

గ్నోతి సూయేటోన్ (Gnothi Seuton) అని సోక్రటీస్ చెప్పినది ‘నిన్ను నీవు తెలుసుకో' ‘మార్పును తెలియుదానిని తెలుసుకోఅని అర్ధము. ప్రతిఘటించు దానికి తాను ప్రతిఘటిస్తున్నానని తెలియదు. ఆ ఎఱుక ప్రతిఘటన ఐన తర్వాత తెలుస్తుంది. అందుకే ఎంతో నైపుణ్యం, ఎంతో అనుభవం గడించినవారు కూడా ఆతృతతో “పలుకరానివి పలుకుట వలన అనేక కష్టములకు దారితీసిన సంగతులు మనమూ నిత్యం వార్తా పత్రికలలో చూస్తూనే ఉన్నాం. క్షణ క్షణమూ  ఈ ప్రతిఘటన మార్పు చెందుతూ మానవుని పరీక్షిస్తోంది. 

ప్రత్యామ్నాయము లేదుఐ​​నప్పటికీ ఈ ప్రకృతిలో సర్వ పదార్థములును పునరుపయోగించ బడుచున్నవి. మానవులు సైతము దీనిలో భాగమే. దీనిని రూపపరిణామము; రూపాంతరము చెందుటతో పోల్చవచ్చును. కానీ ఈ రూపాంతరము తన పూర్వ రూపముతో సంబంధములేని వేరు దశకు వికారము చెందుచూ, క్షణ క్షణమునకు మారుచూ రూపాంతర క్రియ ఇదియని చెప్ప నలవిగాకున్నది. ఏ రూపాంతరములోనైనా పుట్టుట గిట్టుట​ తప్పని సరి. మరణ భయముతో ఈ క్రియలో పాల్గొనలేని వారు, భౌతికముగా ఎంత సాధించినప్పటికీ వారు పిరికివారే.

అన్వయార్ధముకాల గమనముతో భౌతికముగా మన శరీరములో చూపు  మార్పుల కంటే, ఇప్పటి స్థితినుండి వేరొక స్థితికి మారుటకు మానసిక ప్రతిస్పందనను గమనించి దానిని ఉన్నది ఉన్నట్లు స్వీకరించువాడే ధీరుడు. 

2-12: సాంఖ్య యోగము. 12వ శ్లోకము

 శ్లో|| న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||(2-12)||

టీక:  అహమ్= నేను, జాతు = ఒకప్పుడును, నాసం ( + ఆసం) = (ఇతి) లేననునది, నతుఏవ = లేనే లేదు, త్వమ్ = నీవు (న ఆసీః ఇతి), న= లేవనునది లేదు, ఇమే = ఈ, జనాధిపాః = రాజులు, (న ఆసన్ ఇతి) న = లేరనునది లేదు, అతః పరమ్ = ఇకమీదట, వయంసర్వే = మనమందఱమును, న భవిష్యామః (ఇతి) చ = లేకపోవుదుమనునదియు, న ఏవ = లేదు.

 

భావము: ( అర్జునా !) నీవుగాని, నేనుకాని, ఈ రాజులు కానీ లేని కాలమే లేదు. ఇక ముందూ కూడా ఉందుము. (అన్ని కాలములలోను మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతం. ఆత్మ అన్ని కాలములయందును ఉండును. శరీర పతనంతో అది నశించునది కాదు). 

వ్యాఖ్యలు: 

మానవుని సమస్యలు సార్వత్రికము: ఆత్మ శాశ్వతం అనే విషయం కొంచెంసేపు ప్రక్కన పెట్టి, జాగ్రత్తగా ఆలోచిస్తే, కాలములు మారినా, శతాబ్దాలు జరిగిపోయినా, ప్రతీ మనిషి ఎదుర్కొను సమస్యలు, దాదాపు ఆనాటి అర్జునునికి ఎదురైన అనుభవంతో పోలి ఉండటం గమనార్హం. మానవుని వేధిస్తున్న అనేక చిక్కు ప్రశ్నలు రామాయణము, భారతము, బైబిలు కాలాల నుంచి ఈనాటికి వరకు నిలిచి ఉండటాన్ని సూచిస్తోంది. మనిషి ఏ దేశంలో ఉన్నా అతని సమస్యలు, వేరే ఎక్కడో పరాయి దేశంలో ఉన్న వారితో పోలి ఉండడం పరిశీలించదగినది.

అనాదిగా ఒకటే చైతన్యము: అందుకే, ఎక్కడో జరిగిన బైబిల్, భారత దేశంలోని వారికీ వూరట కలిగించడం, అలాగే భగవద్గీత ప్రపంచ వ్యాప్తంగా పేరొందడం యాదృచ్ఛికం కాదు. ఈ పోలిక కాకతాళీయం కాదు. భగవద్గీత మానసిక కాలము, దూరముల (psychological time and space) గురించి కూడా ముందు ముందు కొంత వివరణ ఇస్తుంది. ఇకపొతే ఇంకొంచెం ఆలోచిస్తే, మనిషి యొక్క చైతన్యము అనాదిగా ఒకటే అని సూచన అయ్యుండవచ్చును.  

చైతన్యము యెడతెగనిదిఅన్నమాచార్యుల కీర్తన 'తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడేఈ శ్లోకం యొక్క అంతరార్ధాన్ని తెలుపుతోంది. ముఖ్యంగా “తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమముపొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు” అనిచెప్పి మనిషిలోని  చైతన్యము (చావుపుట్టుకలతో సంబంధము) లేకుండా యెడతెగని దానిగా వర్ణించారు.

శాశ్వతమైనది ఏమిటి?” అనే దాని గురించి ముందు ముందు వివరించుకుందాం. అది మన శరీరము కానీ, మన భావనలు లేదా మన జ్ఞాపకములు కానీ కానే కాదు. ప్రస్తుతానికి ప్రతీ మానవునికి జీవన్మరణముల నుండి ముక్తి కలిగి శాశ్వతత్వం  పొందే అవకాశం ఉందని ఈ శ్లోకము సూచించుచున్నది అని తెలుసుకుంటే చాలు.

అనుభవాల పొరలు: ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ప్రస్తుత జాగ్రదావస్థలో మనిషి పైపైనే తచ్చాడుతున్నాడనిమనిషిలో అనేక పొరల అనుభవాలు-జ్ఞాపకాలు దాగి ఉన్నాయనినిజానికి ప్రతి మనిషిలోను ప్రపంచమే దాగి ఉందనిఅనేకమార్లు ప్రస్తావించిరి.

పైవన్నీ గమనిస్తే శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పినదీ, అన్నమయ్య గారు చెప్పినదీ, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినదీ ఎంతో దగ్గరగా ఉండటం తెలియవచ్చును.  మొత్తంమీద పైనచెప్పిన శ్లోకం చాల గుహ్యమైనది. మనమీ లోకములోనికి పొరపాటున రాలేదు, నిమిత్తమై వచ్చితిమి. 

x-x-x-x

2-11: సాంఖ్య యోగము. 11వ శ్లోకము

 శ్రీ భగవానువాచ:

శ్లో|| అశోచ్యాన్ అన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాం శ్చ భాషసే|
గతాసూ నగతాసూంశ్చ
నానుశోచంతి పండితాః ||(2-11)||

టీక: అశోచ్యాన్ =శోకింప తగని వారిని గూర్చి; అన్వశోచః = శోకిస్తున్నావు; త్వం = నీవు; ప్రజ్ఞా-వాదాన్ = తెలివితేటలతో కూడిన మాటలు; = మరియు; భాషసే = పలుకుతున్నావు; గత-అసూన్ = మరణించినవారి గురించిఅగత-అసూన్ = బ్రతికున్నవారి గురించి ; చ — మరియు; న అనుశోచంతి — ఎప్పుడూ శోకించరు; పండితాః = పండితులు / వివేకవంతులు.


భావము: భగవానుడు ఇట్లనెను "అర్జునా! విజ్ఞులైన వారు మరణించినవారిని గురించి కానీ, బ్రతికియున్న వారిని గురించి కానీ దుఃఖింపరు. అయినప్పటికీ, శోకించ తగని వానికై నీవు శోకించుచున్నావు. పైగా అన్నీ తెలిసిన పండితునిలా మాట్లాడ ప్రయత్నిస్తున్నావు." 

వ్యాఖ్యానము:  

చాలామంది భగవద్గీత ఈ శ్లోకంతో మొదలవుతుంది అని భావిస్తారు. 

మన జ్ఞానము అజ్ఞానము:  అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం శ్చ భాషసే. ముందుగా, తానేమి చేయాలో తానే నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్న అర్జునుడు జ్ఞానిలా యుద్ధమున ప్రతిపక్షంలోని వీరులతో బాంధవ్యము గురించి, యుద్ధ పర్యవసానము గురించి చేసిన వ్యాఖ్యలు ఊహాత్మకములే కావున వాటి గురించి మాట్లాడుట కృష్ణుడు సరికాదనెను. శ్రీకృష్ణులవారు "పండితుడైనవానికి సత్యము గోచరించును. వారు అర్జునునిలా మాట్లాడ ప్రయత్నించరు. పండితులు సత్యాన్ని గ్రహించి మిన్నకుందురు" అని తెలుపుతున్నారు.  అనగా పండితునిలా మాట్లాడ ప్రయత్నించు వానికి బుద్ధి ఇంకా స్థిరం కాలేదని భావము. 

జనన మరణ రహస్యమే జ్ఞానము: మీకు ముందుగా విన్నవించుకున్నట్టుగా ఈ శ్లోకము ఎంతో గహనమైనది. మానవునికి గోచరించు జననము మరణము అను రెండు యధార్థములు అనేక విధములుగా అతనిని ప్రభావితం చేయును. భగవానుడు ఎటువంటి సందేహములకు తావివ్వకుండా, "విజ్ఞులు బ్రతికున్నవారి గురించి కానిమరణించినవారి గురించి కాని దుఃఖింపరు" అని ఆనతిచ్చెను. జాగ్రత్తగా గమనిస్తే అర్జునుడి మనసును పీకి వేస్తున్నటువంటి శోకమే అతనిని సరిగా చూడనివ్వకుండా అవరోధించుచున్నదని ఈ శ్లోకము యొక్క భావం.  మన చూపులను అడ్డుకుంటున్నది ఏమియో లోతుగా విచారించినది భగవద్గీత. (అందుకనే "పశ్యతి" (=చూచునది) అనేకమార్లు గీతలో కానవచ్చును.

పట్టియుంచినదే అవరోధము: ఈ రకముగా చూచిన, చూచే చూపులను ప్రభావితం చేయు నవి మనము ఆయా వాటిపై ఏర్పరచుకున్న భావములే కదా! అవియే జ్ఞాపకములు. వానికి విజ్ఞులు తావు ఇవ్వరు అని తెలియవచ్చు. 

ఆ దారిలో తీర్పులు, తీర్మానములు బండరాళ్ళు: అనగా వారు జీవన్మరణముల భారమును దైవముపై నిలిపి శరీర యాత్రకు సన్నద్ధులగుదురు. ఆ దైవము సేవలొ వారికి రెండున్నూ ఒకటే.  "జీవించి యుండుట సరి"; "ఆ మరణము సరి కాదు" అను తీర్పులు లేదా నిర్ణయములతోనూ, క్షణక్షణమునకు  తామే తెచ్చిపెట్టుకున్న వూహలతోనూ తమ మదిని నిండుగా ఆక్రమించుకొన్న ఆలోచనలతోనూ అవి కలిగించు దుఃఖములతోనూ సతమతమౌతూ కాలమును వెళ్ళబుచ్చరు. 

పండితులు అరుదు: పండితుడనగా ఎవ్వరు? వేదము, విద్వత్తు, పాండిత్యములతో మదిని నింపుకున్నవారు కానేకారని స్పష్టము. ఇప్పటి వరకు మరణము అనుదాని అనుభవమును ప్రత్యక్షముగా కలిగిన వారు చాలా అరుదు అని తెలియుచున్నది. భగవద్గీతలో పేర్కొన్న పండితులైనవారు కూడా చాలా చాలా అరుదే నని భావింపవలెను. 

యోగము: ప్రకృతికి ఒడబడి చేయు ఆ యత్నము సామాన్యము. దానికి ఒడబడకుండుట అసాధారణము. యోగము అనగా ప్రయత్నము, కూడిక, కూర్పు మరియు అసహజము. అపూర్వమైనది సాధించుటకు అపూర్వ యత్నము, సాహసము తప్పనిసరి. మానవుని ఆ ప్రయత్నము మాత్రమే అపూర్వవస్తుప్రాప్తికి మార్గము. తక్కినవి అజ్ఞానము లోని భాగములు. అవి వొప్పుట, లోబడుట, అనుసరించుటలోని భాగములని విశద పరుచుకొనవలెను. భగవద్గీత చదివి ఆనందించుటకు మాత్రం వ్రాయబడలేదు. కావున ఆ క్లిష్టమైన దాదాపు అసాధ్యమైన పనికి వొడబడువాడు యోగి అనబడును. 

చర్చించ తగని విషయము: క్రింది అన్నమాచార్యుల పల్లవిని కూడా చూడండి. చాలా స్పష్టంగా పండితులైనవారు నరకమును మృత్యువును దాటిన స్థితిలో స్థిరముగా వుండి అలౌకికమైన దశకు చేరుకుందురని తెలియవచ్చును. (ఆ దశ గూర్చి మనకున్నది పరోక్ష జ్ఞానమే. కావున చర్చించ తగని విషయము)

 

ఎక్కడి నరకములు యెక్కడి మృత్యువు మాకు

దక్కి నీ దివ్యనామామృతము చూరగొంటిమి   ॥పల్లవి॥

 

సత్యమును గ్రహించుటయే జీవము. జననం, మరణం రెండే రెండు పరమ వాస్తవాలు. అనివార్యమైన ఈ  అవధుల మధ్య కాలమును సిద్ధాంతాలతోను, వెదుకుటలోనూ వృథా చేయవద్దు. మానవులారా! మీ ఇప్పటి అవగాహనలను ప్రక్కన బెట్టి, ఎదురుగా వున్న ఈ ప్రపంచమును కనుగొనుడీ! అని ఈ శ్లోకం యొక్క గూడార్థం. సత్యమును గ్రహించుటయే జీవము & జీవనము.

 

అదనపు వివరణ​:

నిరాధారమైన ఉద్యోగము: ప్రస్తుత సందర్భంలో అర్జునుడు రాజ్యము కోసము, పాండవులు ధర్మమని అనుకుంటున్న దాని కోసము, ముందుగానే జయాపజయములను నిర్ణయించి తన కళ్ల ముందు, తానే జరపబోయే మారణహోమం తలచుకుని దుఃఖించాడు. మానవుల ఈ నిరాధారమైన ‘తలపులు అను వ్యవసాయము (=ఉద్యోగము) అనేకానేక యుద్ధాలకు, తరగతులుగా విభజనలకు, మారణహోమములకు దారితీసిందని మనందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో మానవుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మూలకారణాలలో ఒకటైన యీ విషయాన్ని తప్పక విశ్లేషించవలె.  అర్ధముచేసుకోవలె. ముందుగా క్రింది రీని మాగ్రిట్టె గారు లో గీసిన 'లా కార్ట్ బ్లాంష్' (= తెల్లకాగితము) పేరిట ప్రపంచ ఖ్యాతినొందిన ఈ క్రింది చిత్రమును జాగ్రత్తగా పరిశీలించండి.



ఉన్నది ఉన్నట్లుగా చూడలేము: పై చిత్రము పరిక్షించిన మీదట అది అసాధ్యమని తెలిసిపోతుంది. చిత్రములో చూపినట్లు గుర్రమును దాని రౌతును ఊహించుట పొందికలేని విషయమే. జాగ్రత్తగా గమనించితే అక్కడ మూడు భాగాలుగా కత్తిరించిన గుర్రపురౌతు బొమ్మను ఉంచారు. కానీ, విశ్లేషణతో సంబంధము లేకనే మనస్సు అక్కడ గుర్రము ఉన్నట్లు మనస్సు  నమ్మును. దీనిపై మరికొంత వివరణ క్రింది బొమ్మలో పొందవచ్చు.


చేయరాని ప్రయత్నము: పై బొమ్మలలో దృష్టాంతీకరించినట్లు లేనిదానిని మనస్సు ఉన్నట్లు ఎట్లు చేకొనునో, అటులనే తరువాతి రోజుకు జీవితము  విస్తరించుటకు చేయు సన్నాహములు వృధా ప్రయాస అని అర్ధము. కానీ, ప్రపంచములోని వార్తలలో ఆకలి మరణాలు, పేదఱికము, అసమానతలు, దోపిడి, పీడనలు, ధనికుల విలాసవంతమైన జీవితములు వగైరాలు సాధారణ మానవుని మనస్సుపై వాటి వాటి పంజాలు విసురును. దానితో మానవుడు తనకైతాను సృజించు తర్కముపై అధిక నమ్మకముంచి (ఇక్కడ అర్జునుని వలె) సత్యమును ప్రక్కకు నెట్టివేయును. తన ప్రయత్నములతో శాంతిని, సమాధానమును పొందగలనని  నమ్మును. 

సార్వత్రిక క్లేశము: ఇలా ధర్మమును, న్యాయమును పాటించక​, ఎవరికివారు తమ తమ ప్రయత్నాలతో శాంతిని పొందు ప్రయాసలతో ప్రపంచమున విధ్వంసం సృష్టించారు. ఈ అసంగతములను, ఈ గందరగోళములను, ఈ అలజడులను, ఈ విచ్ఛిన్నములను ఎవరైనా పరిశీలించి అనుభవించగలరు. పలుమార్లు పేర్కొన్న శాంతి సమాధానముల  మార్గమున ఏమి చెయ్యరాదో భగవద్గీత విశదముగా తెలిపింది. 

అస్తవ్యస్తానికి మూలకారణం: అర్జునుడి వాదనలు, తార్కికంగాను మరియు బాగా హేతుబద్ధంగాను ఉన్నప్పటికీ, కృష్ణుడు వాటిని కొట్టిపారేశాడు. నిమిత్తములు కారణములు తరచుగా గందరగోళానికి మరియు సంఘర్షణకు దారి తీస్తాయి. కానీ ఎవరి తర్కములు, కారణములు వారివి. కొన్ని సముదాయములు, కొందరు మనుషులు ఏర్పరచుకున్న తర్కములు, కారణములు, వేరే వారి తర్కములు, కారణములతో పోల్చుకుంటే భిన్నముగా నుండును. ఇవి ఒకదానితోనొకటి పోటీపడు సిద్ధాంతాలను మరియు దృక్కోణాల జాలమును (వలను) సృష్టిస్తాయి. వీనిలో ప్రతి ఒక్కటి మానవుని  వేర్వేరు దిశల్లో లాగుతాయి. అందుకే కృష్ణుడు అర్జునుని మేధోపరమైన తర్కాన్ని విస్మరించాడు. మానవుడు తన శరీరమును, బుద్ధిని, ఆత్మను ఒకత్రాటిపై తీసుకొని రాకున్న​ సత్యాన్ని గ్రహించలేడు. కావున మేధోపరమైన విశ్లేషణతో ఏమీ సాధించలేము.

x-x-x-x

అనుమిత (ఉప​) సిద్ధాంతములు (corollaries):


సత్యాన్ని చేరుకోవడానికి మానవుడు తనకు సత్యమునకు మధ్య వున్న సర్వ అవరోధములనుమరణమును సైతము లెక్కించకత్యజించి ప్రక్కకు నెట్టివేయవలెను.
 
ఊగిసలాట​: మనల్ని మనం గమనిస్తే మనం 'కారణము' ('తెలిసియుండుట​') మరియు 'అకారణము' ('తెలియకుండుట' 'అజ్ఞానం') మధ్య  ప్రపంచంలో ఊగిసలాడుతూ వున్నామని కనుగొంటాం.  మన ప్రస్తుత ఉనికి ఈ రెండు పరిమితుల మధ్య ఉంటుంది (2-28 మరియు 4-18 కూడా చూడండి). పరివర్తనకు లోనయ్యే వస్తువులన్ని అశాశ్వతంలో భాగం. ఈ స్థితిలో నిజానిజాలు తెలిసే అవకాశం లేదు. 

ఏమీ అర్థముగాని స్థితి: నిజంగా చెప్పాలంటే మన స్థితిలోని మార్పులను  మాత్రమే మనము గమనించ గలుగుతాము. మనం 'అవగాహన' పొందినప్పుడు, ఆ ముందు క్షణం వరకు మనం 'అవగాహన లేని' స్థితిలో వున్నామని అర్థం. దీని వ్యతిరేకమూ వాస్తవమే. దీంతో మనమున్న వాస్తవ పరిస్థితిపై అయోమయంలో ఉంటాం. (4-17 4-18 కూడా చూడండి)

మనిషి వాస్తవ స్వరూపం: ఈ అధ్యాయము ముందర 4 నుండి 8 వరకు వున్న శ్లోకములు మనిషి వాస్తవ స్వరూపాన్ని సూచిస్తాయిఒక ప్రక్క మనకు తెలిసిన తర్కముపయోగించి విశ్లేషణ చేయబోతాము. ఇంకో ప్రక్క దైవమా నన్ను రక్షించు అని శరణాగతిని కూడా చేయబోతాము. మనము ద్వందనీతిని అవలంభిస్తాము.

అందుకనే కృష్ణుడు సూటిగా పండితునిలా మాట్లాడటం కాదుపండితునిగా జీవనము సాగించు అని సందేశం ఇచ్చాడు. ఇప్పటి మన జీవన విధానంలో గణనీయమైన మార్పులేకున్న మనము కేవలము జీవన్మృతులమని ఈ శ్లోకము భావము.
 

x-x-x-x


భగవద్గీత సారాంశము.

 

11-16 వరకు గల శ్లోకముల యుక్తియుక్తమైన న్యాయదర్శనము.

(Orderly exposition of Bhagavad Gita)

11వ శ్లోకము: జననం, మరణం అనునవి మానవుని నిరంతరముగా పరీక్షించుచున్నవి. వీటిని దాటి శాశ్వతమైన దానిని పండితులైనవారు కనుగొనగలరు.  

 

12వ శ్లోకము: మానవుని శరీరమును మనసును ఒక దగ్గరగా చేర్చి ఉంచిన ఆత్మ అనుదానికి శాశ్వతత్వమును ఆపాదించారు.

 

13వ శ్లోకము: ఈ జననమరణ చక్రము తనలోనే జరుగుతుండగా పరిశీలించ ​గలిగిన ధీరుడు పండితుడు అనబడును.

 

14 & 15వ శ్లోకములు: ఈ మార్పులను ధైర్యముగాఁ ఏమాత్రము విరోధించక ఉన్నది ఉన్నట్లు స్వీకరించే వానికి మోక్షము సిద్ధించునని వివరించారు

 

16వ శ్లోకము: “తత్త్వదర్శిభిః' అనగా తత్వమును లేదా సత్యమును ప్రత్యక్షముగ చూచినవారు (కేవలము విని చదివి తెలుసుకున్నవారు కారు, ఆ శాశ్వతత్వము అనుభవించి చెప్పినవారు) ఈ విషయమును నిర్ధారించిరి.

 

 x-x-సమాప్తము-x-x