15, సెప్టెంబర్ 2024, ఆదివారం

2-30-37: సాంఖ్య యోగము. 30 నుంచి 37 వరకు గల శ్లోకములు

 శ్లో|| దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||(2-30)||

టీక:- సర్వస్య = సమస్త ప్రానులందును; దేహే = దేహమునందు; అయం దేహీ = ఈ ఆత్మ​; నిత్యం= ఎల్లప్పుడును;  అవధ్య = చంపబడనివాడు; తస్మాత్ = అందువలన​; సర్వాణి = సమస్తములైన​; భూతాని = ప్రాణుల గురించి;  త్వం  = నీవు; శోచితుమర్హసి = దుఃఖించతగదు. 

భావము: అర్జునా! సమస్త ప్రాణికోట్ల  దేహములందు వసించి ఉన్న ఈ ఆత్మ ఎన్నడును చంపబడడు. కావున నీవు ఏ ప్రాణిని గూర్చి  శోకించ తగదు.

 

శ్లో|| స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే
||(2-31)||

టీక:- చ = మరియు;  స్వధర్మమ్=క్షత్రీయ ధర్మమును; ఆవేక్ష్య అపి = చూచియైనను; వికంపితుమ్ = చలించుటకు;  న అర్హసి = తగవు; క్షత్రియస్య= క్షత్రీయునకు; ధర్మ్యాత్= ధర్మయుతమైన​; యుద్ధాత్= యుద్ధము కంటే; అన్యత్= ఇతరమైన​; శ్రేయః=మేలు; న విద్యతే హి = లేదు గదా. 

భావము: అర్జునా! ఓ అర్జునా స్వకీయమగు క్షత్రియ ధర్మం విచారించుకున్నా యుద్ధమునకు వెనుదీయుట నీకు సరియైనది కాదు. ఎలయనిన క్షత్రియునకు ధర్మ యుద్ధం కంటే శ్రేయస్కరమైనది మరొకటి లేదు కదా!

 

శ్లో|| యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్
||(2-32)||

టీక:- పార్థ = అర్జున​; యదృచ్ఛయా = కోరకుండానే, యాదృచ్ఛికముగా;  చో ఉపపన్నం = సంప్రప్తమైనదియు; అపావృతమ్ = తెరువబడినది; స్వర్గద్వారమ్ =  స్వర్గద్వారమును; ఈ దృశమ్ = ఇట్టి; యుద్ధమ్ = యుద్ధమును; (యే); క్షత్రియాః = ఏ క్షత్రియులు; లభంతే = పొందుచున్నారో; తే = వారు; సుఖినః = ధన్యులు.

భావము: అర్జునా! అప్రయత్నముగానే లభించినట్టిదియు, తెరువబడిన స్వర్గ ద్వారం వంటిదియు అగు ఇట్టి యుద్ధమును  ఏ క్షత్రియులు పొందుతున్నారో వారు వాస్తవముగా ధన్యులే.

 

శ్లో|| అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి
||(2-33)||

టీక:- అథ = ఇక​; త్వమ్= నీవు; ఇమమ్=ఈ; ధర్మ్యమ్= ధర్మయుక్తమైన​; సంగ్రామం = యుద్ధమును; న కరిష్యసి = చేయ కుందువేని; తతః = అందువలన​; స్వధర్మమ్= స్వధర్మమును; కీర్తించ = కీర్తిని; హిత్వా= విడిచి; పాపమ్= పాపమును; ఆవాప్స్యసి = పొందగలవు.

భావము: అర్జునా! ఇక నీవు ధర్మయుక్తముగా ఈ యుద్ధము చేయకుందువేని దానిచే నీవు స్వధర్మమును అనాదరించినవాడవై కీర్తిని పోగొట్టుకుని పాపమును పొందగలవు.


శ్లో|| అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే
||(2-34)||

టీక:- అపిచ​= మరియును; భూతాని =ప్రాణులు (జనులు); తే = నీ యొక్క​; అవ్యయామ్ = చిర కాలము మాయ కుండునట్టి; అకీర్తిం = అపకీర్తిని; కథయిష్యంతి = కథలుగా చెప్పుకొనగలరు; సంభావితస్య = గౌరవముగలవానికి; అకీర్తిః = అపకీర్తి; మరణాత్= చావు కంటెనూ; అతిరిచ్యతే = అధికమైనదగుచున్నది.

భావము: అర్జునా! మరియు లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలం వరకు చెప్పుకొనుచుందురు. గౌరవంగా బతికిన వానికి అపకీర్తి చావు కంటేను అధికమైనది.


శ్లో|| భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్
||(2-35)||

టీక:- చ = మఱియు; యేషాం= ఎవరిలో; త్వం= నీవు; బహుమతః భూత్వా = గౌరవింపబడినవాడవై; లాఘవమ్ = చులకనను (అగౌరవమును); మహారథాః = మహారథులు; త్వాం = నిన్ను; రణాత్ = రణము నుండి; భయాత్= భయము వలన​; ఉపరతం= మఱలినవానిగా; మంస్యంతే = తలతురు.ద్రణాదుపరతం మహారథాః
చ యాస్యసి

భావము: అర్జునా! మరియు ఇంతవరకు ఏ మహారధులు నిన్ను గొప్ప విలుకానిగా భావించుచున్నారో వారే నిన్నిప్పుడు చులకనగా చూచి భయముచేఁ యుద్ధం నుండి మరలిన వానిగా తలంతురు.

 

శ్లో|| అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్
||(2-36)||

టీక:- తవ= నీ యొక్క​; అహితాః = శత్రువులు; తవ= నీ యొక్క​; సామర్థ్యం = సామర్థ్యమును; నిందంతః= దూషించువారై; బహూన్ = అనేకములైన​; అవాచ్యవాదాంశ్చ = అనరాని మాటలు కూడా; వదిష్యంతి= పలుకగలరు; తతః= అంతకంటే; దుఃఖతరం = దుఃఖతరమైనది; కిమ్ ను= ఏమి కలదు?

భావము: అర్జునా! అంతే కాక ఆ శత్రువులు నీయొక్క నైపుణ్యమును సామర్థ్యమును దూషించుచు, పెక్కు దుర్భాషలను కూడా పలుకగలరు. దానిని మించిన దుఃఖ మేమిగలదు?


శ్లో|| హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః
||(2-37)||

టీక:- కౌంతేయ = ఓ అర్జున​!; హతో వా= మరణించినచో; స్వర్గమ్= స్వర్గమును; ప్రాప్స్యసి = పొందగలవు; జిత్వా వా = జయించినచో; మహీమ్ = రాజ్యమును; భోక్షసే = అనుభవించుదువు; తస్మాత్= అందువలన​; యుద్ధాయ= యుద్ధము చేయుటకు; కృతనిశ్చయః= కృతనిశ్చయుడవై; ఉత్తిష్ఠ= లెమ్ము.

భావము: అర్జునా! అర్జున ఒకవేళ నీవే ధర్మయుద్ధమందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును పొందుదువు. అట్లుకాక నీవే జయించినచో ఈ భూలోకరాజ్యమును అనుభవించెదవు. (ఈ ప్రకారముగా రెండు విధముల మేలే జరుగును.) కావున లెమ్ము! యుద్ధమునకు సంసిద్ధుఁడవు కమ్ము!

x-x-x-x


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి