టీకా:- ఏనమ్ = ఈ ఆత్మను; శస్త్రాణి – ఆయుధములు; న ఛిన్దన్తి = ఛేదింపజాలవు;
పావకః = అగ్ని; ఏనమ్ =ఈ ఆత్మను; న దహతి = కాల్చజాలదు; ఆపఃచ = నీరున్ను; ఏనమ్ = ఈ ఆత్మను; నక్లేదయన్తి = తడుపజాలదు; మారుతః = గాలి; న శోషయతి = ఎండింపజాలదు.
భావము: ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు,
గాలి ఎండిపోవునట్లు చేయలేదు.
శ్లో||అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ।
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ||(2-24)||
టీక:- అయమ్
= ఈ ఆత్మ, అచ్ఛేద్యః =
ఛేదింపబడడు, అయమ్ = ఈ
ఆత్మ, అదాహ్యః కాల్చబడజాలడు, (మఱియు); అక్లేద్యః = తడుపబడడు; అశోష్యః ఏవచ = ఎండింపబడడు;అయం= ఈ ఆత్మ, నిత్యః=
నిత్యుడు, సర్వగతః =
అంతటను వ్యాపించియున్నవాడు,
స్థాణుః=
స్థిరస్వరూపుడు, అచలః =
చలనములేనివాడు, సనాతనః =
అనాదియైనవాడు.
భావము: ఈ ఆత్మ
ఛేదింపబబడడు, దహింపబడడు, తడుపబడడు, ఎండింపబడడు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిరస్వరూపుడు, నిశ్చలుడు, సనాతనుడు.
శ్లో|| అవ్యక్తోఽయమచింత్యోఽయమవికార్యోఽయముచ్యతే ।
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||(2-25)||
టీక:- అయమ్
= ఈ ఆత్మ, అవ్యక్తః = ఇంద్రియములకు గోచరింపనిది; అయమ్ = ఈ ఆత్మ;
అచిన్త్యః = మనస్సుచే చింతింపనలవికానిది;
అయమ్ = ఈ ఆత్మ; అవి
కార్యః = వికారమునొందింపబడనిది; (ఇతి =
అని); ఉచ్యతే = చెప్పబడుచున్నది, తస్మాత్=
అందువలన; ఏనమ్=ఈ ఆత్మను; ఏవమ్ = ఈ
ప్రకారముగ; విదిత్వా= తెలిసికొని; అనుశోచితుం
= దుఃఖించుటకు, న అర్థసి= తగదు.
భావము: ఈ ఆత్మ ఇంద్రియములకు
గోచరముకానివాడు, మనస్సుచే చింతింపశక్యము కానివాడు, వికారములు
బొందింపదగనివాడునని చెప్పబడుచున్నాడు. కావున ఈ ప్రకారముగ తెలిసికొని నీవు శరీరం
కోసము శోకించవలదు.
వ్యాఖ్యానము:
మనలోని ఇప్పటి చైతన్యమును అనాది నుండి వచ్చుచున్న చైతన్యమును జోడించు ఈ ఆత్మ జీవమున్నదిగానో లేనిదిగానో నిర్ణయించ లేము. అది అనేక అవస్థలను, విపత్తులను దాటుకొని తటస్థముగా నిలిచినది. దీనిపై మరింత విశదంగా 13వ అధ్యాయములో చర్చించుకుందాం.
ప్రతిక్రియలకు అతీతమైన దానిని, ఇదమిద్ధమగు స్వరూపం లేనిదానిని, అది ఒక సంజ్ఞయో, ఒక గొలుసు వంటిదో తెలియని దానిని, అంటీ అంటని దానిని గ్రహించుట అసంభవము. పైగా, అట్టి దానిని తెలియుట మూలమున ఆర్ధిక, సామాజిక, వ్యక్తిగత ప్రయోజనములు శూన్యము. అటువంటి 'అప్రయోజనకరమగు' దానిని, ప్రయోజనములే పరమావధిగా భావించు వారు నిష్ప్రయోజనమని వదలివేతురు.
మనము సాధించితిమి అని చూపుటకు ఆనవాళ్లు లెని దానిని తెలుపుట ఎట్లు? కావున అట్టి "అనిశ్ఛితమును అధిగమించితిమి" అను వారిలో మోసకారులే అధికము. వారు. ఇతరుల అజ్ఞానము ఆసరాగా ఆర్ధిక, సామాజిక, వ్యక్తిగత ప్రయోజనములు పొంద చూతురు. అట్టి వారి మాటల్లో పడి ధనము, కాలము వెచ్చించుట మూర్ఖత్వం.
యుగాంతము నుండి యుగాంతం వరకు విస్తరించి వున్న దానిని ఈ చేతనావస్థలో సాధించలేము. ఆస్వాదించలేము. అనుభవించలేము. దానికి గల మార్గములు జీవితపు పరిధిని దాటి వుంటాయని తదుపరి నాలుగు శ్లోకాలు చెబుతున్నాయి. ఆత్మ తృప్తికై సరిపెట్టుకొనువి, సర్ది చెప్పుకొనునవి ఆత్మ ద్రోహములే.
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి