15, సెప్టెంబర్ 2024, ఆదివారం

2-18: సాంఖ్య యోగము. 18వ శ్లోకము

శ్లో|| అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ||(2-18)|| 

టీక:- నిత్యస్య = నిత్యుడును, అనాశినః = నాశనము లేనివాడును, అప్రమేయస్య = ప్రత్యక్షాది ప్రమాణములచే దెలిసికొనబడనివాడును, శరీరిణః = దేహియైన ఆత్మయొక్క, ఇమేదేహాః = ఈ శరీరములు, అంతవంతః = వినాశము కలవిగా, ఉక్తాః = చెప్పబడినవి, తస్మాత్ = ఆ కారణమువలన, భారత = ఓ అర్జునా! యుధ్యస్వ = యుద్ధము (=కార్యము)  చేయుము. 

భావము:  ఓ అర్జునా! నిత్యుడును, నాశరహితుడును, అప్రమేయుడునగు వాడు (ఆత్మ) దేహము నందున్నాడు. కానీ  ఈ దేహములు నాశవంతములుగ జెప్పబడినవి.  కాబట్టి శాశ్వతమైనదాని గూర్చి కాని, దేహమును గూర్చి కాని శోకమును వదలి నీవు యుద్ధము (=కార్యము) చేయుము.

వ్యాఖ్యానము:

జీవితం యొక్క పరమోద్దేశం కనుక్కో: మానవులకు జీవితంలో చేయవలసిన కార్యములు స్పష్టంగా ఏమీ లేనప్పటికీ జీవితం యొక్క పరమోద్దేశం కనుగొని తమకు నిర్దేశించిన కార్యము నిర్వర్తించడం మాత్రమే మానవుని చేతిలో ఉన్న పరిమితమైన ఎంపిక. తక్కినవన్నీ తరచుగా మన ప్రస్తుత స్థితిలో, మన స్వంత ఆలోచనలు మరియు స్థితివ్యాజము (కండిషనింగ్) ద్వారా మనను తప్పుదారి పట్టిస్తాయి. కాబట్టి, దైవాజ్ఞను పాటించుట యొక్కటే ఆచరణీయ మార్గము.

మానవుడు విశ్వము యొక్క అంతర్భాగం: వాస్తవానికి, మనలోని చైతన్యము విశ్వమును నిర్దేశించు చైతన్యంలోని అంతర్భాగం. అయితే, దీనిని గుర్తించి, దైవికమైన ఆజ్ఞకు అనుగుణంగా మనల్ని మనం మలచుకోవడానికి బదులుగా, ఈ సందర్భంలో అర్జునుడి వలె, మన పరిమిత అనుభవాలు మరియు భయాల ఆదేశములతో మన స్వంత  మార్గనిర్దేశం చేసుకోవడానికి సిద్ధమౌతాము. ఈ ఒక్క పొరపాటు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అగపడే గందరగోళానికి, అవకతవకలకు దారితీస్తుంది.

విఱ్ఱవీఁగుచు జీవిత యాత్ర: హిందూ తత్త్వశాస్త్రాన్ని కాచివడపోసిన ప్రబోధకులలో అగ్రగణ్యులుగా పరిగణించదగ్గ అన్నమాచార్యులు ఈ క్రింది విధంగా అన్నారు.

గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ

విఱ్ఱవీఁగుచుఁ దీసీని వేడుకతో జీవుఁడు ॥పల్లవి॥

భావము: గుఱ్ఱాలఁను గట్టని తేరు అను  దేహముపై అహంకారముతో విర్రవీగుతూ నిముషమైనా తటపాయించక వేడుకగా సాహసోపేతమైన యాత్రకు బయలుదేరుతాడు జీవుఁడు.

సత్యము తలకెక్కదు: ఇది ఇంత స్పష్టంగా ఉంటే దైవాజ్ఞ పాటించడం చాలా సులభం అనిపిస్తుంది. కానీ మానవుడు అందులోనే తడబడతాడు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ దుఖంలో ఉన్న అర్జునునికి నీవు యుద్ధం చేయి అన్న మాటలు తలకెక్కవు. అలాగే మనమున్న స్థితిలో  దైవాజ్ఞ  తెలియుట అసంభవము. ఒకవేళ తెలిసినా మన అనుభవముల దృష్ట్యా అటువైపు మనసు పోవుట వెర్రితనమే అనిపించును.

x-x-x-x


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి