15, సెప్టెంబర్ 2024, ఆదివారం

2-19, 20: సాంఖ్య యోగము 19 & 20వ శ్లోకములు

శ్లో|| య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ||(2-19)|| 

టీక:- యః = ఎవడు, ఏనమ్ = దీనిని; ఈ (శరీరమందలి) ఆత్మను, హన్తారమ్ = చంపువానినిగ, వేత్తి = తెలిసికొనుచున్నాడో, యశ్చ = ఎవడు, ఏనమ్ = వీనిని, హతమ్ = చంపబడినవానినిగ, మన్యతే = తలంచునో, తౌ ఉభౌ = ఆ యిద్దఱును, న విజానీతః = తెలిసినవారుకారు, అయమ్ = ఈ ఆత్మ, న హన్తి = చంపుటలేదు, న హన్యతే చ = చంపబడుటయు లేదు. 

భావము:   ఎవడీ శాశ్వతమైనదానిని (యాత్మను) చంపుదానిగాను లేక ఎవడు చంపబడుదానిగాను భావించునో, వారిరువురును వాస్తవమెఱిగినవారు కారు. యథార్థముగ శాశ్వతమైనది మార్పులకు లోబడదు. 


శ్లో|| న జాయతే మ్రియతే వా కదాచి
న్నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||(2-20)||

 

టీక:- అయమ్ = ఇది, (ఈఆత్మ);  కదాచిత్ = ఎప్పుడును; నజాయతే = పుట్టుటలేదు;  న మ్రియతేవా = చచ్చుటయులేదు; నభూత్వా = (ఇదివఱకు) ఒకప్పుడు లేకుండ; భూయః = ఇంకా, మరలా; భవితావాన = (క్రొత్తగా) భవిష్యత్తులో కలుగువాడునుకాదు; అయమ్ = ఇతడు, అజః = పుట్టుకలేనివాడు, నిత్యః = మరణములేనివాడు, శాశ్వతః = ఎల్లప్పుడునుండువాడు, పురాణః= అనాదియైనవాడు, శరీరే హన్యమానే (సతి) = శరీరము చంపబడినను, నహన్యతే = చంపబడుట లేదు. 

భావము: ఈ ఆత్మ ఎప్పుడును పుట్టుట లేదు. ఇదివఱకు లేకుండి మరల క్రొత్తగా కలుగువాడు కాదు. (ఉండి మరల లేకుండువాడును కాదు). ఈతడు జనన మరణములు లేనివాడు; శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఈతడు చంపబడుటలేదు. 

వ్యాఖ్యానముమనలోనే వున్నప్పటికీ మనకు తెలియని వాడు పరమాత్మ. ఈ విషయం భగవద్గీతలో అనేక తూర్లు పునరావృతం అవుతుంది. ఆ తెలియనివాని వైపు అడుగులు వేయుట ఎట్లు? మార్గమే లేదు. కానీ తన చర్యలలోని అజ్ఞానము కనుగొని, తానేమీ చేయలేని గ్రహించి ఊరక ఉండువాడు విజ్ఞుడు. అజ్ఞానమును ఒప్పుకొనుటయే తెలివి.

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి