టీక:- కశ్చిత్ = ఒకానొకడు, ఏనమ్ = ఈ
ఆత్మను, ఆశ్చర్యవత్ = ఆశ్చర్యకరమైనదానివలె, పశ్యతి = చూచుచున్నాడు, తథైవ = అటులనే, అన్యఃచ = మఱియొకడు, ఆశ్చర్యవత్ = ఆశ్చర్యకరమైనదానినివలె,
ఏనమ్ = ఈ ఆత్మను, వదతి = చెప్పుచున్నాడు,
అన్యఃచ = ఇంకొకడు, ఏనమ్ = ఈ ఆత్మను, ఆశ్చర్యవత్; ఆశ్చర్యకరమైనదానినివలె, శృణోతి = వినుచున్నాడు, శ్రుత్వాపి = వినియును,
ఏనమ్ = ఈ ఆత్మను, కశ్చిత్ చ =(వారిలో) ఎవడును; నవేద ఏవ = ఎఱుంగుటయే లేదు
(సాక్షాత్తుగ అనుభూత మొనర్చుకొనుట లేదు.).
భావము: ఈ ఆత్మను ఒకానొకడు
ఆశ్యర్యమైనదానినివలె చూచుచున్నాడు. మఱియొకడు ఆశ్చర్యమైనదానినివలె (ఆత్మ గూర్చి)
చెప్పుచున్నాడు. అట్లే వేరొకడు అశ్చర్యమైనదాని వలె ఆత్మను గూర్చి వినుచున్నాడు.
అట్లు వినియు, చూచియు, చెప్పియుగూడ ఎవరును దానిని సరిగా తెలిసికొనుటలేదు
(సాక్షాత్తుగ అనుభవించుటలేదు.)
వ్యాఖ్యానము:
పదాలు చిహ్నాలు యథార్థ వస్తువు కావు: మన మనస్సులో పదాలు లేదా వాటి చిహ్నాలు ఒక విషయాన్ని సూచిస్తాయి. మనము ఈ పదాలు/చిహ్నాలకు అతుక్కుపోతాము. అంతేకాక వాటిని తరచుగా యథార్థ వస్తువుకు ప్రామాణికంగా తీసుకొని తడబడుతున్నాము. క్రింద ఇచ్చిన అదనపు వివరణలో ఇవాన్ పావ్లోవ్ ప్రయోగము కూడా చూడండి. మనం మనకెంత ప్రాపంచిక జ్ఞానం ఉన్నా మనం ఈ చిహ్నాలకే బానిసలమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వీటిని దాటుకుని అసలైన వస్తువు వైపు ప్రయాణం దాదాపు శూన్యము.
వెనుకకు-ముందుకు-ఒకేసారి
చూడటం: కేవలం
చూడటం, వర్ణించడం, వినడం ద్వారా మెచ్చుకోవడం ద్వారా ఆత్మను ఎవరూ అర్థం చేసుకోలేరు. దీనియర్థం మనం ఆత్మను తలచే తలము మరియు దానిని
నిర్ధారణచేయు చేయు తలము వేరువేరుగా ఉన్నంత కాలం, ఆత్మ అనుభూతిలోనికి రాదు. కాబట్టి ఇది ఒక వ్యక్తి తన ఆత్మతో తనను తాను విలీనం చేసుకోవాలని
సూచిస్తుంది, అందువలన ఇది సైద్ధాంతిక అన్వేషణ కానే కాదు. ఒకే
సమయంలో చేయడము, నేర్చుకోవడము జరగవలెను.
అదనపు వివరణ:
ఇవాన్ పావ్లోవ్ ప్రయోగము: క్లాసికల్ కండిషనింగ్ (=స్థితివ్యాజము = స్థితి
కలిగించు భ్రమ) ప్రమాదవశాత్తు నమోదు చేయబడింది. ఇవాన్ పావ్లోవ్ కుక్కల
జీర్ణక్రియపై పరిశోధన చేస్తున్నప్పుడు, ఆహారం పట్ల కుక్కల శారీరక ప్రతిచర్యలు కాలక్రమేణా
కొద్దికొద్దిగా మారుతున్నాయని గమనించాడు. మొదట్లో, కుక్కలు వాటి ముందు ఆహారాన్ని ఉంచినప్పుడు మాత్రమే
లాలాజలాన్ని స్రవించేవి. అయితే, తరువాత వాటికి ఆహారం రాకముందే అవి కొద్దిగా లాలాజలము
కార్చడం మొదలుపెట్టాయి. ఆహారం రాకముందే ఒక
క్రమ పద్ధతిలో వస్తున్న శబ్దాలకు అవి లాలాజలాన్ని స్రవిస్తున్నాయని
పావ్లోవ్ గ్రహించారు; ఉదాహరణకు, వాటికి ఆహారం తెచ్చే తోపుడు బండి శబ్దాలు కావచ్చు.
క్లాసికల్ కండిషనింగ్ (=స్థితివ్యాజము = స్థితి కలిగించు భ్రమ) అతని సిద్ధాంతాన్ని పరీక్షించడానికి, పావ్లోవ్ ఒక ప్రయోగాన్ని ఏర్పాటు చేశాడు, అందులో అతను
కుక్కలకు ఆహారం అందించే ముందు గంటను మోగించాడు. మొదట్లో, కుక్కలు
గంటలకి ఎటువంటి ప్రతిస్పందనను చూపలేదు. అయితే, క్రమేణ, కుక్కలు ఒంటరిగా (ఆహారం చూడకుండానే) గంటల శబ్దానికి
లాలాజలము స్రవించడం ప్రారంభించాయి.
స్థితివ్యాజము సత్య దూరము: స్థితివ్యాజము యొక్క ప్రభావముతో
విన్నవి చూచినవి చెప్పినవి కూడా అపభ్రంశము చెంది
సత్యమునకు దూరముగా పోయెదము అని ఈ శ్లోకము అర్ధముగా భావించవలెను.
క్రింది అన్నమాచార్యులవారి పల్లవి చూడండి.
చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి
చూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు
భావము: సాధారణంగా దీనిని (తనలోని తనను) పట్టించుకొనక అద్భుతమైన విషయాన్ని మనిషి మరుగున పెడుతున్నడు.
దాదాపు రెండు వేల సంవత్సరముల క్రిందట సెనెకా గారు
చెప్పిన మాటలు కనువిప్పుకు మార్గములు. "మనకు చాలా తక్కువ సమయం ఇవ్వబడినదని కాదు, కానీ దానిలో చాలా భాగము అవివేకముగా
కోల్పోతాము. ... మన జీవితం చిన్నది కాదు, కానీ మనం
దానిని అలా చేసుకుంటాము; మనకు లేమి లేదు. కానీ ఉన్నదాన్ని అసమర్థతో పారవేసు కుంటాం." - లూసియస్
సెనెకా
అనుమిత (ఉప) సిద్ధాంతములు (corollaries):
మన ప్రస్తుత స్థితి నుండి సానుకూలంగా లేదా ప్రతికూలంగా భావించబడిన ఏదైనా కదలిక లేదా కార్యము అజ్ఞాన జనిత చర్యయే. ఆచరించలేని స్థితిలో సంపూర్ణ మౌనంతో నిలిచి ఉండటమే నిజముగా మానవునికి గల అవకాశం. ఐతే ఇది సాధన ద్వారా సాధించగలిగినదికాదు. (Refer to 4.18).
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి