టీక: -
మహాబాహో!= గొప్ప బాహువులు కల ఓ అర్జునా!; అథచ = ఒకవేళ; ఏనమ్ = ఈ
ఆత్మను; నిత్యజాతమ్ = ఎల్లప్పుడును పుట్టుకగలవానిగ గాని; వా = లేదా; నిత్యమ్ = ఎల్లప్పుడును;
మృతమ్ = మరణముగలవానిగ
గాని; మన్యసే = తలంతువేని; తథా2పి (తథా అపి)= అట్లైనను, అయినా సరే; ఏవమ్ = ఈ
రీతిగ; శోచితుమ్ =దుఃఖించుటకు; త్వమ్ = నీవు; న అర్హసి =
తగవు.
భావము: కానీ ఒకవేళ
నీవు, ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే, ఓ అర్జునా! ఇలా శోకించుట తగదు.
శ్లో|| జాతస్య హి
ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ||(2-27)||
టీక:-
జాతస్య = పుట్టినవానికి;
మృత్యుః =
చావు; ధ్రువోహి =
నిశ్చయముగదా!; మృతస్య = చచ్చినవానికి; జన్మచ =
పుట్టుకయు; ధ్రువం =
నిశ్చయము; తస్మాత్ = ఆ
కారణమువలన, అపరిహార్య =తప్పింపశక్యముకాని;
అర్థే = (ఈ)
విషయమందు; త్వమ్ =
నీవు; శోచితుమ్ =
దుఃఖించుటకు, న అర్హసి=
తగవు.
భావము: పుట్టిన
వానికి మరణం తప్పదు, మరియు మరణించినవానికి మరల పుట్టుక తప్పదు.
కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.
వ్యాఖ్యానము:
ఘటనలు మన ప్రమేయము లేకనే జరుగును: “అర్జునా నీవు అత్యధిక బలసంపన్నుడవు. అనివార్యమైన యుద్ధం కాని మరణము గాని నీ నియంత్రణ లేకనే జరుగును. వాటిలో పాలుపంచుకోక తప్పదు. ఏ రకంగా చూచిననూ నీవు దుఃఖించుట తగదు” అని ఉద్భోదిస్తున్నారు శ్రీకృష్ణులవారు.
విచారించి లాభం లేదు: (మన ఇప్పటి నమ్మకాల్ని పక్కనపెట్టి ఆలోచిస్తే) మరణం తర్వాత అదే జీవుడు తిరిగి పుడతాడు అన్న ఎటువంటి ప్రమాణము లేదు. కాబట్టి తిరిగి పుట్టడం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మరణం తప్పనిసరి అయినప్పుడు ఎంత విచారించి లాభం లేదు.
ధైర్యంగా జీవించువాడు: కానీ మరణం నుండి తప్పించుకోవడానికి మనిషి అనేక విన్యాసాలు చేస్తాడు. మరణ భయము
మానవుడిని ఆ దిశగా నడిపిస్తుంది. దీని ద్వారా మనిషి తన నిజ స్వభావానికి దూరమౌతాడు.
ఈ శ్లోకము మరణం అనివార్యమని హృదయపూర్వకంగా అంగీకరించువానికి నిజంగా జీవించడమేమిటో
సూచించునని గమనించడం ముఖ్యం. మరణము తప్పదని తెలిసి ధైర్యంగా జీవించువాడే
జీవించువాడు. క్రింది అన్నమాచార్యుల కీర్తనను
చూడండి
చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి
మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా ॥పల్లవి॥
భావము: ఇంత కష్టపడి బ్రతుకుటయూ జీవించుటేనా? అది మరణముకన్నా ఏ రకముగా మిన్న? నిత్య సంఘర్షణతో కూడిన జీవితాన్ని గడపడం కంటే అహంకారములు, తెచ్చిపెట్టుకొన్న దొరతనములను మానుకోవడము మేలు కాదా?
సంక్లిష్ట చట్రం: మన దైనందిన అనుభవాలకు అంతర్లీనంగా మన ఉనికిని నిర్వచించే ఊహలు
మరియు అన్వేషించని నిర్ణయాల సంక్లిష్ట చట్రం ఉంది. ఈ అన్నమాచార్యుల కీర్తనను జాగ్రత్తగా గమనించండి.
ఆతుమపంజరములోన నయమున నుండి నా చేతనే పెరిగిన చిలుకా
జాతిగాఁ కర్మపు సంకెళ్ళఁబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా
భాతిగాఁ చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంపు రెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా
తలక్రిందుల
జీవితము: ఇది "జీవితం అంటే ఏమిటి" అనే ప్రాథమిక
ప్రశ్నకు దారితీస్తుంది? ‘మృత్యువు’ గురించి తెలియకుండా మనం ‘జీవితాన్ని’ అర్థం
చేసుకోలేమని కూడా మనం ఊహించవచ్చును. ఈ అధ్యాయాంలోనూ, తరువాతి అధ్యాయాలలోను మనం
సమానత్వం అనే పదాన్ని విరివిగా వాడటం చూస్తాము. టూకీగా ఈ సమానత్వము జీవనము మరణముల సమతుల్యతను
సూచించునది. భగవద్గీత భావంలో సమానత్వం అనేది ఎటువంటి వక్రీకరణలు లేకుండా
మరణాన్ని మరియు జీవితాన్ని సమానంగా చూడటమే. (ఈ రకంగా చూస్తే
ఈ శ్లోకమునకు 11 వ శ్లోకమునకు గల సంబంధం బోధపడును.) ఈ
శ్లోకము మరింత మౌలికమైన ఆలోచనలకు వేదికగా నిలుస్తుంది.
మన కర్తవ్యం: మరణాన్ని అనుభవించలేము కాబట్టి, మనిషి ఏమి చేయవలె? చైనీస్ తత్వశాస్త్రం యిన్-యాంగ్‌లో (పై బొమ్మని
చూడండి) చూపిన విధంగా జీవితం మరియు మరణం ఒకదానికొకటి
వ్యతిరేకించు ప్రత్యర్థి శక్తుల వలె పనిచేస్తాయి. ఇది విరుద్ధమైన కానీ పరస్పరం
అనుసంధానించబడిన, స్వయం చలిత-శాశ్వత చక్రమును సూచిస్తుంది.
యిన్ మరియు యాంగ్‌లను పరిపూరకరమైన మరియు అదే సమయంలో వ్యతిరేక శక్తులుగా
భావించవచ్చు, ఇవి ఒక డైనమిక్ వ్యవస్థను ఏర్పరుస్తాయి.
వీని సమాకలనము అందలి వేరువేరు భాగాల మొత్తము కంటే ఎక్కువగా ఉంటుంది,
అయితే ఆయా భాగాలు లేకుండా ఆ ఏకీకరణ సాధ్యముకాదు. కావున అసలైన
జీవితమును మరణమును దాటకుండా తెలియలేము.
మహత్తరమైన రహస్యం: పై చర్చ
నుండి, మేము ఎల్లప్పుడూ యిన్-యాంగ్ యొక్క రెండు స్థానాల్లో ఏదో ఒకదానిలో ఉంటామని
అర్థం చేసుకున్నాము. వీటిని కలపడం లేదా ఏకం చేయడం మానవ సామర్థ్యానికి మించిన పని.
ప్రాథమికంగా ఈ వ్యతిరేక శక్తులను కనుగొన్న తరువాత, ప్రకృతి
శక్తులకు లొంగిపోవాలి. అటువంటి మహత్తరమైన రహస్యాన్ని కనిపెట్టిన మహానుభావుల మనసు
సంపూర్ణ రూపాంతరం చెంది మరియు వారు ఆ స్థితిని చేరుటకు ఏమేమి దాటినది
వర్ణించలేకపోతారు. కాబట్టి, ప్రకృతి శక్తులకు సమ్మతము
తెలుపుట లేదా ధ్యానం చేయడం అనేది రహస్యంగానే ఉండిపోయింది. ధ్యానం పేరుతో మనం ఏమి
చేసినా అది ధ్యానం అనిపించుకోదు.
x-x-x-x

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి