21, ఏప్రిల్ 2024, ఆదివారం

2-9, 10: సాంఖ్య యోగము. 9 & 10వ శ్లోకములు.

 సంజయ ఉవాచ

శ్లో|| ఏవ ముక్త్వా హృషీకేశం
గుడాకేశః పరంతపః|
న యోత్స్య ఇతి గోవిందం
ఉక్త్వా తూష్ణీం బభూవ హ!
||(2-9)||

టీక:- పరస్తపః = శత్రువులను తపింపజేయునట్టి; గుడాకేశః = అర్జునుడు, హృషీకేశమ్ = శ్రీకృష్ణునితో; ఏవం = ఈ ప్రకారముగ; ఉక్త్వా = చెప్పి; నయోత్స్యే = యుద్ధము చేయను; ఇతి గోవిందం = (ఆ) కృష్ణపరమాత్మతో; ఉక్త్వా = పలికి; తూష్ఠీంబభూవహ = ఊరకుండెను.


శ్లో|| తమువాచ హృషీకేశః
ప్రహసన్నివ భారత!|
సేనయో రుభయో ర్మధ్యే
విషీదంత మిదం వచః
||(2-10)||

టీక:- భారత = ఓ ధృతరాష్ట్రమహారాజా! ఉభయోః సేనయోః = రెండుసేనలయొక్క, మధ్యే = నడుమ, విషీదన్తమ్ = దుఃఖించుచున్న, తం = ఆ అర్జునుని గూర్చి, హృషీకేశః = శ్రీకృష్ణుడు, ప్రహసన్నివ =నవ్వుచున్నవానివలె, ఇదం వచః = ఈ (చెప్పబోవు) వాక్యమును, ఉవాచ = పలికెను. 

భావము: సంజయుడు ఇట్లనెను: అర్జునుడు "నేను యుద్ధమును చేయను" అని పలికి నిశ్శబ్దముగ చతికిలబడినాడు! ఉభయ సేనల మధ్య శోక సముద్రంలో ఉన్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను

 

వ్యాఖ్యలు: 

భగవద్గీత అధ్యయమునకు చుట్టూతా వున్న పరిస్థితులు కాదు, తీవ్రమైన పట్టుదల ముఖ్యం​: భగవద్గీత ఉపదేశము ఉభయ సేనల మధ్య జరగడం గమనించతగినది. మనలో చాలామంది ఈ తత్వ శాస్త్రములు ఆధ్యాత్మిక శాస్త్రములు అర్థం చేసుకోవడానికీ తగిన సమయం కావలెను”; తగిన సందర్భం ఉండవలెను”; “తగిన పరిస్థితులు కావలెను”; తగిన వాతావరణము కావలెను”; అని అభిప్రాయములు వెలిబుచ్చుతుంటారు. కానీ భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పబడింది. కాబట్టి, వీటన్నింటి కంటే లక్ష్యం పట్ల తీవ్రమైన కాంక్షసత్వరమే సాధించు విశ్వాసము అవసరము అని తెలియవచ్చును. 

కడు నిందులో బరము గడియించవలెగాక: జాగ్రత్తగా గమనిస్తే మన జీవితమే ఒక యుద్ధరంగము. మనమంతా ఏదో ఒక పని చేయుట లోనే ఊరట పొందుతాము. అందుకనీ నిరంతరముగా యథార్థముగా అర్థంలేని అనేక కార్యములు కల్పించుకుని క్షణం కూడా తీరిక లేకుండా ఉంటాం. ఈ ప్రయత్నములను ఒక మాటు ఆపి, భగవద్గీత చదువుటకు తగిన సమయం కేటాయించి తమతమ జీవితములు సార్ధకం చేసుకోనవలెను.కు తగిన సమయం కేటాయించి తమతమ జీవితములు సార్ధకం చేసుకోనవలెను.

x-x-x-x

 

2-8: సాంఖ్య యోగము. 8వ శ్లోకము

 శ్లో|| న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||(2-8)||

టీక: టీక: నహి ప్రపశ్యామి = నేను నిజముగా చూడలేకున్నాను(ఊహించలేకున్నాను); మమ — నా యొక్క; అపనుద్యాత్ — పోగొట్టే; యత్ — ఏదైతే; శోకం — శోకమును; ఉచ్ఛోషణమ్ — తపింపచేయు చేయునట్టి; ఇంద్రియాణామ్ — ఇంద్రియముల యొక్క; అవాప్య — దక్కిన​ తరువాత; భూమౌ — ఈ భూమిపై; అసపత్నమ్ — ఎదురులేని; ఋద్దం — సుసంపన్నమైన; రాజ్యం — రాజ్యము; సురాణామ్ — దేవతల యొక్క; అపి — అయినా; చ — కూడా; ఆధిపత్యమ్ — ఆధిపత్యము.​ 

భావము:  (కృష్ణా!!) నాకు సర్వ భూమండలానికి ఏకచ్ఛత్రాధిపత్యం ఇచ్చినా సరే; స్వర్గాధిపత్యం ఇచ్చినా సరే; నా సర్వేంద్రియాలను ఎండ కొట్టేస్తున్న ఈ దుఃఖం నివారణము అయ్యేలా లేదు.

2-7: సాంఖ్య యోగము. 7వ శ్లోకము

శ్లో|| కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః

యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్
 
||(2-7)|| 

టీక:- కార్పణ్యదోషోపహతస్వభావః = కృపణత్వమను (లోభత్వమను, ఆత్మజ్ఞానశూన్యత్వమను) దోషముచే దెబ్బతిన్న స్వభావము గల (నేను), ధర్మసమ్మూఢచేతాః = ధర్మవిషయమున సందేహముగల మనస్సుగలవాడనై, త్వాం = నిన్ను, పృచ్ఛామి = అడుగుచున్నాను, యత్ = ఏది, నిశ్చితం = నిశ్చయింపబడిన, శ్రేయః = శ్రేయము, స్యాత్ =అగునో, తత్ = దానిని, మే = నాకు, బ్రూహి = చెప్పుము, అహమ్ = నేను, తే = నీకు, శిష్యః = శిష్యుడను, త్వాం = నిన్ను, ప్రపన్నం = శరణుబొందిన, మాం = నన్ను, శాధి = శాసింపుము. 

భావము:  (కృష్ణా!!) ఈ రాజ్య లోభముతోను, బంధు లోభముతోను దెబ్బతిన్న మనసుతో ధర్మ నిర్ణయం చేయలేక నిన్నడుగుతున్నాను. నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నాకు ఏది మంచిదో నువ్వే చెప్పు. 

20, ఏప్రిల్ 2024, శనివారం

2-6: సాంఖ్య యోగము. 6వ శ్లోకము

 శ్లో|| న చైత ద్విద్మః కతర న్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామః
తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| (2-6)

 

టీక: నః = మనకు, కతరత్ = (చేయుటకు) ఏది, గరీయః = శ్రేష్టమో, చ ఏతత్ = దీనినికూడ, న విద్మః =ఎఱుగను, జయేమ యద్వా = (మనము) జయించెదమో, (లేక) నః = మనలను, జయేయుః యదివా = (వారే) జయించెదరో? యాన్ = ఎవరిని, హత్వా = చంపి, న జిజీవిషామః = జీవింప గోరమో, తే ధార్తరాష్ట్రా ఏవ = అట్టి ధృతరాష్ట్రుని సంబంధులగు భీష్మాదులే, ప్రముఖే = ఎదుట, అవస్థితాః = నిలిచియున్నారు.

 

భావము: (కృష్ణా!!) ఎవరిని చంపాక జీవించడానికి ఇష్టపడమో, ఆ ధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు. ఈ యుద్ధంలో వారి గెలుపు మేలా? లేక మా గెలుపు మేల? అన్నది నిర్ణయింప లేకున్నాను.

 

వ్యాఖ్యలు:

1. అర్జునుడు ఇంకా కారణాలు వెతుకుతున్నాడు.  అర్జునుడు వివశుడై సంయమనము కోలుపోయితానెందుకు ఆ సమయంలో అక్కడ (యుద్ధరంగంలో) ఏ ఫలితమునాసించి వచ్చెనో అది మరచి మాట్లాడం అతని మానసిక స్థితిని స్పష్టంగా తెలియజేయుచున్నది.

 

2. అనేక సందర్భాల్లో, పరస్పరం విరుద్ధమైన భావాలు మనిషిని లాగుతూ ఉంటాయి. వాటిలోంచి సవ్యమైన దారిని ఎంచుకోవడమే విజ్ఞత. అక్కడే చాలామంది చతికిలబడతారు

 

3. క్రింది అన్నమయ్య కీర్తన అర్జునుడి మనోభావాలను చక్కగా ప్రతిబింబిస్తోంది. (with translation of the central idea) 

 

ఆరయఁ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారము
వూరక కలిమిలేము లొక్కొక్కవేళ
మేరలేని చీఁకటియై మించును దుఃఖములెల్లా
వూరటలేని కర్మికి నొక్కొక్కవేళా అట్టి 

భావము: ఒక్కొక్కవేళ కలిమిలేములు ఈ జీవితమును కొండను ఎత్తినట్లు అనిపింపచేస్తాయి. వేగించుతాయి. ఒక్కొక్కవేళ ఎల్లలే లేని చీకటిలా దుఃఖములు వూరట నివ్వక కమ్ముకొంటాయి. 

Meaning: Sometimes, the wealth or lack of it, make life seem like lifting a hill. Such a man feels like being inside a frying pan. Sometimes, sorrows surround him like an endless darkness.


 

 

2-4, 5: సాంఖ్య యోగము. 4వ & 5వ శ్లోకములు.

 అర్జున ఉవాచ

శ్లో|| కథం భీష్మమహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన ।
ఇషుభి ప్రతియోత్స్యామి 

పూజార్హవరిసూదన ||(2-4)||

టీక:- అర్జున ఉవాచ = అర్జునుడు ఇట్లనెను, అరిసూదన = శత్రువులను నశింపజేయునట్టి, మధుసూదన = ఓ కృష్ణా! పూజార్హా = పూజింపదగినట్టి, భీష్మం = భీష్ముని, ద్రోణం చ = ద్రోణుని, సంఖ్యే = యుద్ధమునందు, అహం = నేను, ఇషుభిః = బాణములతో, కథం = ఎట్లు, ప్రతియోత్స్యామి = ఎదిరించి యుద్ధము చేయగలను?


శ్లో|| గురూ నహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహ లోకే
హత్వా
ర్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్
|| (2-5)||

టీక:– మహానుభావాన్ = మహానుభావు లైన, గురున్ = గురువులను, అహత్వా = చంపక, ఇహలోకే =  ఈ లోకమునందు, భైక్ష్యమపి = భిక్షాన్నమైనను, భోక్తుం = భుజించుటకు, శ్రేయోహి =శ్రేయముకాదా!, గురూన్ = గురువులను, హత్వాతు = చంపియో, ఇహైవ = ఈ లోకముననే, రుధిర ప్రదిగ్ధాన్ = రక్తముచే పూయబడిన, అర్థకామాన్ = అర్థకామరూపములగు (ధనసంపదలు, కామ్యవస్తువులు), భోగాన్ =భోగములను, భుంజీయ = భుజించువాడ నగుదును

భావము: అర్జునుడిట్లనెను-(కృష్ణా!!) "భీష్ముడు, ద్రోణుడు మొదలగు గురువులూ, మహానుభావులూ అయిన వారిమీద బాణములను ఏరకంగా సంధింప గలను? పూజ్యనీయులైన వారిని చంపి, రక్తసిక్తమైన రాజ్య సంపదలను భోగించుట కంటే ఈ లోకమున బిచ్చమెత్తుకొనియైనను జీవించుట శ్రేయస్కరము."

 

 

వ్యాఖ్యలు: 

1. అర్జునుడు యుద్ధ విరమణ కోసం కారణాలు వెతుకుతున్నాడు. బిక్షాటన క్షత్రియులకు తగినది కాదు. అయినా అర్జునుడు యుద్ధాన్ని వదిలి సన్యాసం తీసుకుంటాను అన్న సంకేతం ఇస్తున్నాడు. 

2. అన్యాయ పక్షమున నిలిచినందుకు వారు (ఆ గురువులు, ఆ మహానుభావులు) జీవించుటకు అర్హత కోలుపోయిరని పండితుల అభిప్రాయం.

 

2-3: సాంఖ్య యోగము. మూడవ​​ శ్లోకము

 

|| క్లైబ్యం మాస్మగమః పార్థ!
నైతత్ త్వయ్యు పపద్యతే|
క్షుద్రం హృదయ దౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరంతప!
||(2-3)||

 

టీక: పార్థ= అర్జునా!; క్లైబ్యమ్ = నపుంసకత్వమును; మా, స్మ, గమః = పొంద వద్దు; ఏ త త్ = ఇవి (ఈ పిరికితనములు); న ఉపపద్యతే = కలుగ రాదు (తగదు); పరంతప= శత్రువులను జయించేవాడా; క్షుద్రం= తుచ్ఛమైన; హృదయ దౌర్బల్యం= మనసులోని పిరికితనం; త్యక్త్వా= త్యజించి; ఉత్తిష్ఠ= లెమ్ము.



భావము: ఓ అర్జునా!! పిరికితనమునకు లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా! మనసులోని అధైర్యము వీడి, కార్యాచరణ కై (యుద్ధమునకై) నడుము బిగింపుము.

 

వ్యాఖ్యలు:  

1. వివేకానందుడికి, ఎందరో మహానుభావులకీ అత్యంత ఇష్టమైన శ్లోకమిది. 

2. జాగ్రత్తగా ఆలోచిస్తే చాలామంది నాయకుల/ప్రతినాయకుల వైఫల్యానికి వారిలో ఉండే చిన్న బలహీనతలే కారణంగా కనబడుతాయి. షేక్స్పియర్ నాటకముల లోనూ నాయకుల బలహీనతలే వైపరీత్యానికి దారి తీస్తాయి.

 

2-2: సాంఖ్య యోగము. రెండవ​ శ్లోకము

 శ్రీ భగవానువాచ

శ్లో|| కుత స్త్వా కశ్మల మిదం
విషమే సముపస్ధితం|
అనార్యజుష్ట మస్వర్గ్యం
అకీర్తికర మర్జున!|| (2-2)
 

టీక: శ్రీ భగవానువాచ — పరమేశ్వరుడైన భగవానుడు పలికెను; కుతః — ఎక్కడినుండి (ఏ కారణము చేత​); త్వా — నీకు; కశ్మలం — భ్రాంతి, మోహము; ఇదం — ఈ యొక్క; విషమే — ఈ విషమ సమయంలో; సముపస్థితమ్ — పొందినది, దాపురించినది; అనార్య జుష్టమ్— అనాగరికమైన వ్యక్తిలతో ఆచరింపబడునది; అస్వర్గ్యమ్ — ఉత్తమ లోకాలకు భంగకరమైనది; అకీర్తి-కరమ్ — అపకీర్తిని కలిగించేది; అర్జున — అర్జునా.

భావము: భగవానుడు ఇట్లనెను "అర్జునా విషమ సమయములో ఈ దుఃఖావేశము నీకు ఎటుల దాపురించినది? ఇది శ్రేష్ఠుల చేత ఆచరింప తగనిది; ఉత్తమ లోకములకు దారి తీయనిది మరియు అకీర్తిని కలిగించునది"

 

వ్యాఖ్యలు:  

1. శ్రీ కృష్ణుడు మొదటి ప్రయత్నంగా అర్జునునితో క్షత్రియునికి తగని పనులు, తగని సమయములో చేయుచున్నావు. అర్జునుని సంబాళించుకుని జరగవలసిన కార్యమునకు సన్నద్ధుని కమ్మనెను. 

2. ఇప్పటికీ మన ప్రాంతాల్లో ఓరి! అప్రాచ్యుడా! అని తిడతారు. కొంచెం ఆలోచిస్తే అది పెద్ద తిట్టు. అంటే వాడు తూర్పువాడు కాదు అని అర్ధం. ఈ రకంగా చూస్తే, అనార్యుడు, అప్రాచ్యుడు ఒకే కోవకు చెందినవే.