2, మే 2024, గురువారం

2-14, 15: సాంఖ్య యోగము. 14వ & 15వ శ్లోకములు.

 శ్లో|| మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః
ఆగమాపాయినోనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ||(2-14)|| 

టీక:- కౌంతేయ = ఓ అర్జునా!, మాత్రాస్పర్శాస్తు = ఇంద్రియములయొక్క శబ్దాది విషయ సంయోగములు, శీతోష్ణ సుఖదుఃఖదాః = శీతము, శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము - వీనినిచ్చునవియు; ఆగమాపాయినః = రాకడపోకడలు గలవియు, అనిత్యాః = అస్థిరములును (అయియున్నవి), తాన్ = వానిని,భారత = భరతకులమందు బుట్టిన ఓ యర్జునా! తితిక్షస్వ = ఓర్చుకొనుము. 

భావము:  ఓ అర్జునా! ఇంద్రియములయొక్క శబ్దస్పర్శాది విషయసంయోగములు ఒకపుడు శీతమును, ఒకపుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును మఱియొకపుడు దుఃఖమును గలుగజేయుచుండును. మఱియునవి రాకడపోకడలు గలవియై, అస్థిరములై యున్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము. 

శ్లో|| యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే
||(2-15)|| 

టీక:- పురుషర్షభ= పురుష శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఏతే = శబ్దస్పర్శాది విషయములు, సమదుఃఖసుఖమ్ = సుఖదుఃఖములను సమముగ జూచునట్టి, ధీరమ్ = ధైర్యశాలియగు, యం పురుషమ్ = ఏ మనుజుని, వ్యథయన్తి = బాధింపవో (చలింపజేయవో), సఃహి = అతడు గదా, అమృతత్వాయ = మోక్షముకొఱకు, కల్పతే = తగియున్నాడు. 

భావము:  పురుషశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఎవనిని ఈ శబ్ధస్పర్శాదులు చలింపజేయవో, సుఖదుఃఖములందు సమభావముగల అట్టి ధీరుడే మోక్షమున కర్హుడగును.​ 

వ్యాఖ్యానము

విజ్ఞులు తెలియుదురు: ఇక్కడ ధీరులు అనగా విజ్ఞులైన వారు అని అర్థము. 12వ శ్లోకం (న త్వేవాహం జాతు నాసం...అర్ధాన్ని తీసుకుంటే, ఇది ఇంకా సులభముగా గ్రహించ వచ్ఛు. మనిషి లోనే మొత్తము ప్రపపంచము ఇమిడి ఉండగా, భౌతిక ప్రక్రియలైన  కౌమారము, యవ్వనము, వార్థక్యము కేవలము బయటకు వ్యక్తమయ్యే ఘటనలు మాత్రమే. ఐతే అనంతమైన చైతన్యము నందు ఇవియన్ని  పొరలు పొరలుగా ఇమిడి వున్నాయని అనుకోవచ్చును. 

తటస్థముగా ఉండలేము: గమనిస్తే 11, 12, 13 శ్లోకముల పరిణామమే పై రెండు శ్లోకములు. 11  దానిలో మానవుడు మరణం జీవనములను సమానముగా తీసుకొనవలెనని సూచించారు. 12వ దానిలో మానవునికి శాశ్వతత్వం పొందడానికి అవకాశముందన్నారు.  13వ దానిలో జీవితం అనునది  గోలుసుకట్టులాగ  ఒక దాని తర్వాత ఇంకొక దశ జరుగుతూ పోతుందన్నారు. ఇక్కడ ఈ శ్లోకములలో తనలోనే ఈ మార్పులు జరుగుతుండగా  గమనించి కూడా తటస్థముగా ఉండువాడు ధీరుడు అని చెప్పారు. అంటే తటస్థముగా ఉండుట అత్యంత కఠినము అనునది కూడా ఇక్కడ సూచించారు.

మనస్పూర్తిగా అంగీకరించము,తన దేహంలో జరుగు ఈ మార్పులు మానవునికి సుఖప్రదమైనవి మాత్రం కావు. అంటే ధీరుడు అనువాడు వీనిని అనుభవిస్తూ కూడా ఎటువంటి ప్రతిక్రియను వ్యక్తం చేయక తనలో జరుగుతున్నది మంచిదే అని హృదయపూర్వకముగా స్వీకరించి ఊరక ఉండువాడు మోక్షమునకు అర్హుడు అని సెలవిచ్చారు. విజ్ఞులు తాము కల్పించుకొనక​ ప్రకృతికి తమపై ఇష్టమొచ్చినట్లు చేసుకొను అధికారము కల్పించారు అనుకోవచ్చును.  

ఓర్చుకోలేముఎలాగూ మోక్షం వస్తుంది కదా.  ఓర్చుకుంటేపోతుంది కదా అన్ని కూడా అనుకొనుటకు వీలుకాదు.   

షరతులులేని ప్రయాణం: ముందుగానే చెప్పుకున్నట్టు ప్రకృతి విధించు ఈ పరీక్ష చెప్పాపెట్టకుండా వస్తుంది. ఆ పరీక్షను విధిస్తున్నది దైవం అని తెలిస్తే మనం ఓర్చుకోవడనికి సన్నద్ధులౌతాం. కానీ పరీక్షిస్తున్నారు ఎవరో తెలియనప్పుడు ఓర్పు గగనమే అవుతుంది. ఎటువంటి హామీలు లేకుండా తన వైపు నుండి ఇటువంటి పరీక్షకు గురి కావడానికి ఎవరికి ఇష్టం ఉంటుందిపైగా అటు కావచ్చుఇటూ కావచ్చు అనే సంశయం పీడిస్తూనేవు ఉంటుంది. సంక్షేమము అను బాటలో సత్యముండుటకు ఆస్కారం లేదు (2-45 చూడుము).  అనగా మానవుడు ఈ పరీక్షకు మనస్ఫూర్తిగా తయారైనప్పుడు అవకాశం ఉంటుంది.

సత్యము ఎరుకపడదు: మానవుడు ప్రత్యేకంగా దీనికి సంసిద్ధత తెలుపలేడు.  తాను చేస్తున్న పనిలో పూర్తిగా మిగిలి పూర్తిగా మునిగిపోయి తను తన చుట్టూ ఉన్న ప్రపంచం మరిచి ఏకాగ్రతలో ఉన్నప్పుడు ఆ సత్యముతో సంపర్కము కలుగవచ్చును..  దీని విశిష్టత తెలుపుటకేసూటిగా క్లుప్తముగా చెప్పు భగవద్గీతలోరెండు శ్లోకములను కేటాయించిదాదాపు ఒకే విషయాన్ని పునరావృతం చేశారు.

అనుమిత (ఉప​) సిద్ధాంతములు (corollaries): 

ఏకాగ్రత: సహనము, ఓపిక​, రెచ్చగొట్టే సమయాల్లో ఏకాగ్రత కోలుపోక పోవడము ఒక రకముగా మూర్ఖంగా అనిపించినప్పటికీ, ఇవి లేకుండా సత్యాన్వేషణ అసాధ్యము. తమపైతాము నమ్మకముంచి ఒంటరిగా నిలబడలేనివారికి ఇది అశక్యము. 


వివరణము: ఇక్కడ చెప్పిన ఒంటరితనం ఏదో ఒకరోజు; ఒక సంవత్సరం అను కాలముతో సంబంధం లేని అనంతమైనది. ప్రపంచమంతా ఒకవైపు తానొకవైపు వుండు ఏకాకి ప్రయాణము. ఇందులోని పరీక్షలు క్రింది అన్నమాచార్యుల కీర్తన వలె నుండును.

 

జమునోరిలో బ్రదుకు సంసారము చూడ

చమురు దీసిన దివ్వె సంసారము

సమయించుఁ బెనుదెవులు సంసారము చూడ

సమరంబులో నునికి సంసారము     ॥సడి॥

భావము: సంసారము యముని నోటిలో బ్రదుకు వంటిది. (తననోట జీవించువానిని యముడు క్షణమునందైన కబళింపవచ్చును).. అట్లే సంసారమున నున్నవాడు ఎప్పుడైన ప్రమాదమునకు గురికావచ్చును.

సంసారము చమురుదీసిన వత్తి వంటిది. దీపము చక్కగా వెలుగక ఆరిపోవుటకు సిద్ధముగానున్నట్లే. సంసారి సుఖస్థితి నొందక మృత్యుముఖమున బడుటకు సిద్ధముగా నుండును

సంసారము మందు లేని రోగము వంటిది. దినదినమునకు క్షీణింపజేసి చివరకు ప్రాణము దీయును. సంసారము గూడ జీవుని శమదమాది గుణములను హరించి స్వాతంత్ర్యహీనుని జేసి చివరకు మృత్యుముఖమున బడద్రోయును. 

సంసారము యుద్ధ భూమిలో  ఇల్లు వంటిది. రణరంగమున నున్నవాడు నలువైపులా శత్రువులచే ముట్టడింపబడి దెబ్బలు తినుచూనే ఉండును. అట్లే సంసారియు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులచే ఆక్రమింపబడి బాధ మరియు క్షయము నొందును

x-x-x-x


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి