4, మే 2024, శనివారం

2-16: సాంఖ్య యోగము. 16వ శ్లోకము

శ్లో|| నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః
ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ||(2-16)|| 

టీకః  అసతః = అసత్యమైనదానికి; లేనిదానికి (తాత్కాలికమైనదానికి, మన ఇప్పటి స్థితికి); భావః = ఉనికి; నవిద్యతే = లేదు; సతః = ఉన్నదానికి (=సత్యమైనదానికి); అభావః = లేమి; నవిద్యతే = లేదు; అనయో = వీటిలో; ఉభయోరపి = రెండింటియొక్క; అన్తఃతు = నిజమైన సారాంశం; నిశ్చయముగా ఏది నిలిచి యుండునో; తత్త్వదర్శిభిః = జ్ఞానులచేత, దృష్టః = చూడబడినది.

భావము:  అసత్యములై (నామరూపాత్మకములై, నశించు స్వభావముగలవియై) నట్టి దేహేదులకు ఉనికిలేదు, సత్యమైనట్టి ఆత్మకు లేమిలేదు. తత్త్వజ్ఞానులగువారి రెండింటి యొక్క నిశ్చయమును బాగుగ తెలిసికొనియున్నారు.

వ్యాఖ్యానము:

మన ఎఱుక తాత్కాలికము: మానవుని జీవనమును నిర్దేశించు రెండు ముఖ్య ఘటనలు - పుట్టుక మరణముల మధ్యనే మనకు ఎఱుక పుట్టుచున్నది. అనగా ఇది అనంతమునకు చెందినది కాదు (2-28). దేనికైతే నిర్దిష్టమైన మొదలు అంతము వున్నవో అవి యన్నియు అశాశ్వతములే (5-22).

ఆత్మ తత్వము: దేని మూలమున మానవుడు తాను మరణించానని తెలియలేడో దానిని వివరిస్తున్నారు. ఈ జీవనము అను అనంత ప్రయాణములో జీవులు పుట్టి మరణించుట అనునది సహజము. అట్టి మనకు అనంతము గురించి తెలిసినది కేవలం అభిప్రాయములు, ఊహాగానములు మాత్రమే. అనగా సత్యదర్శనము లేదా అనంతదర్శనము మరణము అనునది దాటకుండా కలుగదు. 

శాశ్వతత్వ​ము అనుభవించి చెప్పినదిఇక్కడ “తత్త్వదర్శిభిః' - 'దర్శిభిః' అని చెప్పి దాని తత్త్వమును ప్రత్యక్షముగ చూచినవారని అర్థము కల్పించిరి. కేవలము విని చదివి తెలుసుకున్నవారు కారని, ఆ శాశ్వతత్వ​ము అనుభవించి చెప్పినవారు అని అనుకోవాలి. 

అశక్తతా సోపాన క్రమము: మన ప్రపంచము అశక్తతా సోపాన క్రమమును (phenomenon of Trophic Cascade)  అనుసరించి నడచుకొనును. అగ్రశ్రేణిన వున్న మాంసాహారుల (వేటాడు జంతువుల చేరిక లేదా తొలగింపుల​) ద్వారా ప్రేరేపించబడిన పర్యావరణ దృగ్విషయం అశక్తతా సోపాన క్రమము. ఇది ఆహార గొలుసు (సైకిల్) ద్వారా మాంసాహారుల మరియు ఆహారం యొక్క సాపేక్ష జనాభాలో పరస్పర మార్పులను సూచించును. ఇది తరచుగా పర్యావరణ వ్యవస్థ నిర్మాణం మరియు పోషకముల ఆవృత్తిలో (సైక్లింగ్‌లో) గణనీయమైన మార్పులను అంచనా వేయుటకు సహకరించును. 

పెను మార్పులు సంభవమా?చిన్న దిద్దుబాటులతో ఇంతటి పెను మార్పులు సంభవమా అని సందేహము కలిగించును.  క్రితము శతాబ్ధం మొదట్లో (1925 ప్రాంతములలో) ఎల్లోస్టోన్   నేషనల్ పార్కులో తోడేళ్ళను వేటాడి అంతము చేయడంతో జింకల సంఖ్య అపరిమితముగా పెరిగి అక్కడ ఉన్న వృక్షసంపదను పూర్తిగా తినివేసి దాదాపుగా ఎడారిలా మార్చివేశాయి. వాటి సంఖ్యను తగ్గించడానికి మానవులు దాదాపు డేబ్భై సంవత్సరములపాటు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనము లేక పోయినది.

నాటకీయమైన మార్పులు1995లో కేవలము 25 తోడేళ్ళను  ప్రవేశపెట్టినప్పుడు నాటకీయమైన మార్పులు జరిగి 15 సంవత్సరముల లోపుననే ఆ అరణ్యము తిరిగి పూర్వపు వైభవమును పొందినది. మరింత వివరణము కొరకు క్రింది లింకు చూడండి. తోడేళ్ళు నదులను ఎలా మార్చగలవు?

మూలకారణము కనుగొనుము: అశక్తతా సోపాన క్రమమును అనుసరించి ఏది లేదో దాని ప్రభావమును మాత్రము మనము  మనలో తెలియుదుము. పై ఉదాహరణలో జింకలను నియంత్రించుటకు చేసిన ప్రయత్నాలు వీగి పోయినవి. అనగా ప్రభావమును నియంత్రించడం వలన ప్రయోజనం కనపడదు. ఆ ప్రభావమునకు మూలమేదియో కనుగొనవలెను. 

మందులు మింగినంత సులభమైన మార్గములేదుమన మనసు బాహ్య ప్రపంచమును (మనకు తెలియకనే) అనుకరించును. కావున ​మన అంతరంగము కూడా బయలు కాన్పడు ప్రపంచము వంటిదే. మనలో సత్యము లేక పోవుటచే అసత్యము ఇష్టా రాజ్యమేలుచున్నది. (పై ఉదాహరణలో జింకల సంఖ్య లాగ) ఈ అసత్యమును అదుపులో ఉంచలేము. సత్యమును చేరుటకు, మనము రుగ్మతలకు మాత్రలు వేసుకొన్నంత సులభమైన మార్గములేదు. దానికొక్కటే ఔషధము. అసత్యమును అన్ని విధములా పారద్రోలుట.   సత్యమునకు మార్గము కనుగొనక పరమును చేరలేము.

 

అనుమిత (ఉప​) సిద్ధాంతములు (corollaries):

మూలకారణము కనుగొనక సమస్య పరిష్కారం సూచించలేము.పైపై అగపడు సమస్యలను తొలగించిన వాటి స్థానములో మరిన్ని వచ్చి చేరును. సమూలముగ పెకలించని సమస్య సమస్యగానే మిగిలిపోవును. 

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి