4, మే 2024, శనివారం

2-17 : సాంఖ్య యోగము. 17వ శ్లోకము

శ్లో|| అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ||(2-17)|| 

టీకః - ఇదంసర్వమ్ = ఈ సమస్త ప్రపంచమును, యేన = దేనిచేత (ఏ దైవము చేత), తతమ్ =వ్యాపించబడియున్నదో, తత్తు = దానిని, అవినాశి = నాశము లేనిదానిగా, విద్ధి = ఎఱుంగుము, అస్య = ఈ, అవ్యయస్య = నశింపని సత్పదార్థమునకు, వినాశమ్ నాశమును, కర్తుమ్ = కలుగజేయుటకు, కశ్చిత్ = ఎవడును, న అర్హతి = తగడు. 

భావము:  ఓ అర్జునా! ఏది అయితే విశ్వమంతటను వ్యాపించి ఉన్నదో అది నాశరహితమైనదని యెఱుంగుము. అవ్యయమగు అట్టి దానిని  వినాశము చేయుటకు ఎవరిచేతను కాదు. 

వ్యాఖ్యానము:

అనంతము అంతు చిక్కదు: ప్రపంచమున ఎందరో మేధావులు అనంతము అనుదాని గురించి పరిశోధనలు చేశారు. కొందరు దానిని గణిత పద్ధతిలో; కొందరు చిత్ర పద్ధతిలో; ఇంకొందరు శ్లోకములు  పద్యముల రూపములో; ఇంకొందరు అంకెల రూపంలోను వర్ణించి తరించిరి. ఐనప్పటికీ మానవుని వూహకు అనంతము చిక్కక చిక్కులు పెడుతూనే వున్నది.

క్రమ పద్ధతి లేదు: మానవులుగా మనము, ఎంతో నిడివిగల సూర్య మండలమును, పాలపుంతను, గేలాక్సీలను ఒక క్రమ పద్ధతిలో వూహించుకొని మనస్సులో నిక్షిప్తం చేసుకుంటాము. అటులనే ఎంతకు తెగని అనేక సంకేతములను కంఠస్థము చేసుకోగలుగుతాం. కొందరు వేదాలనే కంఠస్థము చేయగలిగారు. కానీ అనంతం గురించి మానవుడు ఇదమిత్థమైన అవగాహనకు రాలేక పోయాడు. ఈ రకముగా మానవుని మేధకు అనంతము ఒక కొరకరాని కొయ్యగా మిగిలిపోయినది.

అనంతంగా పునరావృతమగు నమూనాలు: గొప్ప కళాకారులు ఎం.సి. ఏస్ఛెర్ తరచుగా వంటి వారు పరిమిత ప్రాంతంలో, సరిహద్దులు దాటని,  అనంతంగా పునరావృతమయ్యే నమూనాలను సృష్టించడానికి అనేక విధములుగా ప్రయత్నించారు. అనంతం యొక్క భావనను చిత్ర మాధ్యముద్వారా అన్వేషించారు. వారికి పాయిన్'కెయర్ (Poincaire) వారి హైపర్‌బోలిక్ (అతిపరావలయ) జ్యామితి మోడల్ (నమూనా) ఒక ఆధారముగా మారినది. పాయిన్'కెయర్ వారి డిస్క్ మోడల్'కు నిర్వచించబడిన స్థలంలో అనంతంగా పునరావృతమయ్యే నమూనాలను (లేదా నకళ్ళను) సూచించే సామర్థ్యం కలిగి ఉంది.



అతిపరావలయ నమూనా: ఈ అతిపరావలయ నమూనాలో, మనము ఎస్చెర్ యొక్క కళాకృతిని (భూమిపై) ఒక కొండపై నిలబడి చూచిన దానితో పోల్చవచ్చును. సుదూర వస్తువులు చిన్నవిగా కనిపిస్తాయి, అయితే దగ్గరగా ఉన్నవి పెద్దవిగా కనిపిస్తాయి. భూగ్రహంపై  స్థానంతో సంబంధం లేకుండా సుస్థిరమైనదీ దృగ్విషయం. 

ఎస్చెర్ గారి వృత్త​ పరిమితి-III: ఎస్చెర్ గారి వృత్త​ పరిమితి-IIIలో  (Circle Limit III) నమూనాలలోని ప్రతి చేప అనంతమైన నకళ్ళకు (patterns) లోనవుతుంది, అయితే సమానమైన హైపర్బోలిక్ అక్షాల మధ్య దూరాలు డిస్క్ అంచు వైపు వెళుతున్నకొద్దీ క్రమంగా తత్సమానమైన చిన్న యూక్లిడియన్ దూరాలుగా మారతాయి.  పర్యవసానంగా, అంచులకు దగ్గరగా వుండే చేపలు చిన్నవిగా కనబడినప్పటికీ,  ఈ నమూనాలలోని అన్ని చేపలు ఒకే (హైపర్బోలిక్) పరిమాణంలో ఉంటాయి.

(4, 3, 3) అను సమితి:  ఎస్చెర్ గారి వృత్త​ పరిమితి-IIIని (4, 3, 3) అను సమితిగా పేరు పెట్టవచ్చు, అనగా కుడి మొప్పల వద్ద  4 చేపలు ఎడమ మొప్పల వద్ద 3 చేపలు సంఖ్య, ముక్కుల వద్ద 3 చేపలు కలుసుకుంటాయన్నమాట​.

అపారమగు  భావము: ఈ రకంగా చూస్తే, సుమారు 41 సెంటీమీటర్ల వృత్తములో అనంతమగు చేపల నకళ్ళను చూపించుటలో ఎస్చెర్ సఫలీకృతులయ్యారని చెప్పవచ్చును. అనంతమగు చేపల నకళ్ళను ఒక చిన్న వృత్తములో చూపి, అపారమగు  భావమునకు ఒక నిర్దిష్టమైన రూపు కల్పించారు ఎస్చెర్ గారు.

ఎటు చూసినా ఒకటే: ఇందులో గమనించవలసినది ఏమిటంటే వృత్తంలో ఎక్కడ ఉన్నా అక్కడనుంచి కనబడే దృశ్యం తిరిగి మనకు కనబడుతున్న దృశ్యం వలెనే ఉండును. అనగా ఈ  దృశ్యమాధ్యములో ఎక్కడకు వెళ్ళినా అదే సమాన పరిమాణముతో వున్న చేపలు ఎదురౌతాయి.

అకాశానికి నిచ్చెనలు అవివేకము: అనంతము అనగా మేరలు లేనిది. అందుకే పై బొమ్మలో ఎటు చూచినా ఒకే విధముగా కన్పట్టునట్లు చిత్రకారుడు ప్రయత్నించాడు. కొనలు లేని దాని కొనలు కొసలు  నిర్ణయించలేము. అద్దానిని మనసులో నిలుపుట అసంభవము. కావుననే దైవమును మానవుడు వీక్షించలేడు. కాని కాంక్షిచుతాడు. కానిదానికై ప్రయత్నము చేయుట అవివేకము అని ఎంచడు.

అసాధ్యమైన​ కార్యము: స్థూలముగా ఏది విశ్వమంతటను వ్యాపించి ఉన్నదో, అది నాశరహితమైనదో, ఆ అవ్యయమగు దానిని  వినాశము చేయుటకు ఎవరిచేతను కాదు. ఏలయనగా మానవుని అల్పత్వము ఈ కార్యమునకు దోహద పడదు. 

లేని దానిని వూహించుతాము: ఇక్కడ  ఎస్చర్ గారి చిత్రంలో చూపినట్లుగా మనము అనంతమునకు ఒక పరిథి కల్పించుకుని దానిని గ్రహించితిమని తృప్తి చెందుతాము. కానీ, వాస్తవానికి మనము దానిని గ్రహించలేమని అంగీకరించము. ఈ రకంగా మనకు మనము సర్దిచెప్పుకొని లేని అనుభూతిని పొందుతాం. అనవసరపు లంపటములో ఇరుక్కుంటాం. అనుభూతికి రాని దానిని తెచ్చుకున్నామను భ్రమలో వుంటాం.

సంజ్ఞలు అనంతమును చూపలేవు: పై రకంగా మనము తెలియ కుండానే ఎస్చర్ గారి బొమ్మను అనంతమునకు ప్రతీకగా ఊహించుకున్నట్లు, అనేకానేక సంజ్ఞలతోను, సంభావ్యములతోను, గుర్తులతోను మనసును నింపుకొని ఊహాలోకాల్లో విహరించుతూ జీవనమను దానికి మేరలు నిర్ణయించి, తాడు కట్టిన మేకలాగ జీవించు చున్నాము. జాగ్రత్తగా గమనించిన మన జ్ఞాపకములలో పట్టి ఉంచినవి కేవలము సంజ్ఞలు గుర్తులు మాత్రమే.

అశక్తతను ఒప్పుకోము: అందుమూలమున అనంతమగు దానిని ఏ రకముగాను ఇక్కడ బొమ్మలో చూపిన విధముగా మనస్సులో ఇముడ్చుకోలేము. కానీ మానవులుగా మనము మన అశక్తతను ఒప్పుకోలేము. అనంతమును ఒడిసి పట్టుకుందామనే ప్రయత్నములలో కాలము వృధా చేస్తాము.

ఈరకముగా ఈ శ్లోకమునకు క్రింది విధముగా అన్వయార్ధము చెప్పుకొనవచ్చును.

అనుమిత (ఉప​) సిద్ధాంతములు (corollaries):

సత్యము స్థిరముగా శాశ్వతముగా క్షయరహితముగా నిలుచునది. దానిని తెలియుటకు ప్రయత్నములుకానీ ప్రమాణములుకానీ లేవు. కావున మానవుడు చేయగలిగిన ఏకైక యత్నమును తెలియుము. (Also refer to 2-41)

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి