2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-69వ శ్లోకము

శ్లో|| యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||(2-69)|| 

టీక:- సర్వభూతానామ్ = సమస్తప్రాణులకును; యా = ఏది, నిశా = రాత్రియో; తస్యామ్ = దానియందు; సంయమీ = ఇంద్రియనిగ్రహముగల యోగి; జాగర్తి = మేలుకొని యుండును, యస్యామ్ = దేనియందు, భూతాని = ప్రాణులు, జాగ్రతి = మేలుకొని యుండునో, సా= అది, పశ్యతః= పరమార్థతత్త్వమును దర్శించుచున్న, మునేః = (ఆత్మ) మననశీలునకు, నిశా = రాత్రి ( భవతి = యగుచున్నది).

భావము 1:  సమస్త ప్రాణులకు (అనగా సామాన్య జనులకు) ఏది రాత్రియై దృష్టికి గోచరము కాక ఉన్నదో, దానియందు (ఆ పరమార్ధ తత్వమునందు) ఇంద్రియనిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. (ఆత్మావలోకనం చేయు చుండును). దేనియందు (అనగా ఏ శబ్దాది విషయములందు, అశాశ్వతమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచూ) ప్రాణులు మేలుకొని ఉందురో (ఆసక్తితో ప్రవర్తించుచుందురో) ఆ విషయ జాలము పరమార్ధ తత్వమును దర్శించు మునీంద్రులకు రాత్రితో సమానమై ఉండును (అనగా ఆసక్తి ప్రదర్శించరు).

భావము 2:  యోగులు జీవనమను దానిని (ఆత్మను​) తెలియుటలోను; జీవులు విషయములు అనుభవించుటలోనూ సమయం వెళ్ళబుచ్చుదురు.

వ్యాఖ్యానము: ఇది కీలకము, మూల స్తంభము అని చెప్పుకోదగిన శ్లోకము.

మొదటి భాగము

సామూహిక మిథ్యాభావన: ముందుగా ఈ శ్లోకం యొక్క ప్రత్యక్ష అర్ధమును వివరించు ఒక అధివాస్తవిక చిత్రమును పరిశీలించుదాము. మనము మత్స్యకన్య అంటూనే అందమైన యువతి పైభాగముగా కిందిభాగం చేప వలే ఉండునని సాధారణంగా ఊహించుకుంటాం. ఈ ఊహను సవాలు చేస్తూ రెనే మాగ్రిట్ క్రింద చూపిన విధంగా "ది కలెక్టివ్ ఇన్వెన్షన్" (సామూహిక మిథ్యాభావన) అనే పెయింటింగ్ను రూపొందించాడు.


ఆలోచనలలో విప్లవం: రెనే మాగ్రిట్ వేసిన సామూహిక మిథ్యాభావన  ఒక మెలికతో ఒక మత్స్యకన్యను చిత్రిస్తుంది. సంప్రదాయ చిత్రణకు భిన్నంగా, ఈ పెయింటింగ్ సాధారణ అంచనాలను తిప్పికొడుతుంది. పారంపర్యముగా వాడుకలోనున్న నియమాలను ఉల్లంఘిస్తూ మత్స్యకన్యను చేప ఎగువ శరీరం, మానవ దిగువ శరీరంతో చిత్రీకరించారు.

అవగాహనకు కొత్త రెక్కలు: మాగ్రిట్ గారి బొమ్మ మనము ముందుగానే ఊహించి ఎంచుకొన్న ఆలోచనలను సవాలు చేస్తుంది. సాధారణమైనదిగా పరిగణించబడే వాటిని ప్రశ్నించాలని కనువిప్పు కలిగిస్తుంది. ఈ కళాఖండం అసాధారణమైన ఆలోచనలను స్వీకరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది మరియు కొత్త కోణాలను అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది. కళలకు మన అవగాహనలను సవాలు చేసి, ఈ ప్రపంచం గురించి మన అవగాహనను విస్తరించే శక్తి ఉందని నిరూపిస్తుంది.

స్వయముగా బాటను ఎంచుకో: అన్నిటికంటే ముందుగా ఈ చిత్రం యొక్క పేరు సామూహిక మిథ్యాభావన  గమనించ తగ్గది. మానవుడు నలుగురూ వెళుతున్నారు కదా అని ఏదోఒక బాటను పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యోగి అయినవాడు అలా కాకుండా తనకుతాను పరిశీలించి స్వయముగా తన బాటను ఎంచుకోనును. ఈ శ్లోకంకూడా అదే విషయమును నిర్ధారించు చున్నది.

రెండవ​ భాగము

మనిషి, ప్రపంచము: ఈ శ్లోకంలో సర్వభూతానాం అని చెప్పి బాహ్య ప్రపంచములోని జనులకు  యోగికి ఉన్న వ్యత్యాసం సూచించారు. “సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా (6-29)” అను శ్లోకమును కూడా కలిపి విచారించిన యోగులు తమను బయటి ప్రపంచమును ఒకే విధముగా తలచి, అంతర బాహ్య వ్యత్యాసములను విడిచి, తమ కార్యములో అనగా తమలోని అజ్ఞానమును (అనగా తనలోనే వున్నా వారికి తెలియని దానిని) శోధించుటలో నిమగ్నమై ఉందురు. దీనిపై మరింత వివరణము కొరకు అన్నమాచార్యుల  కీర్తన  'వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు'పై వ్యాఖ్యానం కూడా చూడండి.

చిహ్నాత్మక రేయింబవళ్ళు: ఇక్కడ పగలు అనగా జీవించి ఉండుటను (='తెలుసు' అను దానిని)  రాత్రి అనగా మరణముతోను (= తెలియని దానిని) సంజ్ఞాత్మకముగా చెప్పిరి.

మనం ఎటువైపు: 'తెలుసు' అను దానిని యోగులు విడిచి వేతురు. దీనికి విరుద్ధంగా మనమేమో 'తెలుసు' అన్న దానిలో సంచరించుటకు మొగ్గు చూపుదుము. (ఇక్కడ తెలుసు అన్న దానిలో సమస్తమైన​ ఆలోచనలు ఆశలు ఆకాంక్షలు కలుపుకుని తీసికొన వలెను).

తెలియదని తెలియుటెట్లు?: తెలుసును అన్నవి తక్షణమో, కొంత సమయము తరువాతనో మంథనము చేసి సాధించ గలము. కానీ, తెలియదని తెలియుటెట్లు? కావున, ఇది ముఖ్యంగా గమనించ వలసిన విషయము. కాబట్టి తెలియదని తెలియుటకు ఆధారములు మృగ్యము.

ఉదాహరణకు, 2-27లో పేర్కొన్న మృత్యువు. దానియందు మన ఆసక్తి కేవలము దానిని "ఏ రకముగా  తప్పించుకొన వచ్చు" పై మాత్రమే. యోగులు దానిని (మృత్యువును) స్వీకరింతురు. అనగా మనది ప్రతిక్రియ. యోగులది స్వీకార క్రియ.

అనూహ్యమైన మార్గము: కానీ, మరణమును కౌగలించిన వారెవరూ తిరిగి ఈ ప్రపంచమున ప్రవేశించలేరు. అయినప్పటికీ ఒక అనూహ్యమైన మార్గము కలదు. అదియే బైబిల్లో పేర్కొన్న ఇరుకు ద్వారము. "తమవంటి శరణాగతులుఁ దాము / గొంది నిముడుకొందురు గురుకృప జనులు" "గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక దొడ్డతెరువువంక తొలఁగుమీ" అన్న అన్నమాచార్యుని పలుకులు కూడా దానినే లక్ష్యముగా చెబుతున్నాయి. మనకు దారిని చూపిస్తవి. అందుకే ఈ శ్లోకం అతి ముఖ్యమైనది.

మూడవ భాగము.

సార్వత్రిక దర్పణం: మాగ్రిట్టె గారి “Le miroir” (The universal mirror = సార్వత్రిక దర్పణం) అను అలౌకిక కళాఖండం వ్యతిరేకతల మద్య కనిపించే కీలకమైన ఉద్రిక్తతను తలపుకు తెస్తుంది. వైవిధ్యము, ఊహాజనితము మరియు అపరిమితమగు అంశాల కలయిక, స్థానం మరియు పరస్పర చర్యలు ఇందులో ప్రతిధ్వనిస్తాయి. మాగ్రిట్టే నిర్మించిన ప్రపంచాలలో, అసాధ్యమైనది సాధ్యమవుతుంది మరియు పేరులో సూచించినట్లుగానే, ఈ అద్దం సర్వమును సర్వ దిశలలో ప్రతిబింబిస్తుంది.



లోపల ఏది? బయట ఏది? ఆ హద్దులను నిర్ణయించు రేఖ:  మాగ్రిట్టే గారు తరచూ ప్రస్తావించే  ప్రసిద్ధ మూలాంశాలైన  రాత్రి మరియు పగళ్ల  అసాధారణ కలయిక ఈ చిత్రం. దీనిలో,  ఒకానొక గది పాక్షికంగా కనబడుతూ వుంటుంది. బయటి ప్రపంచాన్ని నీలమేఘ వర్ణముతోను,  నులి వెచ్చని వెలుతురుతో  నిండిన గది లోపలి ప్రపంచమును సూచించారు. అక్కడ చూపిన యువతిలో కొంతభాగము గదిలోపలను కొంతభాగము గది బయటను ఉన్నట్లు గమనించగలము. ఆ రెండు ప్రపంచములను వేరు చేసే ఎగుడుదిగుడు అంచు, ఆ రెండు ప్రత్యర్థి శక్తులను నొక్కిచెప్పే ఒక నిర్వచనం లేని గీత.  ఇది మాగ్రిట్టే గారి కెరీర్‌లోని అత్యంత ముఖ్యమైన దృశ్య చిత్రాలలో ఒకటైన  ప్రసిద్ధ L'empire des lumières సిరీస్‌కు మద్దతు ఇస్తుంది.

కలగాపులగమైన భావనలు: అదే సమయంలో, ఆ యువతిని అడ్డముగా లక్ష్యములేకుండా​ విభజించుచున్న ఆ అనూహ్యమైన రేఖ మానవుని మనస్సులో కలగాపులగమైన ఆలోచనలను, తారుమారైన విలువలను సూచించుచున్నది. మానవుడు తానున్న ప్రపంచం నుండి తనను మరియు ప్రపంచమును విడివిడిగా చూడటానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ ఆ కనబడుతున్న యువతి రూపము​​ కొంత భాగం బాహ్యప్రపంచంతోను స్వీయ ప్రపంచం తోనూ నిర్మించబడింది. (మానవులంతా ఈవిధముగానే తమ తమ ఆలోచనలను కొన్ని బయట నుండి, కొంత తమలోనే తాము నిర్మించుకుంటారు).

నీలతి ఆచ్ఛాదయతి అన్యవర్ణాన్ (=నీలము ఇతర రంగులను తెలియనీదు): బయటి భాగము ముదురు నీలం రంగులో చూపించి దాని గురించి మన అవగాహనా లోపభూయిష్టమైనది అన్ని తెలిపారు. మానవులు తాము తెలియవలసిన ముఖ్యమైన విషయములను వదలి అంతకు ఏవిధముగాను సరికాని, విలువలేని విషయములను విచారించుటలో ఆసక్తి చూపుదురు అని ఈచిత్రం ఉద్దేశము. 

ప్రాథమిక గందరగోళం: మానవుడు దేనికి ప్రాముఖ్యత ఇవ్వవలెనో తెలియక నలుగురి మాటలు విని, వారి వాదనలు విచారించి మరింత గందరగోళంలోకి దిగజారును. తనను తాను తెలియక, వేరెవరో చెప్పిన మాటలు పట్టుకొని, సత్యాసత్యములను తారుమారు చేసుకుని జీవనము కొనసాగించ బోతాడు. ఈ సత్యము మనమంతా ప్రత్యక్షంగా విచారించి కనుగొన​ వచ్చును. ఈనాటి ప్రపంచంలో గమనిస్తున్నటువంటి గందరగోళము అస్తవ్యస్థములకు మూలము, ఈ స్వీయ విచారణ లేకుండా నడుచు ప్రవృత్తి. ఇప్పుడు ఈ శ్లోకమునకు మాగ్రిట్టే గారి బొమ్మకు అవినాభావ సంబంధం ఉందని తెలియవచ్చు.

ప్రపంచమొక తీరని దాహం: పైన ఇచ్చిన రెండు ఉదాహరణలతో మన ఎదుటి ప్రపంచము విలోమ దర్పణంలా పనిచేయుచు పరీక్షించు చున్నదిఅనుకోవచ్చు. ఈ విలోమ తత్వము అన్ని దిశలలోనూ అన్ని వేళలలోనూ అందరి మీద పనిచేయుచున్నది. దీనిని తప్పించుకొనుట మానవులుగా మనకు అసాధ్యము. అందుమూలముననే ఈ అధ్యాయములో భక్తిని ప్రతిపాదించకపోయినాను,  దైవం యొక్క శరణాగతి పొందక ఇక్కడ సాఙ్ఖ్యయోగములో చెప్పిన ఏ కార్యములు మానవుడు నిర్వర్తించ లేడు (2-59). "ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్" యొక్క భావము కూడా అదే.

x-x-x-x

సాంఖ్య యోగము. 2-67 & 68వ శ్లోకములు

శ్లో|| ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి
||(2-67)||

టీక:- చరతాం ఇన్ద్రియాణామ్ = విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో, యత్= ఏయింద్రియమును, మనః = మనస్సు, అనువిధీయతే = అనుసరించి పోవుచున్నదో; తత్ = ఆ యింద్రియము, అస్య = దీనియొక్క, ప్రజ్ఞామ్ = వివేకమును, అంభసి = నీటియందు, నావమ్ = ఓడను, వాయురివ =(ప్రతికూల) వాయువువలె, హరతి హి = ఈడ్చుకొనిపోవుచున్నదిగదా!

భావము:  నీటిలో పారాడు నావను  బలమై​​న గాలి వీచి పెడదారికి లాగుకొని పోవునట్లు; ఏదేని ఇంద్రియము పైన మనస్సు కేంద్రీకృతమయినచో అయ్యది మనుజుని యొక్క వివేకమును తప్పుదారిలో ఈడ్చుకొనిపోవును.

శ్లో|| తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
||(2-68)||

టీక: - మహాబాహో ! = ఓ అర్జునా!; తస్మాత్ = అందువలన; యస్య = ఎవనియొక్క, ఇన్ద్రియాణి = ఇంద్రియములు; ఇంన్ద్రియార్థేభ్యః = ఇంద్రియ విషయముల నుండి; సర్వశః సర్వవిధములచేత (సంపూర్ణముగ); నిగృహీతాని= నిగ్రహింపబడినవో; తస్య = అతని యొక్క, ప్రజ్ఞా = జ్ఞానము (వివేకము), ప్రతిష్ఠితా = మిగుల స్థిరమైనది యగుచున్నది.

భావము:  కాబట్టి ఓ అర్జునా! ఎవడు తన యింద్రియములను విషయములపైకి పోనీయక సర్వవిధముల అరికట్టుచున్నాడో, ఆతని జ్ఞానమే మిగుల స్థిరమైయుండును.

వ్యాఖ్యానము:

పాత చింతకాయ పచ్చడి కాదు: ఇదేదో మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే. దీంట్లో గొప్పేముంది. పాత చింతకాయ పచ్చడి అని కొట్టిపారేయకండి. ఈ శ్లోకముల అర్ధమును ఒక వ్యంగ్య చిత్రం ద్వారా తెలుసుకుందాము. ముందుగా కింద ఇచ్చిన బొమ్మని పరీక్షగా చూడండి. (నిర్లక్ష్య యాత్రికుడు the reckless sleeper -Rene Magritte)



నిర్లక్ష్య యాత్రికుడు: ఈ కళాకృతిలో మాగ్రిట్ అత్యద్భుతమైన రహస్యము, గూఢార్థములతో కూడిన పొంతన లేని విభిన్న వస్తువులను తులనాత్మకంగా  విచారించుటకు ఒకచోట చేర్చి వుంచారు. ఇది కల లాంటి దృశ్యాన్ని సూచిస్తుంది. సమయం మరియు స్థలముల హేతుబద్ధలకు ఇక్కడ చోటు లేదు. ముఖ్యంగా ఒక వ్యక్తి చీకటి దుప్పటిలో కప్పబడి, గాఢమైన నిద్రలో, ఒక గూటి లాంటి పెట్టెలో తేలుతూ ఉన్నట్లుగా ఉన్నాడు.

వాటిని వాట్లవాట్ల గూళ్ళలో పేట్టేశాను: అతని క్రింద పక్షి, చేత్తో పట్టుకుని అద్దం, వెలిగించిన కొవ్వొత్తి, సీతాకోకచిలుక మరియు ఆపిల్ వంటి వివిధ వస్తువులు ఉన్నాయి. అవి ఎవరో అమర్చినట్లుగా తమ తమ గూళ్లలో పెట్టి నట్టుగా కనపడతాయి. మొత్తానికి ఈ చిత్రాన్ని చూస్తే ఆ వ్యక్తి నేను ఎక్కడ ఉంచాల్సినవి అక్కడ ఉంచాను కాబట్టి నాకు వాట్ల గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు అని నిశ్చింతగా పడుకున్నట్లుగా కనబడుతోంది.



పనిముట్లను అమర్చుకుంటాం: మనిషి తన ఇంద్రియములను ఆధీనములోని తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ముఖ్యంగా వాటికి మనసులో ఒక స్థానాన్ని కల్పించి దానిని ఆస్థానంలోనే ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఒక మెకానిక్ తన టూల్స్ని (పనిముట్లను) చక్కగా ఎలా అమర్చుకుంటారో అలా అమర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఈ విషయాన్ని బొమ్మలో చూపించడానికి ప్రయత్నం చేశారు మాగ్రిట్.

చైతన్యమును గూటిలో పెట్టలేము: మన మనసులను ప్రభావితం చేయు ఇంద్రియములు అక్కడ చూపించిన వెలుగుతున్న కొవ్వొత్తివలె ఆ గూటిని; ఆ మనస్సుని ఆ శరీరమును మండించును. ఈ రకంగా మానవుడు చేయు ఏ ఉపాయములతోను ఇంద్రియములను పావురాల్లాగ వాటి వాటి గూళ్ళలో ఉంచడానికి  ఉంచడానికి సాధ్యం కాదు.

తన కల్పిత లోకములో నిర్లక్ష్య యాత్రికుడు: మొదటిసారి ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఏమిటిది మసక మసకగా ఉంది అనిపిస్తుంది. మాగ్రిట్టే యొక్క సూక్ష్మమైన మరియు ఖచ్చితమైన రంగు ఉపయోగం, అలాగే అతని రూపాన్ని ఖచ్చితమైన రెండరింగ్, వాస్తవికత, అవగాహన మరియు అపస్మారక స్థితిపై లోతైన ధ్యానంలోకి వీక్షకులను ఆకర్షిస్తుంది.

అప్రమత్తము లేని జీవితము: ఈ చిత్రమునకు "నిర్లక్ష్య యాత్రికుడు" అని పేరు పెట్టి చెప్పకనే యథాలాపముగా వుండు మన స్వభావమును నిరూపించారు. ఇక్కడ ఇంద్రియములను ఒక బీరువాలో ఉంచినట్టుగా నిలిపి పైన మానవుడు ఉదాసీనతతో పడుకున్నట్టు చూపించారు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క క్షణం కూడా అప్రమత్తముగా లేకుండా చూసుకో లేకపోతే తిరిగి తిరిగి వాటి బారిన పడతాము అన్న విషయాన్ని చెబుతున్నారు ఇది ముఖ్యంగా గమనించమన్నారు.

x-x-x-x


సాంఖ్య యోగము. 2-65 & 66వ శ్లోకములు

శ్లో|| ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే
।। 65 ।।

టీక:- ప్రసాదే = మనోనైర్మల్యము (చిత్తశాంతి) కలుగగా; అస్య = ఇతనికి, సర్వ దుఃఖానామ్ = సమస్తదుఃఖములయొక్కయు; హానిః = వినాశము; ఉపజాయతే = కలుగుచున్నది; ప్రసన్న చేతసః = నిర్మలమనస్సు గలవానికి; బుద్ధిః= బుద్ధి; ఆశు = శీఘ్రముగ; పర్యవతిష్ఠతి హి= (పరమాత్మయందు) స్థిరముగ నిలుచునుగదా!

భావము:   మనోనిర్మలత్వము కలుగగా దానివలన మనుజునకు సమస్తదుఃఖములున్ను ఉపశమించిపోవు చున్నవి. నిర్మలమనస్కునకు బుద్ధి శీఘ్రముగ (పరమాత్మయందు) స్థిరత్వమును జెందుచున్నది.

శ్లో|| నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్
।। 66 ।।

టీక:- అయుక్తస్య = ఇంద్రియనిగ్రహము లేనివానికి (ఇంద్రియములను, మనస్సును అరికట్టలేని వానికి); బుద్ధిః = వివేక ముతో కూడిన​ బుద్ధి; నాస్తి = కలుగదు; అయుక్తస్య = ఇంద్రియనిగ్రహము లేనివానికి; భావనాచ =ఆత్మచింతనయు; న = కలుగనేరదు; అభావయతః = ఆత్మచింతనలేనివానికి; శాంతిః చ = శాంతియు;, న =కలుగదు; అశాస్తస్య = శాంతిలేనివానికి; సుఖమ్ = సుఖము; కుతః = ఎక్కడిది?

భావము: ఇంద్రియనిగ్రహము, మనస్సంయమము లేనివానికి వివేకబుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికిక సుఖమెచట?